ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ ఇక సినిమాలు డైరక్టు చేయడం ఆపేస్తాడో ఏమో తెలియదు కానీ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. వినాయక్ పుట్టినరోజు అక్టోబర్ 9న! అదే రోజున ఆయన కథానాయకుడిగా పరిచయం కానున్న చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. పుట్టినరోజుకు తోడు విజయదశమి పండుగ ఘడియలు కూడా కలిసి వస్తుండటంతో కొత్త హీరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు. భారీ తమిళ చిత్రాల దర్శకుడు శంకర్ శిష్యుడు ఎన్. నరసింహారావు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందుతోంది. ఇందులో పాత్ర కోసం వీవీ వినాయక్ జిమ్‌లో చెమట చిందుస్తున్నాటడ. బరువు కూడా బాగా తగ్గుతున్నాడట. మరి హీరో గెటప్ రావాలి కదా. 1980 నేపథ్యంలో కథ సాగుతుందనీ, వినాయక్ వయసుకు తగ్గట్టు పాత్ర ఉంటుందని సమాచారం.