పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కు గురికావడంపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభం అయింది. గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన విషయం సత్యం న్యూస్ పాఠకులకు తెలిసిందే.
ఈ ఘటన పై జిల్లా కలెక్టర్ ఇ. శ్రీధర్ ఆదేశాలతో శుక్రవారం చంద్రకల్ ఉన్నత పాఠశాలను ఉదయం 9 గంటలకే సందర్శించిన డీఈవో గోవిందరాజులు విచారణ చేపట్టారు. పాఠశాల ఆవరణంలోని వంటగదిని, సరకులను, వంటకు ఉపయోగించే వస్తువులను, విద్యార్థులు తాగేందుకు వినియోగించే నీటి ట్యాంక్ ను ఆయన పరిశీలించారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, వంటవాళ్లను విడివిడిగా పిలిచి విచారణ చేపట్టారు. వారి నుంచి లిఖితపూర్వక సమాధానాలు కూడా తీసుకున్నారు. విచారణతో తేలిన అంశాలను జిల్లా కలెక్టర్ కు సమర్పించి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు డిఇవో వెల్లడించారు.
మధ్యాహ్నం భోజనం నాణ్యతకు సంబంధించి రిజిస్టర్ లో విద్యార్థుల, తల్లిదండ్రుల అభిప్రాయాలను రిజిస్టర్ లో నమోదు ఎందుకు చేయలేదని ఆయన ఉపాధ్యాయులను ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత లేకుండా వండుతున్నారని విద్యార్థులు డిఇవోకు ఫిర్యాదు చేశారు.
మధ్యాహ్న భోజన బియ్యం రిజిస్టర్ ను అప్ డేట్ చేయలేదు ఎందుకని వంటవారిని ఆయన ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనానికి వినియోగించే సరుకులను, నీటిని పరీక్ష కై శాంపిల్ ను సేకరించారు. మండల విద్యాధికారి చంద్రుడుతో కలిసి పాఠశాలలో ఈ విచారణ నిర్వహించారు.
అంతకుముందు నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 22 మంది విద్యార్థులతో ఆయన మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని 11 గంటలకు విద్యార్థులందరినీ డిశ్చార్జ్ చేయనున్నట్లు డాక్టర్లు తెలిపారు.