ఐటి రంగంలో హైదరాబాద్ తో పోటీ పడేందుకు ఏపిలోని విశాఖపట్నం సిద్ధమౌతున్నది. హైదరాబాద్ కు ఉన్న సౌకర్యాలను కాదని ఐటి పరిశ్రమ ఏపికి తరలివెళ్లే అవకాశం లేదు కానీ, హైదరాబాద్ కు ప్రత్నామ్నాయంగా విశాఖ ఐటి రంగంలో అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ఐటీ రంగంలో పురోగతి సాధించడానికి హైటెక్ సిటీ కీ రోల్ ప్లే చేసిన విషయం తెలిసిందే. దీని వెనుక అప్పటి సీఎం చంద్రబాబు కృషి ఎంతగానో ఉంది. ఇప్పుడు ఏపీలోనూ ఇదే తరహా సిటీ నిర్మాణానికి సిద్ధమవుతోంది కూటమి సర్కార్.
విశాఖలోని మధురవాడ సమీపంలో 500 ఎకరాల్లో డేటా సిటీని డెవలప్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్ డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటు చేయనుంది. డీప్ టెక్నాలజీ, AI, బిగ్ డేటా రంగాలదే భవిష్యత్తు అని భావిస్తున్న ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే డేటా సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రధానంగా ఐటీ రంగాన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంది.
ఐటీ మంత్రి లోకేశ్ ఆలోచనల మేరకు డేటా సిటీ నిర్మాణం జరగనుంది. విశాఖకు వచ్చే ఐటీ కంపెనీలకు డేటా సిటీని సెంటర్‌గా చేయాలన్నది లోకేష్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే విశాఖకు వచ్చేందుకు పలు ఐటీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. TCSతో పాటు ఇన్ఫోసిస్ విశాఖకు రాబోతున్నాయి. TCS కోసం ఇప్పటికే మేధా టవర్స్‌లో ఖాళీ స్థలాన్ని కేటాయించింది సర్కార్. రాబోయే 90 రోజుల్లో TCS కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇక TCS శాశ్వత కార్యాలయం కోసం ప్రభుత్వం ఇప్పటికే 30 ఎకరాలు కేటాయించింది.
విప్రోను సైతం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఆ సంస్థ కూడా విశాఖకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల దావోస్‌లో పర్యటించిన చంద్రబాబు, లోకేష్ బృందం దిగ్గజ కంపెనీలతో చర్చలు జరిపింది. ఆయా సంస్థల కంపెనీల సీఈవోలతో లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో ఉన్న అవకాశాలపై వారికి వివరించారు. ఏపీకి వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలని వారికి సూచించారు. కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌తోనూ లోకేష్ భేటీ అయ్యారు. ప్రపంచంలోని టాప్ 100 కంపెనీలను ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్.
ఐటీ రంగం ద్వారా ఏపీలో 5 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే మొదటి 500 కంపెనీలను ప్రాధాన్యంగా తీసుకుని దేశంలో ఎవరూ ఇవ్వనంత తక్కవ ధరకు భూములిస్తామని ఆఫర్ ఇచ్చారు లోకేష్. రాబోయే రోజుల్లో విశాఖపట్నం కూడా ఐటి హబ్ గా మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.