ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై సోమవారం మరోమారు రాజకీయ వేడి రాజుకుంది. సీఎం హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుపైై అధికారులతో సమీక్షించిన చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు జాప్యం కావడానికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపించారు. అంతేకాకుండా సదరు జాప్యం ఎలా జరిగిందన్న దానిపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ సర్కారు అసంబద్ధ నిర్ణయాల కారణంగా ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందని, ఆ తప్పుల కారణంగా ఏకంగా రూ.15 వేల కోట్ల మేర నష్టం జరిగిందని కూడా చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ వేగంగా స్పందించింది. వైసీపీ జమానాలో జల వనరుల శాఖ మంత్రిగా కొంతకాలం అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తే… మరికొంత కాలం పాటు అంబటి రాంబాబు ఆ శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై అనిల్ స్పందించకున్నా… అంబటి మాత్రం ఆఘమేఘాలపై స్పందించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లనే పోలవరం ప్రాజెక్టులో జాప్యం జరిగిందన ఆయన ఆరోపంచారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం ఎవరు అని ప్రశ్నించిన అంబటి… కాఫర్ డ్యాం కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ ఎవరైనా కడతారా? అని నిలదీశారు. పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే ఆరోపించారని ఆయన గుర్తు చేశారు.
ఈ వ్యాఖ్యలను మోదీ నాడు పార్లమెంటు సాక్షిగానే అన్నారన్నారు. 2018లోనే పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారన్న అంబటి… మరి ఆ గడువులోగా ఎందుకు పూర్తి చేయలేకపోయారని నిలదీశారు. ఇటీవల కేంద్రం పోలవరానికి రూ.12,157 కోట్లను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసిన అంబటి… వైసీపీ హయాంలో జరిగిన పనుల కారణంగానే ఈ నిధులు విడుదలయ్యాయని చెప్పారు. లోయర్ కాఫర్, అప్పర్ కాఫర్ డ్యాంల నిర్మాణాలను తామే పూర్తి చేశామని చెప్పిన అంబటి… పోలవరం ప్రాజెక్టులో కీలక పనులన్నీ తమ హయాంలోనే పూర్తి అయ్యాయంటూ చెప్పకొచ్చారు.
చంద్రబాబు వ్యాఖ్యలు, వాటికి ప్రతిగా అంబటి రాంబాబు కౌంటర్లు విన్నంతనే… గతంలో పోలవరం ప్రాజక్టుపై రాంబాబు చేసిన పలు వ్యాఖ్యలను జనం గుర్తు చేసుకుంటున్నారు. అనిల్ ను మంత్రివర్గం నుంచి తప్పించిన జగన్… ఆయన స్థానంలో అంబటిని తీసుకుని కీలకమైన జల వనరుల శాఖను అప్పగించారు. ఈ సందర్భంగా పలు మార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన అంబటి… తన తెలివితక్కువ తనాన్ని బయటపెట్టుకున్నారు.
సాగు నీటి రంగంపైనా, ప్రాజెక్టులపైనా తనకు ఎంతమాత్రం అవగాహన లేదన్న విషయాన్ని కూడా ఆయన తనకు తానుగానే బయటపెట్టుకున్నారు. కనీసం టీఎంసీ అంటే ఏమిటో కూడా తనకు తెలియదని స్వయంగా అంబటే చెప్పిన వైనం నాడు తెగ వైరల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. అంటే… టీఎంసీ అంటే ఏమిటో కూడా తెలియని అంబటి… అన్ని విషయాలపై సమగ్ర పట్టు ఉన్న చంద్రబాబును విమర్శించడం ఏమిటని నెటిజన్లు సెటైర్లు సంధిస్తున్నారు. చదువు రాని వ్యక్తులకు పదవులు ఇస్తే ఇలాగే ఉంటుందని చాలా ంది నేతలు అంబటి తీరుపై మండిపడుతున్నారు. మొత్తంగా చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించేందుకు ఎగేసుకుని వచ్చిన అంబటి… తానే అందరికీ టార్గెట్ అయిపోయారన్నమాట.