36.2 C
Hyderabad
April 24, 2024 22: 16 PM
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ పై భిన్న వివరణలు ఎందుకు?: బీజేపీ

#katipalli

ఎమ్మెల్యే, కలెక్టర్, కమిషనర్ చెప్పేది పొంతన లేదు: కాటిపల్లి వెంకట రమణారెడ్డి

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై భిన్నంగా వివరణ ఇస్తున్నారని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే, కలెక్టర్, కమిషనర్లు చెప్పే విషయాలకు పొంతన కుదరడం లేదన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమణారెడ్డి మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ పై పత్రికల్లో ప్రకటనలు ఇవ్వకుండా ప్రజల ఆక్షేపణలు తీసుకోలేదన్నారు.

విలీన గ్రామాలను కలుపుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేసారని, 2019 లో స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న నాటి కలెక్టర్ సత్యనారాయణ మాస్టర్ ప్లాన్ పై మమ అనిపించి డీడీఎఫ్ కన్సల్టెన్సీ వారికి పంపించారన్నారు. 27.03.2021 నాడు కౌన్సిల్ తీర్మానం అయిందని, దానిలో ఆమోదిస్తున్నట్టుగా హాజరు కోసం చేసిన 49 మంది కౌన్సిలర్లు, నలుగురు కో అప్షన్ సభ్యులు సంతకాలను చూపెట్టారన్నారు.

ఆ రోజు తీర్మానంలో మాస్టర్ ప్లాన్ సవరణ కోసం డీడీఎఫ్ వారికి సవరణ చేసి సమర్పించారని దానిని పరిశీలన చేసి సవరణలను డీడీఎఫ్ సవరించిన మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం వారి ఆమోదం కొరకు పట్టణ, గ్రామీణ ప్రణాళిక హైదరాబాద్ వారికి ప్రభుత్వ డ్రాఫ్ట్ ఆమోదం కొరకు పంపనైనది అని తీర్మానంలో పేర్కొన్నారని తెలిపారు.

ఈ విషయంపై కలెక్టర్ సమాధానం చెప్పాలన్నారు. ముసాయిదా అని చెప్తూ ఎన్నిసార్లు డ్రాఫ్ట్ ఆమోదానికి పంపిస్తారని ప్రశ్నించారు. కౌన్సిల్ తీర్మానం తప్పా.. దీనిపై కమిషనర్ పై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. 2700 ఎకరాల్లో 1195 ఎకరాలు ఇండస్ట్రియల్ జోన్ లోకి తీసుకుని రైతులను అడగకుండా గ్రామ పంచాయతీలకు నోటీసులు పంపించారని తెలిపారు.

860 ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేసి ఆవాస ప్రాంతాలు లేని చోట 700 ఎకరాలకు సంబంధించి దేవునిపల్లి, టెక్రియల్, లింగాపూర్ భూముల నుంచి నాలుగు 100 ఫీట్ల రోడ్లు, ఒక 80 ఫీట్ల రోడ్డును వేశారన్నారు. నగర అభివృద్ధి కోసమే రోడ్లు వేస్తున్నామని చెప్తున్న కలెక్టర్ రామేశ్వర్ పల్లిలో 100 ఫీట్ల రోడ్డు ఎందుకు వేయలేదని, సరంపల్లిలో 80 ఫీట్లు ఎందుకు చేసారని ప్రశ్నించారు.

పాత జాతీయ రహదారిపై 200 ఫీట్లు ఉన్న రహదారిని 150 ఫీట్లకు ఎందుకు కుదించారని, రద్దీగా ఉన్న ప్రాంతంలో 50 ఫీట్లు ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలన్నారు. రూపాయి రూపాయి కూడబెట్టి కాలేజి కోసం రైతులు భూములు కొంటె ఆ భూముల్లోంచి 100 ఫీట్ల రోడ్డు వేస్తారా అని ప్రశ్నించారు. జీవదాన్ ఆస్పత్రి నుంచి జ్ఞానదీప్ కాలేజి మీదుగా అఖిల ఆస్పత్రి వరకు ఉన్న 80 ఫీట్ల రోడ్డును తీసేసారన్నారు.

ప్రైవేట్ వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకుని రోడ్డు క్యాన్సిల్ చేసారని, దేవునిపల్లి ప్రజలు 20 ఫీట్ల రోడ్డులో ఉంటే అక్కడ 60 ఫీట్లు రోడ్డు చేసారని, అక్కడ ఇల్లు కూల్చేస్తారా.. ఇదేనా నగరాభివృద్ది అని నిలదీశారు. నాయకులు, రియల్టర్ల భూముల్లో రోడ్లు వేసేందుకు ఈ రోడ్లను తీసేసారని ఆరోపించారు. పాత మాస్టర్ ప్లాన్ రివైజ్ చేయాల్సిన అవసరం లేదని, అవసరం వీలైతే పెంచాలి తప్ప తగ్గించడానికి వీల్లేదన్నారు.

మాస్టర్ ప్లాన్ లో సంబంధం లేకున్నా రాత్రి 9 గంటలకు బంద్ పాటించాలని పిలుపిలునిస్తే స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్య సంస్థలు బంద్ పాటించాయన్నారు. రైతులకు తమ మద్దతు తెలుపుతూ బంద్ చేస్తే పోలీసులు వారితో షాపులు తెరిచేలా విఫలయత్నం చేశారన్నారు. ఇండస్ట్రియల్ జోన్ లో భూములను చూపినంత మాత్రాన భూములు ఎటు పోవని అధికారులు చెబుతున్నారని, కానీ కోటి రూపాయల విలువ చేసే భూమి 20 లక్షలకు కూడా అమ్ముడు పొదన్నారు.

మాస్టర్ ప్లాన్ లో రోడ్ల కొసం డబ్బులు వసూలు చేసి తిన్నారని, ఇది నిజమని తెలిపారు. రైతుల మద్దతుకు బీజేపీ మద్దతు తెలిపిందని, ఇందులో ఎక్కడ రాజకీయం చేయలేదన్నారు. నెల రోజులుగా ఆందోళనలు చేసినా మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే, కలెక్టర్, ఛైర్మన్, కమిషనర్ స్పందించలేదన్నారు. అందుకే రైతులు తమ కుటుంబాలతో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే కలెక్టర్ రాకపోవడంతో అక్కడే బైఠాయించారని చెప్పారు.

రైతులలో ఉన్నది 90 శాతం టిఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లయితే 10 శాతం మాత్రమే బీజేపీ వాళ్ళున్నారని, అలాంటప్పుడు బీజేపీ రాజకీయం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. రైతులతో మాట్లాడేది లేదని, రైతు ప్రతినిధులతో మాత్రమే మాట్లాడతానని కలెక్టర్ అన్నారని, రైతు ప్రతినిధులేవరో చెప్పాలన్నారు. రైతుల ధర్నాలో అల్లరి మూకలు ఉన్నాయని, మాబ్ గ్యాధరింగ్ అయిందని, అందుకే నేను బయటకు రాను అని కలెక్టర్ అన్నారని, మీకు ధైర్యం ఉంటే తామంతా పక్కకు తప్పుకుంటామని, ధైర్యం ఉంటే నేరుగా గ్రామాల్లోకి వెళ్లి రైతుల సమస్యలు వెళ్లి తెలుసుకోవాలని కలెక్టర్ కు సూచించారు.

అనర్హత లేని వ్యక్తులు పోలీసు శాఖలో ఉంటే ఇలాగే ఉంటుందన్నారు. రైతు చనిపోయిన రోజు డెడ్ బాడీ వద్ద మాస్టర్ ప్లాన్ అయిపోయింది.. ఎవడు ఏం చేయలేరు అని డిఎస్పీ సోమనాథం ఎలా అంటాడని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ కు డిఎస్పీకి ఏం సంబంధమని నిలదీశారు. రైతులు కలెక్టరేట్ వచ్చిన రోజు ఎఎస్పీ అన్యోన్య, డిఎస్పీ సోమనాథం వల్లనే అంతపెద్ద రచ్చ అయిందని స్పష్టం చేశారు. వీళ్ళు జిల్లా పోలీసు శాఖకు పట్టిన దరిద్రమని, వీరిద్దరిని వెంటనే బదిలీ చేసి విఆర్ లో పెట్టండని ఎస్పీని కోరారు.

వీరు ఇలాగే కొనసాగితే విపత్కర పరిస్థితులు ఎదురవుతాయన్నారు. శ్రీవారి వెంచర్ లో నాల కన్వర్షన్ విషయంలో తహసీల్దార్ ఇచ్చిన తప్పుడు స్టేట్ మెంట్ తో అక్కడి తహసీల్దార్ ను కలెక్టరేట్ కు అటాచ్ చేసారని, ఈ విషయం ఎమ్మెల్యే సురేందర్ కు కూడా తాను చెప్పడం జరిగిందన్నారు. అయినా ఎమ్మెల్యే స్పందించలేదన్నారు. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ ఆందోళన నేపథ్యంలో ఎమ్మెల్యే సురేందర్ రైతులను పెయిడ్ వర్కర్స్ అంటావా.. పెయిడ్ వర్కర్స్ ఎవరో ఎమ్మెల్యే చెప్పాలని డిమాండ్ చేసారు.

నువ్వే పెయిడ్ ఎమ్మెల్యేవు.. నిన్ను ఆ నియోజకవర్గ ప్రజలు చందాలు వేసి గెలిపించారని గుర్తు చేశారు. మాటలు అనడం కాదు.. ఇప్పుడు వెళ్లి చూడు అడ్లూర్ ఎల్లారెడ్డి అని సూచించారు. మొదటి నుంచి షబ్బీర్ అలీ రైతులకు మద్దతుగా ఎందుకు నిలబడలేదని, మొన్నటి బంద్ రోజు వచ్చి ఇలా అరెస్టై అలా బయటకు వచ్చారని దుయ్యబట్టారు. తనను ఉదయం 7 గంటలకు అరెస్ట్ చేసి రాత్రి వరకు స్టేషన్లొనే ఎందుకు ఉంచారని ప్రశ్నించారు.

భవిష్యత్తులో రాజకీయ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు షబ్బీర్ అలీ కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చి సాయంత్రం వెళ్లి హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టారని విమర్శించారు. మరుసటి రోజు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వస్తున్నారని ప్రచారం చేశారని, రేవంత్ రెడ్డి వస్తే షబ్బీర్ అలీ భూ భాగోతం బయటపడుతుంధని రానివ్వలేదని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి కామారెడ్డి రావాలని, రైతులకు మద్దతుగా నిలవాలని, రైతులకు అన్యాయం చేస్తున్న మీ నాయకుని తాటా తీయాలని డిమాండ్ చేశారు. షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీలో ఐరన్ లెగ్ అని చెప్పిన రమణారెడ్డి పొన్నాల లక్ష్మయ్య పక్కన నిలబడి ఆయనను, ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన నిలబడి ఆయన భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు వచ్చిందన్నారు. మరి ఆయన పరిస్థితి ఏంటో అని అనుమానం వ్యక్తం చేశారు.

రైతు ధర్నాలో ఐదుగురు రైతులు పోలీసులకు దొరికితే వారిని ఎఎస్పీ అన్యోన్య ఇష్టం వచ్చినట్లు కొట్టించారని ఆరోపించారు. అందులో ఒకరు టిఆర్ఎస్ పార్టీ వ్యక్తి, మరొకరు కాంగ్రెస్ పార్టీ, ఒకరు కూలి, ఒకరు రైతు, మరొకరు మున్సిపల్ కార్మికుడన్నారు. వీళ్ళేవరు బీజేపీకి చెందినవారు కాదన్నారు. రైతులను కొట్టి, బెదిరించిన విషయంలో పోలీసుల తీరుపై మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తామని, వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా డిటిసిపి, డీడీఎఫ్ కన్సల్టెన్సీ వాళ్ళు కలిసి మార్పులు చేసి లే ఔట్ ఇచ్చిందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెప్తున్నారని, నెల రోజుల క్రితం లొల్లి మొదలైతే ఎవరు తప్పు చేశారో నిన్ననే తెలిసిందా ఎమ్మెల్యే గారు అని ప్రశ్నించారు.

తీర్మానం చేసిన దానికి మార్పులు చేసే అధికారం వారికి ఉందా ఎమ్మెల్యే చెప్పాలని, అలా చేస్తే ఇక్కడ తీర్మానం చేసిన కౌన్సిలర్లు దద్దమ్మలా అని ప్రశ్నించారు. 7 వ తేదీ నాడు రైతులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అడిగితే ఎక్కడ పెట్టమంటారు మరి అని ఎందుకు అన్నారని ప్రశ్నించారు.

ఆరోజే రైతులను కూర్చోబెట్టి నిదానంగా ఇదే విషయాన్ని తప్పు జరిగిందని, మార్పుల కోసం ప్రయత్నిస్తామని రైతులకు చెప్పి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు కదా అని, దీనిపై ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలన్నారు. ఈ నెల 11 నాటికి అభ్యంతరాల సమయం అయిపోతుందని, మరుసటి రోజు రైతులతో చర్చించి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదాను రద్దు చేస్తున్నట్టు ఎమ్మెల్యే తీర్మానం చేయించాలన్నారు. లేకపోతే డిటిసిపి అధికారులను సస్పెండ్ చేయించాలని డిమాండ్ చేశారు.

రైతులకు న్యాయం జరిగే వరకు, మాస్టర్ ప్లాన్ రద్దయ్యే వరకు ఉద్యమం మాత్రం ఆగదని స్పష్టం చేశారు.

Related posts

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణను అడ్డుకోవడం దుర్మార్గం

Satyam NEWS

“మాతృదేవోభవ”(ఓ అమ్మ కథ) పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి!!

Satyam NEWS

కారు ప్రమాదంలో గాయపడిన సినీనటుడు డా.రాజశేఖర్

Satyam NEWS

Leave a Comment