సంక్రాంతి లోపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి ఖమ్మం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం అర్బన్ మండలంలోని మల్లెమడుగులో 84, కూసుమంచి మండలం దుబ్బ తండ (ఎర్రగడ్డ తండ)లో 29, నేలకొండపల్లి మండలం ఆచర్లగూడెం లో 18, మొత్తం 131 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారుల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, వీటిని పేదలలో నిరుపేదలను ఎంపిక చేసి వారికి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
పాలేరు అసెంబ్లీ పరిధిలో 209 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వివిధ దశలలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఇండ్లకు కూడా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఆ ఇండ్లు వారికి కేటాయించాలని, మిగిలిన పనులు చేసేందుకు ప్రణాళికలు, అవసరమైన నిధుల నివేదిక తయారు చేయాలని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాకపోతే ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని సందేశం బలంగా వెళ్లాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, హౌజింగ్ పిడి శ్రీనివాసరావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.