కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 23 నుంచి 25వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. మొదటిరోజైన జనవరి 23న గురువారం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగరసంకీర్తన కార్యక్రమాలు, పురందర సాహిత్య గోష్ఠి, వివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలు, మధ్యాహ్నం సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.
రెండవ రోజైన జనవరి 24న శుక్రవారం ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్‌సేవ, దాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి.
చివరిరోజు జనవరి 25న శనివారం ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన, హరిదాస రసరంజని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.