37.2 C
Hyderabad
April 19, 2024 12: 06 PM
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే అగ్నిగుండమే

#katepalli

రైతుల నోట్లో మట్టి కొడుతూ.. వారి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే కామారెడ్డి అగ్నిగుండమే అవుతుందని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వల్ల విలీన గ్రామాల రైతులు నష్టపోతారని ఆగస్ట్ 28 న తాము ముందే చెప్పామన్నారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 5 వరకు బాధిత రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. 700 ఎకరాలు రోడ్ల కింద, 1195 ఎకరాలు ఇండస్ట్రియల్ జోన్, 800 ఎకరాలు గ్రీన్ జోన్ కింద రైతులు భూములు పోతున్నాయన్నారు. డిసెంబర్ 5 న మున్సిపల్ ముందు ఆందోళన చేస్తే కౌన్సిల్ లో చేసిన తీర్మానం కాపీని కమిషనర్ ఇచ్చారన్నారు

చైర్మన్ సంతకం లేకుండా కమిషనర్ ఆమోదిస్తారా..?

కౌన్సిల్ తీర్మానంలో చైర్మన్ సంతకం లేకుండా ఆమోదిస్తున్నట్టుగా కమిషనర్ ఎలా సంతకం చేస్తారని రమణారెడ్డి ప్రశ్నించారు. కమిషనర్ కు ఆ అధికారం ఎక్కడిదని నిలదీశారు. తీర్మానం కాపీలో మాత్రం 49 మంది కౌన్సిలర్లు, నలుగురు కో అప్షన్ సభ్యులు మొత్తం 53 మంది సంతకాలు ఉన్నాయని, కౌన్సిలర్లను అడిగితే మాకు తెలియదు అంటున్నారన్నారు.

వందశాతం హాజరు సాధ్యమేనా..?

27.03.2021 నాడు సాధారణ సమావేశం రోజున 49 మంది కౌన్సిలర్లు, నలుగురు కో అప్షన్ సభ్యులు సంతకాలు చేశారన్నారు. షబ్బీర్ అలీ, గంప గోవర్ధన్ ల రాజకీయ చరిత్రలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 100 శాతం సభ్యులు హాజరైన సందర్భం ఉందా అని ప్రశ్నించారు. ప్రతి సమావేశానికి ఇలాగే సంతకాలు చేస్తూ తీర్మానాలు ఆమోదిస్తున్నారని ఆరోపించారు. ఈ 53 మంది సభ్యులు మాస్టర్ ప్లాన్ విషయం తెలిసే తీర్మానానికి ఆమోదం తెలుపుతూ సంతకాలు చేశారో లేదో 3 రోజుల్లో అంటే సోమవారం లోపు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇళ్లకు వచ్చి సంతకాలు చేస్తే ఎందుకు చేశారో చెప్పాలన్నారు.

ప్రజల ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తే కామారెడ్డిలో మీరు ఉండి కూడా వేస్ట్ అని కౌన్సిలర్లనుద్దేశించి అన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. 2500 మంది రైతులకు సంబంధించిన విషయమని చెప్పారు. 21.03.2022 నాడు తీర్మానం అయితే 27.03.2022 నాడు తీర్మానం ఆమోదం పొందిందని, 2022 నవంబర్ 11 నోటిఫికేషన్ ఇచ్చారని, మధ్యలో 17 నెలలు ఏం చేశారని నిలదీశారు. రైతులకు చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు, కౌన్సిలర్లకు లేదా అని ప్రశ్నించారు.

486 కోట్ల బాధ్యత మీదేనా సురేందర్ గారు..

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ మంత్రి కేటీఆర్ కు ఈ నెల 3 న అప్లికేషన్ ఇచ్చారని, 20 వ తేదీన రైతుల వద్దకు ఎమ్మెల్యే వచ్చారన్నారు.  రైతుల దగ్గరికి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు అయిందని ప్రశ్నించారు. ఎవరెవరి మాటలో నమ్మి ధర్నాలు చేస్తే మీకే నష్టం అని ఎమ్మెల్యే చెప్పడంలో అర్థం ఏంటి అని నిలదీశారు. మీరు అధికారంలో ఉన్నారు. తలుచుకుంటే 24 గంటల్లో మాస్టర్ ప్లాన్ రద్దు చేయించవచ్చని, నేను మీ స్థానంలో ఉండి ఉంటే గంటలో రద్దు చేయించేవాన్నని పేర్కొన్నారు. మీ మాట వింటే మీరు బాధ్యతగా ఉంటారా.. మీరు బాద్యున్ని అని చెప్తే తర్వాత భూములు పోతే ఆ నష్టపోయిన 486 కోట్లు మీరు రైతులకు ఇస్తారా అని ప్రశ్నించారు.

ఓటర్లను పంచుకుంటారా..

ఎమ్మెల్యే సురేందర్ ఏమో కేవలం అడ్లూర్ ఎల్లారెడ్డి వాళ్ళను కాపాడుకుంటా అంటాడని, షబ్బీర్ అలీ ఏమో అడ్లూర్ వాళ్ళ భూములు పోకుండా చూస్తా అంటారని, మరి మిగతా గ్రామాల రైతులు ఏం కావాలని ప్రశ్నించారు. ఇల్చిపూర్, లింగాపూర్, టెక్రియల్, పాత రాజంపేట, దేవునిపల్లి గ్రామాలు కామారెడ్డి నియోజకవర్గం కిందకు రావా అని షబ్బీర్ ఆలీని ప్రశ్నించారు. ఒక అడ్లూర్ రైతుల భూములను మాత్రమే కాపాడతారా షబ్బీర్ అలీ అని నిలదీశారు. దీన్ని బట్టి చూస్తే ఏ గ్రామ రైతులు మీ దగ్గరికి వస్తే ఆ గ్రామ రైతుల భూములను మీరు కాపాడతారా అన్నారు. రైతుల వద్దకు మీరు వెళ్లి సమస్య పరిష్కరించలేరా.. షబ్బీర్ అలీ గారు.. 4 నెలల నుంచి మీరేం చేశారు అని నిలదీశారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఏమో నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు.. సమాధానం చెప్పరు అని ఎద్దేవా చేశారు.

రైతులను ఏం చేస్తారు..?

ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి రైతులను ఏం చేద్దామని అనుకుంటున్నారని రమణారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ పారిశ్రామిక వేత్తలతో మీరు అగ్రిమెంట్ చేసుకున్నది నిజం కాదా.. మీ అగ్రిమెంట్ కాపీ తనవద్ద ఉందన్నారు. ఏం తమాషాగా ఉందా.. అని నిలదీశారు.

ఎమ్మెల్యే హోదాలో చేయలేరా

మాస్టర్ ప్లాన్ పై మాజీ మంత్రి స్పష్టత తెస్తే ఇక్కడున్న ఎమ్మెల్యే దద్దమ్మనా అని ప్రశ్నించారు. 15 సంవత్సరాలుగా అధికారంలో లేని షబ్బీర్ అలీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో మాట్లాడతారని, మాస్టర్ ప్లాన్ పై స్పష్టత తెస్తానంటారని తెలిపారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మున్సిపల్ రాష్ట్ర కమిషనర్ సత్యనారాయణకు ఒక్కమాట చెప్పలేరా.. మీరు చెప్తే పనికదా.. మీకు చేతకాదా అని నిలదీశారు.

రైతులు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటే ఎక్కడ పెట్టమంటారు అని రివర్స్ అడుగుతారన్నారు. రైతుల భూములు పోతాయని.. రియల్టర్ల భూములు ఒక్క గజం కూడా పోదన్నారు. ఇదేనా మీ తీరు ఎమ్మెల్యే గారు అని నిలదీశారు. రైతులతో మాట్లాడే సమయం మీకు లేదు కానీ గోవా వెళ్లి ఎంజాయ్ చేసేందుకు సమయం ఉంటుందని, పార్టీలు చేసుకోవడానికి సమయం ఉంటుందని దెప్పి పొడిచారు. ఇందుకేనా మీరు ఎమ్మెల్యేగా ఉన్నదని ప్రశ్నించారు.

రైతులను అరెస్ట్ చేయిస్తారా..

మంత్రి హరీష్ రావు వస్తే పోలీసుల బందోబస్తు మధ్య పర్యటిస్తారని, మీకోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చూడటం కోసం వచ్చారా.. లేక ప్రజా సమస్యలు చూడటానికి వచ్చారా మంత్రిగారు అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో పదవుల్లో ఉన్న నాయకులకు గాజులు, బొట్టు, పసుపు, చీరలు పంపించారు కదా అని గుర్తు చేశారు. ఇప్పుడు మీకు వందలాది మంది పోలీసులు ఎందుకు అని నిలదీశారు. రైతులు మిమ్మల్ని కలిసి సమస్య చెప్పుకోవడానికి వస్తే అరెస్టులు చేయిస్తారా అని ప్రశ్నించారు.

మంత్రి దృష్టికి సమస్య తీసుకెళ్ళకుండా ఎవరి మాట విని రైతులను అరెస్ట్ చేశారో ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో మంత్రి కాన్వాయి ఎందుకు ఆగమాగం తిరిగిందని అడిగారు. బీజేపీ నాయకులు మంత్రిని ఎవరు అడ్డుకోరని పోలీసులకు ముందే చెప్పినామని, ఎప్పుడైనా ఏ మంత్రి అయినా కామారెడ్డి రావచ్చు పోవచ్చు.. ఒక్క బీజేపీ కార్యకర్త కూడా అడ్డుకోరని స్పష్టం చేశారు.

షబ్బీర్ ఆలీపై ఫైర్

షబ్బీర్ అలీ తన గురువు అని ఎప్పుడైనా చెప్పానా అని రమణారెడ్డి ప్రశ్నించారు. నా డిఎన్ఏ కాంగ్రెస్ ది ఎలా అవుతుందని, నీ డిఎన్ఏ కాంగ్రెస్ ది అయితే మరీ చంద్రబాబు డిఎన్ఏ, కేసీఆర్, డిఎన్ఏ ఏది అని షబ్బీర్ అలీని ప్రశ్నించారు. షబ్బీర్ ఆలీకి కేవలం 13.14 ఎకరాలు మాత్రమే భూమి ఉందంటున్నారని, ఆయన కొడుకు పేరు మీద లింగాపూర్ శివారులో 8.26 ఎకరాలు, తమ్ముని కొడుకు సోహెల్ పేరుమీద 4.28 ఎకరాలు ఇలా మీ ఫ్యామిలీ మొత్తానికి 26.31 ఎకరాల భూమి ఉందని పట్టా పసుపుస్తకాలతో సహా మీడియాకు చూపించారు.

మీకు భూమి లేదని చెప్పగలరా షబ్బీర్ అలీ

విశ్వేశ్వర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాత లక్ష్మణ్ పేరుమీద 50 ఎకరాలు, భవాని అసోసియేట్స్ యాద నాగేశ్వర్ పేరుమీద 50 ఎకరాలు మొత్తం 110 ఎకరాలు ఉంది ఇందులో షబ్బీర్ ఆలీకి 40 ఎకరాలు ఉన్నమాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ భూమి నీది కాదని రాత పూర్వకంగా చెప్పండని సూచించారు.

అగ్రిమెంట్ చేసుకున్నది వాస్తవం కాదా?

మాస్టర్ ప్లాన్ విషయంపై గంప గోవర్ధన్, ముజీబ్, షబ్బీర్ అలీ మరికొందరు కలిసి రోడ్ నంబర్ 14 లో గోల్కొండ హోటల్ వద్ద పారిశ్రామిక వేత్తలతో అగ్రిమెంట్ చేసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆ రోజు తనకు పని ఉండటం వల్ల కుదరలేదని, లేకపోతే ఫొటోలతో సహా రుజువు చేసేవాడినని తెలిపారు. ఈ అగ్రిమెంటులో వ్యాపారులకు మీకు 50 శాతం వాటా నిజం కాదా అన్నారు. మాస్టర్ ప్లాన్ పై చీఫ్ సెక్రెటరీకి మీ పర్సనల్ సెక్రెటరీ ద్వారా లెటర్ పంపించే కంటే మిరే వెళ్లి ఇస్తే బాగుండేది కదా అని షబ్బీర్ ఆలీకి సూచించారు.

నువ్వేమైన పార్టీ చీఫ్ వా

నాకు నాలుగు సార్లు బి ఫామ్ మీ చేతుల మీద ఇవ్వడానికి నువ్వేమైన పార్టీ చీఫ్ వా అని షబ్బీర్ అలీని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కార్యకర్తల నుంచి డబ్బులు తీసుకోవడం తప్పు అన్నందుకు తనను దూరం పెట్టారన్నారు. తాడ్వాయి జడ్పీటీసీగా టికెట్ ఇస్తే గెలుస్తాడా అని రవీందర్ రెడ్డితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జడ్పీ చైర్మన్ గా కావడం వెనక నీ దాయాదక్షిణ్యాలు లేవని, కష్టపడి ఎన్నికయ్యానన్నారు.

2 కోట్లు తీసుకోలేదా..?

ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా పోటీ సమయంలో 9 మంది ఎమ్మెల్యేలు, ఎంపీగా కవిత అంతా అధికార పార్టీ వాళ్లే ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నాయకునికి కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసే దమ్ము లేదన్నారు. ఎమ్మెల్సీ టికెట్ కోసం గోల్కొండ హోటల్ లో 2 కోట్లు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సి ఎన్నికల్లో విత్ డ్రా చేసుకోవడానికి తనకు ఎవడు డబ్బులు ఇచ్చాడో మూడు రోజుల్లో చెప్పాలి.. లేకపోతే వదిలిపెట్టనన్నారు. నీ వెంట ఉన్న ప్రధాన అనుచరులు టిఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరారు.. అప్పుడు నువ్వేం చేసావని ప్రశ్నించారు.

ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు

గడిచిన అసెంబ్లి ఎన్నికల్లో ఆరు సార్లు ఒడిపోయావ్.. ఏడవ సారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు షబ్బీర్ అలీ.. అని రమణారెడ్డి అన్నారు. షబ్బీర్ అలీ ఒడిపోకపోతే  తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.

ఇన్ని ఆస్తులు ఎక్కడివి షబ్బీర్ అలీ..?

సిరిసిల్ల రోడ్డులో మీ ఫామిలీ వాళ్లకు సర్వే నంబర్ 8 లో 5 వేల గజాల స్థలం ఉంది.  ఈ ఆస్తి ఎక్కడిది.. ఏం కష్టం చేసి సంపాదించావ్ షబ్బీర్ అలీ అని ప్రశ్నించారు. కేవలం కామారెడ్డిలో ఉన్న 100 కోట్ల ఆస్తులు మాత్రమే తాను చెప్పానని తెలిపారు. రైతుల భూములతో షబ్బీర్ భాయ్, గోవర్ధన్ భాయ్ లు రియల్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్లలో మీ ఆస్తులు, మీ సంపాదన, మీ అవినీతిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

షబ్బీర్ అలీ.. దమ్ముంటే రా

షబ్బీర్ అలీ.. ఈ శనివారం రైతులు నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా చేస్తున్నారు.. ఈ ధర్నాకు నేనే ముందుంటా.. ఇప్పటిదాకా పార్టీలకు అతీతంగా రైతులకు అండగా ఉండామనుకున్నానని, ఇపుడు నేరుగా తానే ముందుండి రైతుల ఆందోళనను ఉదృతం చేస్తామన్నారు. షబ్బీర్ అలీ.. నీకు దమ్ముంటే శనివారం జరిగే రైతుల ధర్నాకు నువ్వు కూడా రా అని సవాల్ విసిరారు.

ప్రోటోకాల్ ఎక్కడిది.?

షబ్బీర్ అలీ ఇంటికి టౌన్ ప్లానింగ్ అధికారి మాస్టర్ ప్లాన్ మ్యాప్ తీసుకుని ఎలా వెళ్లారన్నారు. ప్రోటోకాల్ ప్రకారం షబ్బీర్ ఆలీకి ఏ హోదా ఉందని వెళ్లారని ప్రశ్నించారు. గంప గోవర్ధన్ పంపించకపోతే వారం రోజుల్లో వారిపై చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోకపోతే షబ్బీర్ అలీ, గంప గోవర్ధన్ ఇద్దరు ఒక్కటే అన్నట్టని తెలిపారు.

కామారెడ్డి అగ్నిగుండమే

మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు.. రైతులకు అన్యాయం జరిగేలా మాస్టర్ ప్లాన్ చేస్తే ఊరుకోనని, రైతులకు అండగా ఉంటానన్నారు. తన అవసరం ఉంటే రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్తానన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే కామారెడ్డి అగ్నిగుండంలా మారుతుందని హెచ్చరించారు.

Related posts

పాకిస్తాన్ లో దుమారం రేపుతున్న మతమార్పిడి

Satyam NEWS

వలస కూలీలకు చార్జీల రాయితీ ఇవ్వడం లేదు

Satyam NEWS

అధ్య‌క్షుడి రాక‌తో భార‌త్ – అమెరికా బంధం బ‌ల‌ప‌డేనా?

Sub Editor

Leave a Comment