కేంద్ర మంత్రులతో కలవద్దని, బిజెపి నేతలతో తిరగవద్దని ఆదేశాలు జారీ చేసిన ఏపి సిఎం, వైసిపి అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నట్లుగా ఆ పార్టీ ఎంపి రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో భారీ విందు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలతో పాటు వివిధ పార్టీల నేతలు, పార్లమెంటు సభ్యులు, రాజకీయ నాయకులు, సినీ తారలు ఈ విందుకు హాజరవుతున్నారు.
ముందస్తు అనుమతులు తీసుకుని బిజెపి నాయకులను కలవాలని, అదీ కూడా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పక్కన ఉంటేనే కలవాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు భిన్నంగా జరుగుతున్న ఈ విందు ఏపి రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నది.
పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ప్రధాని నరేంద్రమోడీ ఎంపి రఘు రామకృష్ణంరాజును కలిసి పలుకరించడం అప్పటిలో సంచలనం కలిగించింది. కలవడమే కాకుండా ప్రధాని స్వయంగా వచ్చి రఘురామకృష్ణం రాజును పేరు పెట్టి మరీ పిలిచి కుశల ప్రశ్నలు వేశారు. ఇది జరిగిన తర్వాత నియోజకవర్గ సమస్యల పేరుతో ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.
నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలపై మాట్లాడిన ఆనం రామనారాయణరెడ్డికి నేరుగా హెచ్చరికలు జారీ చేసిన సిఎం జగన్ ప్రధాని కలిసిన తర్వాత రఘు రామకృష్ణంరాజును వివరణ అడిగారు. అయితే ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎలాంటి వివరణ కోరలేదు. ఈ నేపథ్యంలో రఘు రామకృష్ణం రాజు ఇస్తున్న ఈ విందు వైసిపి నేతలకు కచ్చితంగా మింగుడు పడే అవకాశమే లేదు.
అయితే ముందు అనుకున్న విధంగానే రఘు రామకృష్ణంరాజు విందు ఏర్పాట్లు ఘనంగా చేసేశారు. ఈనెల 11 వ తేదీన భారీ ఎత్తున జరగబోతున్న ఈ పార్టీకి దాదాపుగా మూడువేల మంది వీవీఐపిలు, వీఐపీలు హాజరవుతున్నారు.