28.7 C
Hyderabad
April 24, 2024 03: 57 AM
Slider ఆదిలాబాద్

ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో ఆర్థికంగా ఎదగాలి

దళిత బంధు పేరుతో షెడ్యూలు కులాల వారికి ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్ లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధ్యక్షతన నిర్వహించిన బాబు జగ్జీవన్ రావ్ 115వ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా బాబు జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో 177 మంది లబ్ధిదారులను మొదటి విడతలో ఎంపిక చేశామన్నారు.

దీనిలో 18 మందికి రెబ్బెనలో డెయిరీ యూనిట్స్, ఎనిమిది మందికి ట్రాన్స్పోర్ట్ వాహనాలు అందించనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో మిగతా లబ్ధిదారులకు ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని తెలిపారు.

మొదటి విడత లబ్దిదారులు ఆదర్శంగా ఉండాలి

ఎంతోమంది దళిత బంద్ కోసం ఎదురు చూస్తున్నారని మొదటి విడతలో ఎంపికైన వారు ఆర్థికంగా ఎదిగి వారందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ ప్రతి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు సూట్ ధరించేవాడని దళిత బందు పొందిన వారు ప్రస్తుత  సంవత్సరంలో ఆర్థికంగా ఎదిగి సూటు ధరించేలా కావాలని సూచించారు.

రానున్న ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మరో 3 వేల వరకు దళిత బంధు యూనిట్లు వచ్చే అవకాశం ఉందని అప్పుడు ప్రతి ఒక్కరికి వస్తోందన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 73 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే అభ్యర్థన చేశారని, వీటన్నింటి నిర్మాణానికి కావలసిన స్థలం ఆయా కేంద్రాల్లో సేకరించాలని ఎమ్మార్వోలకు తెలియజేశామన్నారు.

కోటి రూపాయల తో అంబెడ్కర్ భవనం

కాగజ్ నగర్ నియోజకవర్గంలో కూడా త్వరలో స్థల సేకరణ కోసం ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలో స్థలం తక్కువగా ఉన్నందున అందరూ ఒప్పుకుంటే లుంబిని దీక్ష భూమిలో కోటి రూపాయలతో అంబేద్కర్ భవనం నిర్మించుకోవచ్చని దీని కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు.

అంతకుముందు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అసలైన పేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేశామని ఏదైనా అనుమానాలు ఉంటే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పరీక్షించుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు.

తన నియోజకవర్గంలో దళితులకు ఎన్నో రకాల సేవలు చేస్తున్నానని ఉదాహరణలు వివరించారు. ఈనెల 14వ తేదీన కాగజ్ నగర్ లో 50 లక్షల రూపాయలతో నిర్మించతలపెట్టిన బాబు జగ్జీవన్ రావు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు

ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలని సూచించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక సమానత్వం పెంపొందించడం కోసమే దళిత బందు పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు.

“జాతీ నాయకుడు కాని వాడు జాతీయ నాయకుడు కాలేడని” దీనికి నిదర్శనమే జగ్జీవన్ రావు, అంబేద్కర్, జ్యోతి బాపూలే, కొమురంభీం లాంటి వారని గుర్తు చేశారు. ఎస్సీ లలో అభివృద్ధి చెందిన వారు వారి జాతి అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ పాఠశాలలు, గురుకులాల ద్వారా అనేకమంది ఎస్సీలను ఉన్నత స్థాయిలో నిలిపిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

దళిత బంధు పథకం పూర్తిగా భూమి, ఇల్లు లేక కూలీపని చేసుకునేవాళ్ళను మాత్రమే ఎంపిక చేశామని, రెండవ విడతలో ఎంపికకు సంబంధించి అన్ని సంఘాలు సహకరించాలన్నారు. అండ, కండ, ఆర్థిక బలం లేని వారికి దళిత బంధు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఐదు లక్షల రూపాయలతో రానున్న రోజుల్లో కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు.

జగ్జీవన్ రామ్ ఆశయాలు కొనసాగించాలి

దేశానికి దిశా నిర్దేశం చేసే రాజ్యాంగం రాసిన ఘనత అంబేద్కర్ కు దక్కితే, దేశాన్ని నడిపించిన ఘనత జగ్జీవన్ రావు కు దక్కుతుందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ విద్య అభివృద్ధితోనే ఆర్థిక పరిస్థితులు మారుతాయని ఎస్సీలు ఆ దిశగా కృషి చేయాలన్నారు. పేదరికాన్ని చీల్చుకుని వచ్చి ఉన్నత స్థాయికి చేరిన ఎంతో మంది గొప్ప వ్యక్తులు జగ్జీవన్ రావు ఆద్యుడని కొనియాడారు.

జెడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలను అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ఎంపీపీ మల్లికార్జున్  మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో జగ్జీవన్ రావు చౌరస్తాలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు.

అనంతరం దళిత బంద్ పథకం ద్వారా 8 ఆటో ట్రాలీలను, ఎస్సీ సబ్ ప్లాన్ 2018-19 ద్వారా వంద శాతం సబ్సిడీతో 17 కుట్టుమిషన్లు ఆసిఫాబాద్, కెరమెరి మండలం లోని 28 మంది లబ్ధిదారులకు 30000 రూపాయలు చొప్పున చెక్కులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అచ్చేశ్వరరావు డిఆర్ఓ సురేష్, సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, ఎమ్మార్పీఎస్ నాయకుడు రేగుంట కేశవ్ అంబేద్కర్ సంఘం నాయకుడు అశోక్ మహల్కార్, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఈడి సజీవన్,  ఇతర సంఘాల నాయకులు హేమంత్ షిండే, ఉషన్న, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Related posts

ఎంపీటీసీ స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పుదాం!

Sub Editor

అనారోగ్యంతో మరణించిన కుటుంబానికి కౌన్సిలర్ అండ

Satyam NEWS

కాళేశ్వ‌రం త్రివేణిసంగ‌మంలో మాఘపూర్ణిమ స్నానం

Satyam NEWS

Leave a Comment