25.2 C
Hyderabad
June 17, 2024 17: 06 PM
Slider తెలంగాణ ప్రత్యేకం

మండిపడుతున్న గులాబి జెండా ఓనర్లు

trs-party1565376649

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత అసంతృప్తి స్వరాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. కొన్ని సామాజిక వర్గాలపరంగా మరికొన్ని విధేయత పరంగా సీఎం కేసీఆర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. నమ్మిన బంటునుకున్న నాయిని నర్సింహరెడ్డి, ఉద్వాసన పలికిన కిమ్మనకుండా ఉన్న తాటికొండ రాజయ్య, చంద్రుని బంటు అనుకున్న జోగు రామన్న, మనోడే అనుకున్న మైనంపల్లి హన్మాంతరావులు ధిక్కారస్వరం పెంచుతూ అధిష్టానాన్ని ఆలోచనల్లో పడేస్తున్నారు. ఈ పరిణామాలను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తునే  పరిస్థితులను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు టిఆర్ఎస్ అధిష్టానం పావులు కదుపుతోంది.

తెలంగాణ సాకారమయిన తరువాత ఏర్పడిన మొదటి సర్కారులో డిప్యూటీ సీఎంగా ఉండి అనూహ్యంగా బర్తరఫ్‌ అయిన తాటికొండ రాజయ్య మొదటి సారి అధికార పార్టీ తరపున అసమ్మతి గళం వినిపించి కలకలం రేపారు. కేబినెట్‌లో మాదిగలు లేకపోవడం బాధాకరమని తెలంగాణలో 11 నుంచి 12 శాతం మాదిగలు ఉన్నారని గుర్తు చేశారు. మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలని అందుకే తాను మాట్లాడుతున్నానన్నారు. అదే విపక్షాలు మాట్లాడితే రాజకీయం అంటారని అందుకే అధికార పార్టీ నుంచి తాను మాట్లాడుతున్నానని రాజయ్య అన్నారు. దీన్ని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణమాదిగ అందుకుని తన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.

మాదిగలను కేసీఆర్‌ అణగదొక్కుతున్నారని మంత్రి పదవి ఇవ్వకుండా ద్వేషాన్ని పెంచుకున్నారని ఆరోపణలతో రాజకీయ ఉద్యమం ప్రారంభించారు. కేబినెట్‌లో వెలమలకు 4 మాదిగలకు మొండిచెయ్యా అని ప్రశ్నించి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇతర బడుగు, బలహీనవర్గాలకు చెందిన నేతలు కూడా ఇదే డిమాండ్‌ తో తెరముందుకు వస్తున్నారు. మరో వైపు సీనియార్టీ పరంగా కూడా కేసీఆర్‌ కు నిరసన సెగ తగులుతోంది.

తనకు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్‌ మాటతప్పారని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నా వద్దు కౌన్సిల్‌లో ఉండు మంత్రి పదవి ఇస్తానని ఆశ పెట్టారని నాయిని చెప్పారు. తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని అన్నారని తనకు ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోందని కానీ తనకు ఆ పదవి వద్దని నాయిని స్పష్టం చేశారు. ఆర్టీసీ చైర్మన్‌ పదవిలో రసం లేదన్నారు. కేసీఆర్‌ మా ఇంటికి పెద్ద, మేమంతా ఓనర్లమే.. కిరాయిదార్లు ఎంతకాలం ఉంటారో వాళ్లిష్టమని ఇటీవల పార్టీలోకి వచ్చి మంత్రి పదవులు దక్కించుకున్న వారినుద్దేశించి వ్యాఖ్యానించారు.

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావుకు కేబినెట్‌లో చోటు లభించకపోవడంతో అలక పూనినట్లు సమాచారం. తన విషయంలో కేసీఆర్‌ మాట తప్పారని కార్యకర్తల సమక్షంలో ఆయన ఆవేదన చెందినట్లు సమాచారం. ఆదివారం కేబినెట్‌ విస్తరణ జరిగిన వెంటనే హనుమంత రావు బెంగళూరు వెళ్లారని వార్తలు వెలువడుతున్నాయి. సోమవారం జరిగిన బడ్జెట్‌ సమావేశాలకు ఆయన హజరుకాకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. రాజకీయ నిర్ణయానికి సిద్దంగా ఉండాలని తన అనుచరులకు ఆయన సూచించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదే గనక నిజమైతే టీఆర్‌ఎస్‌ పార్టీలో మరింత చిచ్చు రేగే అవకాశం ఉందనీ, మరికొంత మంది భంగపడ్డ ఆశావహులు కూడా అదే బాటలో పయనిస్తారని తెలుస్తోంది. గత డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంత రావు మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసిన సమీప ప్రత్యర్థి ఎన్‌ రామచంద్రరావుపై సుమారు 73 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో తొలి కేబినెట్‌లోనే ఆయనకు చోటు దక్కుతుందని భావించారు.

కానీ, తాజాగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంత ప్తికి గురైనట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అలకబూని వెళ్లిపోగా ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి పదవి ఇవ్వనందుకు ఓ కార్యకర్త తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నాడు. అప్రమత్తమైన అక్కడే ఉన్న కార్యకర్తలు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే.. ‘నీలాంటి వాళ్ళ తప్పుల వల్లే రామన్నకు మంత్రి పదవి రాలేదు’ అని సీనియర్‌ నేత సాజిద్‌ ఖాన్‌పై కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నేత అయిన రామన్నకు అన్యాయం జరిగిందని అనుచరులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇలా వీరంతా అసమ్మతి గళాలు వినిపిస్తుండగా అధిష్టానం వీరిని ఏలా బుజ్జగిస్తుందో  వేచి చూడాలి.

గుమ్మడి  శ్రీనివాస్

Related posts

ఆగమన సన్నాహాల్లో 1948 – అఖండ భారత్ (the murder of mahathma)

Satyam NEWS

ప్రేక్షకులకు చెప్పాల్సిన కథ ‘యశోద’

Bhavani

రుణమాఫీ కోసం 18,241.94కోట్లు విడుదల

Bhavani

Leave a Comment