తమ అభ్యర్థులను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు ఆదేశించారు. ఎల్‌జీ కార్యాలయానికి ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ చేసిన ప్రతిపాదనకి ప్రతిస్పందనగా ఈ ఆదేశాలు వచ్చాయి. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఆరోపించారు.
బిజెపి ఆరోపణను కొట్టిపారేసింది. ఇలాంటి ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 16 మంది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థులకు మంత్రి పదవులు ఇస్తామని, పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ. 15 కోట్లు ఇస్తామని బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చాయని ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో కేజ్రీవాల్ పేర్కొన్నారు. ” బిజెపికి 55 సీట్ల కంటే ఎక్కువ వస్తున్నట్లు కొన్ని ఎగ్జిట్ పోల్స్ చూపిస్తున్నాయి. మరి వాస్తవపరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. గత రెండు గంటల్లో మా అభ్యర్థులలో 16 మందికి బిజెపీ ఆఫర్లు ఇస్తున్నది. ఆప్‌ని వదిలి తమ పార్టీలో చేరితే, వారిని మంత్రులుగా చేస్తామని, ఒక్కొక్కరికి రూ. 15 కోట్లు ఇస్తామని కాల్స్ వచ్చాయి” అని కేజ్రీవాల్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో హిందీలో తన పోస్ట్‌లో తెలిపారు.
“వాస్తవంగా 55 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుంటే, మా అభ్యర్థులను ఎందుకు పిలుస్తున్నారు? ఈ నకిలీ సర్వేలు ఆప్ అభ్యర్థులను విచ్ఛిన్నం చేసే వాతావరణాన్ని సృష్టించే కుట్ర. కానీ వారిలో ఒక్కరు కూడా పార్టీ మారరు” అని ఆయన నొక్కి చెప్పారు.