39.2 C
Hyderabad
April 25, 2024 17: 38 PM
Slider పశ్చిమగోదావరి

కొత్త జిల్లా ఏర్పాటు జంగారెడ్డిగూడెం కు లాభమా? నష్టమా?

#Jangareddygudem RTC Bustand

రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవిన్యూ డివిజన్ ల పై దృష్టి పెట్టి వాటిని ఏర్పాటు చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎటువంటి పరిపాలన సంస్కరణలు లేకుండా కాలక్షేపం చేసేసారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తా అని హామీ ఇచ్చిన కొత్త ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వెయ్యడం హర్షించ దగ్గ విషయం. ఆ ప్రకారం చూస్తే పశ్చిమగోదావరి జిల్లా రెండుగా  విడిపోవడం ఖాయం. ఇప్పటి ప్రస్తుత జిల్లా పరిస్థితి చూస్తే భౌగోళిక పరం గా చూస్తే  మద్రాస్, కలకత్తా  గ్రాండ్ ట్రంక్ రోడ్, రైలు మార్గం  జిల్లాను డెల్టా, మెట్టగా విడదీస్తున్నాయి.

ఒక వైపే కేంద్రీకృతమై ఉన్న ధనవంతమైన ప్రాంతాలు

దేశ వ్యాప్తంగా గోదావరి జిల్లాలు ధనవంతమైన జిల్లాలుగా పేరున్నా, వాస్తవంలో ఒక ప్రాంతం అభివృద్ధిలో, మరో ప్రాంతం వెనుకబాటుతనంలో ఉంది. జిల్లా పై పూర్తి ఆధిపత్యం కూడా డెల్టా ప్రాంతం దే. అది రాజకీయంగా కూడా చాలా ప్రభావం చూపింది. 

భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తణుకు వంటి పట్టణాలు పూర్తి డెల్టాకు చెందగా, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు వంటి పట్టణాలు కుడి వైపు డెల్టా, ఎడమవైపు మెట్ట ప్రాంతం గా ఉన్నాయి. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ఒకే ఒక్క పట్టణం జంగారెడ్డిగూడెం.

దిక్కులేకుండా పడి ఉన్న జంగారెడ్డిగూడెం

దేశంలోనే నియోజకవర్గ కేంద్రం కానీ మున్సిపాలిటీ,  రెవిన్యూ డివిజన్ కేంద్రం గాని ఉందంటే అది ఈ జంగారెడ్డిగూడెం మాత్రమే. ఈ మధ్య ఈ ఊరిపై మరికొన్ని ప్రయోగాలు చేశారు.  గోపాలపురం మండలాన్ని కొవ్వూరు రెవిన్యూ డివిజన్ లో కల్పిన అధికారులు, ఎప్పటి నుండో జంగారెడ్డిగూడెం రెవిన్యూ డివిజన్ లో కలపమంటున్న చింతలపూడి,  లింగపాలెం, కామవరపుకోట, టి. నర్సాపురం మండలాలను కల్పించడంలో పూర్తి వైఫల్యం.

చింతలపూడి నియజకవర్గం లో జంగారెడ్డిగూడెం ఉండడం తప్పులేదంట, ఆ మండలాలు ఇటు కలిపితే ఆ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి అని సమాధానం. అన్ని అర్హతలు ఉండి జంగారెడ్డిగూడెం లో సగం ఉన్న చింతలపూడి లో ఉండడం జంగారెడ్డిగూడెం ప్రజల మనోభావాలు దెబ్బతినవా, లేక ఇక్కడి ప్రజలకు మనోభావాలు లేవా?

కొత్త జిల్లాల స్వభావంతోనైనా మార్పు రావాలి

ఇటువంటి రాజకీయాలు ఇప్పటికైనా కొత్త జిల్లా ఏర్పాటు  తో తెరపడతాయా? లేక ఈ ప్రాంతం ఇంకా చిన్న చూపుకు గురికానుందా? ఇంక ఏర్పాటయ్యే కొత్త జిల్లా స్వరూపం చూస్తే ఏలూరు కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం, నూజివీడు మాత్రమే మున్సిపాలిటీ లు.

నగరపంచాయితి హోదా ఇస్తే చింతలపూడి, కైకలూరు పట్టణ హోదా పొందుతాయి. ప్రస్తుత జిల్లాలోని ప్రధాన పట్టణాలన్ని వేరే జిల్లాలకు వెళ్తుండగా , కృష్ణా జిల్లా ముఖ్య పట్టణమైన నూజివీడు కొత్త జిల్లాలో కలుస్తున్నది. ఆ ప్రకారం జనాభా పరంగా ఏలూరు, నూజివీడు తర్వాత పెద్ద పట్టణం జంగారెడ్డిగూడెం.

2011 జనాభా లెక్కల ప్రకారం నూజివీడు, జంగారెడ్డిగూడెం కంటే కేవలం 9 వేల జనాభా మాత్రమే ఎక్కువ. 2021 జనాభా లెక్కల్లో ఆ వ్యత్యాసం మారిపోవచ్చు. ఎందుకంటే ఈ పది సంవత్సరాలలో జంగారెడ్డిగూడెం జనాభా విపరీతంగా పెరగడమే.

శివారు గ్రామలైయిన శ్రీనివాసపురం, చక్రదేవరపల్లి, గుర్వాయిగూడెం, నాగులగూడెం మున్సిపల్ పరిధికి వస్తే జనాభా 75 వేల పైనే. ( రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీ లలో శివారు గ్రామాలు కలిపితే, అసలు ఆ ఊసు ఎత్తని మున్సిపాలిటీ ఒక్క జంగారెడ్డిగూడెం మాత్రమే. దానికి అనేక కారణాలు ఇక్కడ ప్రముఖులకు అది ఇష్టం లేదు).

స్థల సమస్యతో వెనక్కిపోతున్న అభివృద్ధి

కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లా యూనిట్ గా తీసుకుని మంజూరు చేస్తుంది కాబట్టి, ఎవయిన పథకాలు వచ్చినప్పుడు ఏలూరు తర్వాత పెద్ద పట్టణాలకు అవకాశం వస్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాలకు వర్తించింది. ఇక్కడ మనం ఆలోచించుకోవాలి.

ఏదైనా పథకం వస్తే ఏలూరు, తర్వాత నూజివీడు , జంగారెడ్డిగూడెం కె అవకాశం . కానీ ఇక్కడి పరిస్థితి వేరు. జంగారెడ్డిగూడెం కు ఏమి కేటాయించినా ఇక్కడ స్థల సమస్య. దశబ్ధం క్రింద వచ్చిన కోర్ట్, పాలిటెక్నిక్ కళాశాలకు స్థల సేకరణ అనేక సమస్య లకు దారి తీశాయి. కానీ నూజివీడు చుట్టు పక్కల వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడం తో  అక్కడికే ఎక్కువ అవకాశం ఇస్తారు.

లిటిగెంట్లు ఉన్నంత కాలం జంగారెడ్డి గూడెం ఇంతే

ప్రభుత్వ భూములు ఆక్రమించి కోర్ట్ లలో కేసులు వేయించి అభివృద్ధికి తూట్లు పొడిచే నాయక గణం ఉన్నంతవరకు జంగారెడ్డిగూడెం కు కొత్త కార్యాలయాలు, ప్రభుత్వ కళాశాలలు, పరిశ్రమలు రావడం చాలా కష్టం.  ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రహదారి, సత్తుపల్లి – కొవ్వూరు రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతం రవాణా పరంగా అభివృద్ధి సాధిస్తుంది.

కానీ ఆ రెండు  ప్రాజెక్ట్ లకు స్థల సేకరణ ఇక్కడ ప్రధాన సమస్య కాబోతున్నది. జిల్లాలో కొల్లేరు సరస్సు తర్వాత ఈ ప్రాంతమే పర్యాటక ప్రాంతం. మద్ది దేవాలయమే జిల్లాలో అతి పెద్ద దేవాలయం కాబోతున్నది.  తాడు వాయి సమీపంలో పునరావాస కేంద్రాలు ప్రారంభం అయితే పెరిగిన జనాభా ప్రభావం జంగారెడ్డిగూడెం పై ఎక్కువ పడుతుంది.

జిల్లాలో ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం మాత్రం బస్ డిపో కేంద్రాలు కాబట్టి మన డిపో స్థాయి పూర్తిగా పెరుగుతుంది. ఇప్పటికి ఏలేరుపాడు, కుక్కునూరుకు భద్రాచలం బస్సులు దిక్కు.

కొత్త జిల్లాలో జంగారెడ్డిగూడెం కు మంచి అవకాశం రాబోతున్నది.అభివృద్ధి చేసుకుంటామో, పాడుచేసుకుంటామో మన చేతుల్లోనే ఉంది.  ఇది ఎవర్ని విమర్శిస్తూ రాస్తున్నది కాదు. జంగారెడ్డిగూడెం ప్రజలకు ఒక హెచ్చరిక. కళ్ళు తెరవక పోతే నియోజకవర్గం కేంద్రం కూడా సాదించుకోలేని స్థితి కొనసాగుతుంది. రాజకీయాలకు అతీతంగా సాధిచుకుంటేనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమౌతుంది.

– అచ్యుత శ్రీనివాస్ (న్యాయవాది)

Related posts

11వ PRC సూచించిన కనీస వేతనం తక్షణమే అమలు చేయాలి

Satyam NEWS

అన్నీతానై నడిపించిన ఏఎస్పీ..ఇంచార్జ్ న‌గ‌ర డీఎస్పీ అనిల్…!

Satyam NEWS

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్ మంజూరు

Satyam NEWS

Leave a Comment