32.2 C
Hyderabad
March 28, 2024 21: 41 PM
Slider ప్రత్యేకం

అద్వితీయుడు, క్రికెట్ ధీరుడు ధోనీ

#MSDhoni

మహేంద్ర సింగ్ ధోనీ. ఎప్పటికీ మరచిపోలేని పేరు. అంతర్జాతీయ క్రికెట్ నుండి స్వచ్ఛందంగా విరమణ తీసుకున్నాడు. ఇప్పుడు క్రీడా ప్రపంచంలో ఇదే పెద్ద టాపిక్. అభిమాన లోకమంతా నేడు స్మరిస్తున్న పేరు ధోనీ. అద్వితీయుడు అంటే, అటువంటివాడు రెండవవాడు ఇంకొకడు లేడు అని అర్ధం.

ధీరుడు అంటే, విజయాన్ని, అపజయాన్ని సమానంగా తీసుకోగలిగిన యోగి అని అర్ధం. ఈ రెండూ గొప్పలు చాలా అరుదైనవి. ఈ అరుదైన అద్భుతాలు సొంతం చేసుకున్న ఐశ్వర్యవంతుడు ధోనీ. గొప్ప కెప్టెన్ లు,బ్యాట్స్ మెన్, గొప్ప వికెట్ కీపర్లు క్రికెట్ ప్రపంచంలో కొందరు ఉండవచ్చు గాక.

దేశ ప్రతిష్టను పెంచిన వీరుడు

కెప్టెన్సీ-వికెట్ కీపింగ్ -బ్యాటింగ్ లో సమప్రతిభ, ఫలితాలు చూపించిన ప్రపంచ నెంబర్:1 క్రికెట్ ఆటగాడు ధోనీ మాత్రమే. ఇక వికెట్ కీపింగ్ లో,ఈ 15 సంవత్సరాల్లో ఇతనే నెంబర్:.1.రెండుసార్లు భారతదేశానికి  ప్రపంచ కప్పులందించిన ఒకే ఒక కెప్టెన్. ప్రపంచ చరిత్రలో ఇతని స్థానం ప్రథమశ్రేణి.

భారతీయ క్రికెట్ చరిత్రలో అగ్రస్థానం. ఇటువంటి వాడు మళ్ళీ ఎప్పుడు పుడతారో ఇప్పుడే చెప్పలేం. కెప్టెన్ గానూ మిస్టర్ కూల్. ఆటగాడుగా ఉన్నప్పుడు కెప్టెన్ కు  అద్భుతంగా సహకరించాడు. కెప్టెన్ అయినప్పుడు తోటి ఆటగాళ్ళందరినీ కలుపుకొని వెళ్తూ, ప్రోత్సాహాన్ని అందిస్తూ, అట్టడుగు ఆటగాడికి కూడా స్ఫూర్తి, ధైర్యాన్ని నింపుతూ ధోనీ చూపించిన నాయకత్వ లక్షణాలు  ప్రపంచ కెప్టెన్ లందరికీ ఆదర్శప్రాయం.

ధోనీ దారిలో నడవడం ఇంకొకరికి అసాధ్యం. తాను కెప్టెన్ గా దిగిపోయిన తర్వాత కూడా, తర్వాత వచ్చిన కెప్టెన్ కు అందించిన సహకారం, ఒదిగిపోయిన లక్షణం కూడా ఆషామాషీ కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే, ధోనీది విలక్షణమైన వ్యక్తిత్వం, విభిన్నమైన ప్రతిభ.

కుర్రకారు నుంచి అసామాన్యుల వరకూ ధోనీ అంటే ఇష్టమే

స్కూల్స్ ఎగ్గొట్టే క్రికెట్ పిచ్చి కుర్రకారు మొదలు, కోట్లాది మందిని ప్రభావితం చేసిన అబ్దుల్ కలామ్ వరకూ  ధోనీ అంటే ఎంతో ఇష్టం. చెప్పలేని ఆరాధనా భావం. ఏ గొప్ప క్రికెటర్ తో పోల్చలేని గొప్పతనం కేవలం ధోనీ సొత్తు. ప్రతిభ, రాణింపు, మంచితనం కలగలసిన మూర్తిమత్వం ధోనీ.

దేశంలో అత్యంత  వెనుకబడిన బీహార్,జార్ఖండ్ ప్రాంతాల నుండి టార్జాన్ లా వచ్చిన,ఈ అబ్బాయి క్రికెట్ లోనూ టార్జాన్. క్రికెట్ ను చెస్ లాగా ఆడే మేధావి. లెక్కలు ఎరిగిన దార్శనికుడు. నియమావళి తెల్సిన నిబద్ధుడు. ఈ తెలివి బ్యాటింగ్ లో, వికెట్ కీపింగ్ లోనూ చూపించిన విలక్షణుడు.

పిచ్, వాతావరణాన్ని చిటికలో అధ్యయనం చేసి, బౌలర్లకు ఊహాతీతమైన వ్యూహాత్మక సూచనలు చేయడంలో నేర్పరి. ఇక,  స్టంపింగ్స్ లో కింగ్.350 వన్డేల్లో 123 స్టంపులు చేశాడు. ఇందులో ఎక్కువ శాతం  సెకన్ కంటే కూడా ఎంతో తక్కువ సమయంలో చేసినవే.

యువరాజ్ ను నిలబెట్టిన తీరు

సూక్ష్మాతి సూక్ష్మమైన కాలంలో స్టంపులు చేసిన సూక్ష్మగ్రాహ్య ప్రతిభామూర్తి. 2007 వన్డే ప్రపంచ క్రికెట్ సమయంలో  భారతీయ టీమ్ పరిస్థితి ఘోరాతి ఘోరం. అటువంటి పరిస్థితి నుండి మన టీమ్ ను నడిపిన తీరు అద్భుతం. యువరాజ్ -ధోనీ జంట చూడ ముచ్చటైంది.

పాపం!యువరాజ్ కాన్సర్ బారినపడిన తర్వాత , ఒక్కడే క్రీడా క్షేత్రంలో నిల్చొని, వండర్స్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోపీ గెలిచి,ఐ సి సి టోర్నీలన్నీ గెలిచి చూపించిన ఏకైక కెప్టెన్ కూడా ధోనీ. అంతటి కోహ్లీ కూడా ధోనీని ఒకరకంగా గురువుగా  భావిస్తాడు. కోహ్లీకి అంత ఇష్టం. క్రికెట్ లో గెలవడం ఒక్కటే పరమావధి కాదు, అద్భుతంగా ఆడడం కూడా ధోనీ  దృష్టిలో గెలుపే.

మానసిక పరిపక్వత ఉన్న వివేకవంతుడు

ఆట ద్వారా అభిమానులకు అనిర్వచనీయమైన వినోదాన్ని పంచడం కూడా అతని దృష్టిలో గెలుపే. గొప్ప మానసిక పరిపక్వత ఉన్న వివేకవంతుడు ధోనీ. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడంటే, ధోనీ ప్రభావం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.

క్రికెట్ లో ఎంత రాణించాడో, వాణిజ్య ప్రకటనల్లోనూ అంతే రాణిస్తున్నాడు. సంపద, సుకీర్తి రెండూ  మూటగట్టుకున్న మహార్జాతకుడు కూడా. అతనిపై పెద్దగా వివాదాలు కూడా ఏమీ లేవు. కొన్ని వచ్చినా,కాలపరీక్షలో అవి నిలబడలేదు.

39 ఏళ్ళ వయస్సు వరకూ  ఇంత బాగా ఆడగలగడం అతని శారీరక, మానసిక ఫిట్ నెస్ కు తార్కాణం. ఆట నుండి మాత్రమే వైదొలిగాడు. క్రికెట్ రంగం నుండి కాదు. కోచ్ గా, క్రికెట్ బోర్డు ఛైర్మన్ గా అతని సేవలు బాగా వాడుకోవచ్చు.

 ఆదర్శ క్రీడాగురువు,ప్రఖ్యాత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ లాగా, ధోనీ భారత క్రికెట్ కు కోచ్ గా ఉంటూ కూడా, సొంత క్రికెట్ అకాడెమి స్థాపించడం ఉత్తమోత్తమం. ఉత్తములైన ఆటగాళ్లను జాతికి అందించడంలో ధోనీ సేవలను మనం సద్వినియోగం చేసుకోవాలి.

ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తాయని అభిలషిద్దాం. ఆదర్శ, అద్భుత ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీకి సత్యం న్యూస్ అభినందనలు.

-మాశర్మ సీనియర్ జర్నలిస్టు

Related posts

ధరణి పెండింగ్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

చట్టాలపై అవగాహనకలిగి ఉంటే సత్వర న్యాయం దక్కుతుంది

Satyam NEWS

ఏలోపింగ్ టీచర్: ఆమెకు 26 అతనికి 14 లేచిపోయారు

Satyam NEWS

Leave a Comment