కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు రావడం లేదు- ఈ ఆరోపణ ప్రతి సారీ నివిపిస్తూనే ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాకుండా వేరే పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రమైనా ఇదే చెబుతూ ఉంటుంది. ఈ సెంటెన్సు లో నిజం ఉంది, అబద్ధమూ ఉంది. ఎందుకంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే లేదా వచ్చేనిధులు వివిధ క్యాటగిరీలలో ఉంటాయి. కేంద్రం అన్నీ కలిపి చెబుతుంది, రాష్ట్రాలు (ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నవి) విడివిడిగా చెబుతాయి. అంతే తేడా. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పన్నుల మొత్తాన్ని కలిపి కొన్ని సూత్రాలు తయారు చేసుకుని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ నిధులను వితరణ చేస్తుంటుంది.
దీనికి ఒకటో రెండో కొలమానాలు ఉంటే బాగుండేది కానీ చాలా మంది అర్ధం చేసుకోలేని విధంగా ఈ సూత్రాలు ఉంటున్నాయి. రాష్ట్రాలకు నిధులను కేటాయించేందుకు కేంద్రం చట్టబద్ధమైన ఆర్ధిక సంఘాలను నియమిస్తూ ఉంటంది. ఐదు సంవత్సరాల కాలపరిమితి గల ఈ ఆర్ధిక సంఘాలు అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్ని సూత్రాలు తయారు చేసుకుని పన్నుల వాటా ధనం వితరణకు మార్గదర్శకాలు రూపొందిస్తాయి. 2020 – 2025 ఆర్ధిక సంవత్సరాలకు నిధుల వితరణ మార్గదర్శకాలను రూపొందించేందుకు ఎన్ కె సిన్హా ఆధ్వర్యంలో 15వ ఆర్ధిక సంఘాన్ని 2017 నవంబర్ లో కేంద్రం నియమించింది.
14వ ఆర్ధిక సంఘం కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల శాతాన్ని గణనీయంగా పెంచింది. అప్పటి వరకూ కేంద్రం నిధుల నుంచి 32 శాతం మాత్రమే రాష్ట్రాలకు బదిలీ అయ్యేవి కాగా దాన్ని ఏకంగా 42 శాతానికి 14వ ఆర్ధిక సంఘం పెంచింది. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసుకోవడానికి వీలుగా అతి తక్కువ నిబంధనలతో నిధుల బదిలీ ఉండాలని కూడా 14వ ఆర్ధిక సంఘం సూచించింది. రాష్ట్రాలకు నిధుల వితరణ కోసం జనాభా, రాష్ట్రాల అవసరం, రాష్ట్ర విస్తీర్ణం, మౌలిక సదుపాయాల ఆధారంగా మార్కులు వేసుకుని దానికి అనుగుణంగా కేంద్రం నుంచి నిధులను బదిలీ చేయాలని సిఫార్సు చేశారు.
దానికి అనుగుణంగానే కేంద్రం ఇప్పటి వరకూ నిధులను బదిలీ చేస్తూ వస్తున్నది. మిగిలిన పెరామీటర్ల పైన రాష్ట్రాలు ఏకీభవించినా జనాభా లెక్కల వివరాలు సేకరించే సంవత్సరంపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అప్పటి వరకూ 1971 జనాభా లెక్కలను తీసుకుని ఆ దామాషా ప్రకారం నిధుల విడుదల జరిగేది. – సత్యం న్యూస్ – 14వ ఆర్ధిక సంఘం జనాభా లెక్కల కోసం 2011 జనాభా లెక్కలను ఆధారం చేసుకున్నది. 1971- 2011 మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాలు జనాభాను పూర్తిగా అదుపు చేసుకోగా, ఉత్తరాది రాష్ట్రాలలో వెనుకబాటు తనం కారణంగా జనాభా అదుపు కాలేదు.
అందువల్ల జనాభా లెక్కలు తీసుకునే సంవత్సరం మార్చడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వడం వల్ల జనాభాను అదుపు చేసుకుని అభివృద్ధి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు శిక్షవేసినట్లు అయింది. అదే విధంగా ఉన్న నిధులను జాగ్రత్తగా ఖర్చు చేసుకుని పురోగమిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు మరో అన్యాయం జరిగింది. కేంద్ర పన్నుల వాటా ఇచ్చేందుకు తలసరి ఆదాయం పరిగణన లోకి తీసుకున్నారు.
దాంతో విచ్చలవిడి ఖర్చులు చేసిన ఉత్తరాది రాష్ట్రాలలో తల సరి ఆదాయం పెరగలేదు. ఇది కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే. అడవులు అదనంగా ఉన్న రాష్ట్రాలు మౌలిక సదుపాయాలు సమకూర్చుకోలేవు కాబట్టి 14వ ఆర్ధిక సంఘం అలాంటి రాష్ట్రాలకు అదనపు నిధులు ఇచ్చేసూత్రాన్ని రూపొందించింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని 14 వ ఆర్ధిక సంఘం కేంద్రం పన్నుల వాటా నుంచి ఆంధ్రప్రదేశ్ కు 73,979 కోట్లు, తెలంగాణకు 83,738 కోట్లు సిఫార్సు చేసింది. అతి చిన్న రాష్ట్రం అయినా వెనుకబడి ఉన్నందున గోవాకు 2,20,960 కోట్లు, హర్యానాకు 1,16,179 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ కు 1,06,285కోట్లు ఇలా కేటాయింపులు జరిపింది.- సత్యం న్యూస్ -అయితే వాస్తవ పరిస్థితి చూస్తూ పన్నులు బాగా వసూలు చేసిన రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగింది.
మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు తాము వసూలు చేసిన పన్నుల్లో నూటికి కేవలం 30 రూపాయలు మాత్రమే తిరిగి కేంద్రం నుంచి పొందగలిగాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు తాము వసూలు చేసిన పన్నులకు 150 నుంచి 200 శాతం వరకూ అదనంగా పొందగలిగాయి. ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతం తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల లోని కొన్ని ప్రాంతాల కన్నా ధనిక ప్రాంతం. అయినా దానికి ఎక్కువ నిధులు వెళ్లాయి. ఇదే కాకుండా 14వ ఆర్ధిక సంఘం గ్రాంట్ ఇన్ ఎయిడ్ పై కూడా మార్గదర్శకాలు రూపొందించింది. ప్రకృతివైపరిత్యాలు, స్థానికసంస్థలు, రెవెన్యూ లోటు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని 12 శాతం నిధులను రాష్ట్రాలకు ఇవ్వాలని కూడా కేంద్రానికి సూచించింది.
ఇప్పుడు 15వ ఆర్ధిక సంఘం 14వ ఆర్ధిక సంఘం మౌలిక సూత్రాలను మార్చలేకపోవచ్చు. మేం వసూలు చేసిన పన్నులంత కూడా మాకు రావడం లేదు అని రాష్ట్రాలు చెప్పడానికి ఇదే కారణం. రాష్ట్రాల నుంచి వచ్చిన పన్నుల వాటాను వారికి అందిస్తూనే ఉన్నామని కేంద్రం చెప్పడానికీ ఇదే కారణం. అన్యాయం అనుకుంటే అన్యాయం, న్యాయం అనుకుంటే న్యాయం.
సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్