24.7 C
Hyderabad
July 18, 2024 06: 51 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

డాక్టర్లూ మధుమేహంపై దృష్టి సారించండి

venkaiah

భారత్‌తోపాటు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న రక్తపోటు, మధుమేహం, కేన్సర్ మొదలైన నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్‌పై వైద్యరంగం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తీసుకునే చొరవ అత్యంత కీలకమని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన 27వ ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. వైద్యులు తమకు దగ్గర్లో ఉన్న పాఠశాలలు, కాలేజీలు, యువజన కేంద్రాలు, గ్రామాలను తరచూ సందర్శిస్తూ నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్‌కు కారణమవుతున్న ఆధునిక జీవన విధానంపై వారిని చైతన్యపరచడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ వంటివాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యరంగానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సరైనన్ని నిధుల విడుదల లేకపోవడం, రోగులకు సరిపోయేంత సంఖ్యలో వైద్యులు లేకపోవడం, వ్యాధులు రాకుండా నివారణపై చైతన్యపరిచే వ్యవస్థ లేకపోవడం, వైద్యానికవుతున్న ఖర్చు పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలికవసతుల కొరత, ప్రజల్లో ఆరోగ్యబీమాపై అవగాహన లేకపోవడం తదితర అంశాలు దేశ వైద్యరంగంపై పెనుప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన అభిప్రాయడ్డారు. మరిన్ని వైద్య కళాశాలలను ప్రారంభించడం ద్వారా వైద్యుల కొరతను అధిగమించేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనితోపాటుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో ప్రతి ఏటా 20లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోతున్నారని దీని కారణంగా పక్షవాతం వంటి దీర్ఘకాల వైకల్యాలు, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. 2016లో వివిధ అనారోగ్య కారణాలతో మృతిచెందిన వారిలో.. 55.2%మంది నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (స్ట్రోక్, ఎపిలెప్సీ, మైగ్రైన్ తదితర సమస్యల) కారణంగానే చనిపోయారన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలే ఇందుకు కారణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు  డాక్టర్ వినోద్ పాల్, కిమ్స్ ఆసుపత్రి ఎండీ డా.భాస్కర్ రావు,ఐఏఎన్ అధ్యక్షుడు డా. సతీష్, న్యూరాలజీ వరల్డ్ ఫెడరేషన్ అధ్యక్షుడు డా. విలియమ్ కారల్, కార్యక్రమ కార్యనిర్వహక కార్యదర్శి డా.సీతాజయలక్ష్మితోపాటుగా.. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, పోర్చుగల్, జపాన్, ఇటలీలకు చెందిన 15మంది అంతర్జాతీయ నిపుణులతోపాటు 2వేల మంది వైద్యులు పాల్గొన్నారు

Related posts

హైదరాబాద్ కు భూగర్భ మెట్రో:ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి

Bhavani

కేసీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

Bhavani

ప్రాణహిత పుష్కరాల ముగింపు రోజు అన్నదాన కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment