ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన భారత్ అంతర్గత విషయాలని, అంతర్జాతీయ సమాజానికి వీటితో ఎలాంటి సంబంధం లేదని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేడు రహస్య సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో భారత్ పాకిస్తాన్ లు రెండూ సభ్యులు కాదు కాబట్టి పాల్గొనలేదు. జమూ కాశ్మీర్ కు సంబంధించి ఆగస్టు 5న భారత్ తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ చైనా పాకిస్తాన్ లు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీని కోసం ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి రహస్య సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం సయ్యద్ అక్బరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ విషయం పూర్తిగా భారత్ అంతర్గత విషయమని మరొక మారు స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి కాశ్మీర్ లో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను వివరించామని, అతి త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనబోతున్నాయని తెలుసుకు భద్రతా మండలి సంతోషం వ్యక్తం చేసిందని అక్బరుద్దీన్ వెల్లడించారు. కాశ్మీర్ అంశంపై ఎవరూ ఆక్షేపించాల్సిన అవసరం లేదని, అది తమ స్వవిషయమని తెలిపారు. భారత్ అందతర్గత అంశాలపై పదే పదే మాట్లాడటం కన్నా తమ దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాదాన్ని అదుపు చేసుకుంటే మంచిదని పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ హింస మార్గాన్ని విడనాడి ఉగ్రవాదాన్ని అదుపు చేయగలిగితే వారితో చర్చించడానికి భారత్ కు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం పాకిస్తాన్ రాయబారి మలీహాలోథీ మాట్లాడుతూ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి జమ్మూ కాశ్మీర్ ప్రజలు బాధలను, మనోవేదనను వినడం సంతోషించదగిన పరిణామమని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు గొంతుక వినిపించడంలో తాము సఫలమయ్యామని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ పై ఐక్యరాజ్య సమితి తుది సారిగా 1965లో విన్నది. అంతకు ముందుగానీ ఆ తర్వాత గానీ కాశ్మీర్ అంశంపై చర్చ జరగలేదు.