33.2 C
Hyderabad
April 26, 2024 02: 18 AM
Slider సంపాదకీయం

న్యాయవ్యవస్థ ను నేరుగా ఢీ కొడుతున్న ఏపి సిఎం వై ఎస్ జగన్

#Y S Jagan

న్యాయవ్యవస్థతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా తలపడేందుకే నిర్ణయించుకున్నారు. న్యాయ వ్యవస్థపై అతి ముఖ్యమైన నాయకులు, ప్రభుత్వంలో బాధ్యతగల పదవులు నిర్వహిస్తున్నవారు నేరుగా తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేయడం ఇందుకు నిదర్శనగా చెప్పుకోవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న రాత్రి నేరుగా న్యాయవ్యవస్థను ఆక్షేపించగా నేడు రాజ్యసభలో మరో ముఖ్య నాయకుడు విజయసాయిరెడ్డి న్యాయ వ్యవస్థపై ఆరోపణలు చేశారు.

రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ అయిన బొత్స సత్యనారాయణ మరింత నేరుగా మరింత స్పష్టంగా న్యాయవ్యవస్థను తీవ్రంగా విమర్శించారు.

ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఈ ముగ్గురి వ్యాఖ్యానాలూ చూస్తే తాడోపేడో తేల్చుకునేందుకే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైనట్లు స్పష్టం అవుతుండటంతో అటు రాజకీయ వర్గాలలో ఇటు న్యాయ నిపుణులలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది.

ఇది ఏ పరిస్థితులకు దారితీస్తుందోనని అనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార సాక్షి ఛానెల్ లో కూడా హైకోర్టు ఆదేశాలను ధిక్కరించే రీతిలోనే సమాచారం అందించారు.

ఏ పేర్లు అయితే చెప్పకూడదని కోర్టు ఆంక్షలు విధించిందో, ఏ సమాచారం అయితే ప్రజలకు బహిర్గతం చేయవద్దని ఆదేశాలు ఇచ్చిందో ఆ సమాచారం మొత్తం ప్రజలకు అర్ధం అయ్యే విధంగానే అధికార పార్టీకి చెందిన అందరూ ప్రవర్తించారు. దీని పర్యవసానం ఏ విధంగా ఉంటుందో అనేది అర్ధం కావడం లేదు.

అమరావతి భూముల కుంభకోణానికి సంబంధించిన కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెల్లడించిన తాత్కాలిక ఆదేశాలను విజయసాయిరెడ్డి రాజ్యసభలో అసాధారణ రీతిలో ప్రస్తావించారు. 

అమరావతి భూముల కుంభకోణంలో మాజీ అడ్వకేట్ జనరల్ ఇతరులపై సీఐడీ నమోదు చేసిన కేసును విచారిస్తూ, ఎఫ్ఐఆర్ వివరాలకు సంబంధించి ఎలాంటి వార్తలు, సమాచారం మీడియా, సోషల్ మీడియాలో ప్రచురణ కాకుండా నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

మీడియాను ఎందుకు సెన్సార్ చేయాలో పేర్కొంటూ పిటిషనర్ ఎలాంటి రుజువులు, ఆధారాలు చూపకుండా కేవలం పిటిషనర్ ఆరోపణల ఆధారంగా కోర్టు మీడియాపై సెన్సార్షిప్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పైగా సీఐడీ నమోదు చేసిన కేసులో విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలు అసాధారణంగాను, అత్యంత సందేహాస్పదంగా ఉన్నాయి. న్యాయపరంగా ఈ ఉత్తర్వులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఆయన అన్నారు. పిటిషనర్‌ ఆరోపించినట్లుగా ప్రభుత్వం తమని వేధిస్తునట్లయితే అటువంటి అంశాలకు విస్తృత మీడియా ప్రచారం ద్వారా పిటిషనర్‌కు మేలు జరుగతుంది.

కానీ ఈ కేసులో మీడియాపై ఆంక్షలు విధించాలని పిటిషనర్‌ కోరడం కోర్టు ఆమేరకు ఆదేశాలు జారీ చేయడం వంటి చర్యలు సందేహాస్పదంగా ఉన్నాయని అన్నారు. మీడియా స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించడం సర్వసాధారణంగా జరిగే విషయం.

కానీ ఆంధ్రప్రదేశ్‌లో దీనికి భిన్నంగా అసాధారణ రీతిలో న్యాయవ్యవస్థ మీడియాపై ఆంక్షలు విధించడం విడ్డూరంగాను, రాజ్యంగ స్పూర్తికి విరుద్దంగా ఉందని ఆన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ నిష్పాక్షింగా వ్యవహరించడం లేదు.

తప్పులను కప్పిపుచ్చడానికే ఇలా చేస్తున్నారా?

ఒక వైపు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూనే మరోవైపు న్యాయవ్యవస్థ నుంచి ఎదురవుతున్న దాడులను తట్టుకుంటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాపై విజయవంతంగా పోరాటాన్ని  కొనసాగిస్తోందని ఆయన అన్నారు.

గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, తప్పులను కప్పిపుచ్చడానికే న్యాయవ్యవస్థ  ఇలా వ్యవహరిస్తుందనే భావన ప్రజల్లో బలంగా ప్రబలిపోయింది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి బాగోతాలపై మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటినీ జరగకుండా నిరోధించేందుకు పరోక్షంగా పిటిషనర్లకు సహకరిస్తూ ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకతోను, పక్షపాత ధోరణితోను న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తోంది.

ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వం అటు ఆర్థిక రంగం సృష్టించిన సంక్షోభంతోపాటు ఇటు న్యాయవ్యవస్థ నుంచి ఎదురవుతున్న ఆటంకాలను అధిగమిస్తూ కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. ఇంతకన్నా దారుణమైన వ్యాఖ్యానాలను మంత్రి బొత్సా సత్యనారాయణ చేశారు.

పెద్దల మీద ఏమైనా అభియోగాలు వస్తే.. గ్యాగ్ ఆర్డర్లు ఇస్తారా…? పేదవాడి మీద ఆరోపణలు వస్తే… ఏమైనా చేయెచ్చా.. ? అంటూ ఆయన హైకోర్టును ప్రశ్నించారు. తప్పులు చేసిన వారికి ఇంతగా రక్షణగా నిలిస్తే.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం..? రాజకీయాల్లో ఉన్నవారు,

గతంలో పరిపాలన చేసిన 70,80  ఏళ్ళకు దగ్గరపడ్డ చంద్రబాబు లాంటి వాళ్ళు,  నాకు ఇక  రాజ‌కీయాల‌కు సంబంధంలేద‌ని, కాళ్ళు చాచుకుని మూల‌న కుర్చుంటే, దోపిడి చే‌సుకుని వెళ్లిపోతే చూస్తూ ఊరుకోవాలా..? వారి మీద చర్యలు తీసుకోనక్కర్లేదా..?

ప్రజాధనం దోచుకుపోతే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వారికి వత్తాసు పలకాలా..? ఇదెక్కడి న్యాయం.. ఇది మా ఆవేదన అని ఆయన కేసు మొత్తాన్ని బొత్స సత్యనారాయణ వివరించి చెప్పారు. ఈ స్కాంలో పెద్దల పేర్లు ఉంటే, అవి టీవీల్లో, మీడియాలో రాకూడదా..? సోషల్ మీడియాలో రాకూడదా..?

ఇది నేను అంటున్న మాట కాదు. భారతదేశంలో ఉంటున్న మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, న్యాయ కోవిదులు మాట్లాడుతున్న మాటలు. వీటికి ఏం సమాధానం చెబుతారు..?అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

న్యాయమూర్తులపై దారుణమైన వ్యాఖ్యానాలు చేసిన 93 మంది పై కేసులు నమోదు చేయమని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఏ దశలో ఉన్నాయోగానీ ఈ లిస్టు పెరిగిపోతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వ, శాసన వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ జోక్యం పై కూడా ఇప్పటికే స్పీకర్ తమ్మినేని శీతారాం పలుమార్లు వ్యాఖ్యానాలు చేశారు. ఇవన్నీ ఏ పరిస్థితులకు దారితీస్తాయో ఇప్పుడే చెప్పడం కష్టం.

Related posts

రమేష్ కుమార్ కేసులో ఫైనల్ హియరింగ్ 28న

Satyam NEWS

ఆన్లైన్ విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

సకాలంలో  ధృవపత్రాలు అందించాలి

Murali Krishna

Leave a Comment