మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో మళ్లీ వివాదాలు తారస్థాయికి చేరాయి. మా అధ్యక్షుడు నరేష్ పనితీరుపై ఈసీ మెంబర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరేష్‌ను కాదని, జనరల్ మీటింగ్‌కు హాజరుకావాలని, ఈసీ సభ్యులకు జీవిత-రాజశేఖర్ సందేశాలు పంపడం తాజా దుమారానికి కారణమైంది. సమావేశం గందరగోళంగా జరగడంతో కొందరు సభ్యులు అలిగి వెళ్లిపోయారు. మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు పృథ్వీ ఈ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు తాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలా ఫీలవుతున్నారని ఆరోపించారు. ప్రతి దానికీ జీవితను తప్పు పట్టడం కొందరికి అలవాటుగా మారిందన్నారు. జరుగుతున్న పరిణామాలు తనని బాధించాయని అన్నారు. 400 సినిమాలకు రచయితగా పనిచేసిన పరుచూరి గోపాలకృష్ణకు అవమానం జరిగిందని ఆరోపించారు. చిరంజీవి, కృష్ణంరాజు ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. అర్జెంట్‌గా మీటింగ్ అని తిరుపతి నుంచి వస్తే, ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 400 సినిమాలకు రచయితగా పనిచేసిన మా గురువుగారు పరుచూరి గోపాలకృష్ణగారిని కూడా మాట్లాడనివ్వడం లేదు. ఆయన నమస్కారం పెట్టినా అవకాశం ఇవ్వలేదు. ఇది చాలా బాధాకరం’’ అని పృథ్వీ పేర్కొన్నారు. సమావేశంలో కొందరి తీరు నచ్చక తాను బయటకు వచ్చేశానని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. అధ్యక్షుడు లేకుండా మీటింగ్ ఎలా పెడతారని మా అధ్యక్షుడు నరేష్ తీవ్రంగా స్పందించారు. ‘‘అధ్యక్షుడు లేకుండా ‘మా’ ఎలా సమావేశం అవుతుంది. న్యాయపరంగానూ దీనిపై మా లాయర్‌ను అడిగి తెలుసుకున్నా. తప్పనిసరిగా అధ్యక్షుడు ఉండాల్సిందే’’అని స్పందించినట్లు సమాచారం. అయితే, సమావేశం పెట్టుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో నరేష్ తప్ప మిగిలిన సభ్యులందరూ దీనికి హాజరుకావడం గమనార్హం. ఇది కేవలం స్నేహపూర్వక సమావేశమని జీవిత-రాజశేఖర్ తెలిపారు.
previous post