దసరా పండుగ వచ్చిదంటే అమ్మవారికి పూజలు, పిండివంటలు, జమ్మి ఆకు ఎలా గుర్తుకు వస్తాయో పాలపిట్ట అలాగే గుర్తుకువస్తుంది. పాలపిట్ట దర్శనంతోనే దసరా సంబురాలు పరిపూర్ణం అవుతాయి. ముఖ్యంగా తెలంగాణలో దసరా రోజు పాలపిట్టను చూడటానికి చిన్నాపెద్దా, పిల్లాజెల్లాతో సహా ఊరు ఊరంతా కదులుతుంది. ఇలా దసరా రోజు పాలపిట్టను చూడటం వెనుక అంతరార్థం ఉంది. పాలపిట్ట శుభాలకు, విజయాలకు చిహ్నం. విజయదశమి రోజున ఈ పిట్టను చూడగలగడాన్ని ఎంతో అదృష్టంగా, శుభసూచకంగా తెలంగాణా ప్రజలు భావిస్తారు. గుప్పెండత ఉండే పాలపిట్ట చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. దసరా పండుగ వచ్చిదంటే పాలపిట్టను చూడాల్సిందే. దానికి మొక్కాల్సిందే. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని నవగ్రహ అనుగ్రహం కలుగుతుందని, దోషాలు తొలిగిపోయి, చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుందని ప్రజల నమ్మకం. ఇంతకూ పాలపిట్టను దసరా నాడే ఎందుకు చూడాలి అంటారా. దాని వెనుక పెద్ద కథే ఉంది. పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట కనిపించిందట. అప్పటినుంచి వాళ్ళకు విజయాలు సిద్ధించాయని జనపదుల నమ్మకం. అందుకే విజయదశమి రోజున పూర్వం మగవాళ్లు తప్సనిసరిగా అడవికి పోయి పాలపిట్టను చూసిగాని ఇంటికి వచ్చేవారు కాదంట. ప్రజల మనసుల్లో ఈ పాలపిట్టకు సాంస్కృతికంగా , పురాణాల పరంగా ఇంత ప్రాధాన్యం ఉంది కాబట్టే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు, కర్నాటక, ఒడిస్సా, బీహార్‌ల రాష్ట్ర పక్షిగా ప్రకటించబడింది. ఇప్పుడు ఈ పక్షి అంతరించిపోయి, దాని జాడే అపురూపమైపోయింది
previous post
next post