37.2 C
Hyderabad
April 19, 2024 11: 51 AM
Slider సంపాదకీయం

National Politics: కేసీఆర్ కు క్లారిటీ ఉందా?

#kcr

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఎంతో ఉత్సాహం చూపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతు ఇచ్చేవారు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం అయితే ఇప్పటి వరకూ లేదు. గత రెండు మూడు సంవత్సరాలుగా కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశానికి ప్రయత్నం చేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్, ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నుంచి విడిపోయిన తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులను కేసీఆర్ ఇప్పటి వరకూ కలిశారు. వీరే కాకుండా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడ లను కూడా కలిశారు.

అయితే పైన చెప్పిన ఏ వ్యక్తి కూడా ‘‘కేసీఆర్ మా నాయకుడు’’ అని ఇప్పటి వరకూ ప్రకటించలేదు సరికదా కేసీఆర్ తో రాజకీయంగా కలిసి నడుస్తాం అని కూడా చెప్పలేదు. కేంద్రంలో అప్రతిహత అధికారం కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం అంత సులభంగా రాదనే విషయం కేసీఆర్ కు అర్ధం అయిందో లేదో కానీ చాలా మంది విశ్లేషకులు చెబుతున్నారు.

అదీ కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయం రూపొందించడం అంటే అది సాధ్యం అయ్యే పని కాదనేది అందరికి తెలిసిందే. అయినా కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ తో ఇప్పటి వరకూ మాట్లాడలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి కావడం ఒక కారణం అయితే తెలంగాణ ఇస్తే టీఆర్ ఎస్ ను విలీనం చేస్తానని మాట ఇచ్చి మోసం చేసినందున కాంగ్రెస్ పార్టీ తనతో కలుస్తుందో లేదో అనే సంశయం కూడా కావచ్చు.

తగ్గేదే లే అంటున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ నాయకుడిని వెతుక్కునే పనిలో బిజీ గా ఉన్నా కూడా ఎక్కడా తగ్గడం లేదు. చిన్నా చితకా పార్టీలు బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా నోరు విప్పడం లేదు. బీజేపికి మేమే ప్రత్యామ్నాయం అని డాంబికాలు పోవడం లేదు. కాంగ్రెస్ సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లాలి అని మాత్రమే రాహుల్ గాంధీ చెబుతున్నారు.

బీజేపీ దేశానికి చేస్తున్న ద్రోహాన్ని వివరించి ప్రజలను సమీకరించడం తప్ప వేరే మార్గం లేదని రాహుల్ గాంధీ చెబుతున్నారు. అందుకోసమే ఆయన భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ సాగే ఈ యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ కోలుకుంటుందేమో తెలియదు కానీ కేసీఆర్ మాత్రం ఇవేవీ ఆలోచించే స్థితిలో లేరు. తానే ప్రత్యామ్నాయం అనే రీతిలో ముందుకు వెళుతున్నారు.

కేసీఆర్ జగన్ ను ఎందుకు కలవడం లేదో….

తనకు సోదరసమానుడని కేసీఆర్ పదే పదే చెప్పుకునే ఏపీ సీఎం వై ఎస్ జగన్ కూడా కేసీఆర్ తో కలిసి నడిచేందుకు ముందుకు రావడం లేదు. కేసీఆర్ కూడా జగన్ ను కలిసే ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణ లో ప్రచారానికి వచ్చిన చంద్రబాబునాయుడిని  ఏపిలో ఓడించి, జగన్ ను గెలిపించి ‘‘రిటర్న్ గిఫ్ట్’’ ఇచ్చానని చెప్పుకున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ముందు… ఇప్పటి వరకూ జగన్ ను కలవలేదు.

కేసీఆర్ ఒక్కరే కాదు ఆయన కుమారుడు కేటీఆర్ గానీ, కుమార్తె కవిత గానీ జగన్ తమ సోదర సమానుడే అని చెబుతుంటారు. దావోస్ లో సీఎం జగన్ తో కేటీఆర్ భేటీ అయ్యారు కూడా. అయినా జాతీయ రాజకీయాల్లో జగన్ ను కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నం చేయడం లేదు. కేసీఆర్, కేటీఆర్, కవిత ప్రయత్నం చేయడం లేదో జగన్ రావడం లేదో తెలియదు కానీ మరే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లినా కూడా జగన్ సంగతి ఏమిటి? అని పైకి అనకపోయినా లోలోన మాత్రం అనుకుంటారు.

సాటి తెలుగు ముఖ్యమంత్రిని కలుపుకోకుండా కేసీఆర్ చేయగలిగే రాజకీయం ఏమిటి అని కూడా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ‘‘సోదర సమానుడైన’’ జగన్ బీజేపీ పక్షాన ఉంటే మరి కేసీఆర్ బీజేపీకి ప్రత్యామ్నాయం ఎలా నిర్మిస్తారు? అనేది పెద్ద ప్రశ్న. అసలు కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ఎందుకు వెళుతున్నారు? అనేది కూడా మరో పెద్ద ప్రశ్న.

17 పార్లమెంటు స్థానాలు మాత్రమే ఉన్న రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ నాయకుడిని దేశ ప్రధానిగా ఊహించుకోవడం కష్టమే. అంతకు ముందు చేసిన ప్రయత్నంలోనే కలిసి వచ్చేందుకు ఏ ప్రాంతీయ పార్టీ ముందుకు రాకపోవడంతో ‘‘ఫ్రంటు లేదు టెంటు లేదు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఫ్రంటు లేదు టెంటు లేదు అనే వ్యాఖ్య చేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ జాతీయ రాజకీయాలలో ఎలాంటి మార్పు లేదు. మరి ఇప్పుడు మళ్లీ ఆయన ఎందుకు ముందుకు వస్తున్నారో అర్ధం కావడం లేదు. ఇప్పటికీ కేసీఆర్ తో కలిసి వచ్చేవారు లేని ఈ స్థితిలో జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం ఎలా అవుతారో కేసీఆర్ కు క్లారిటీ ఉందో లేదో తెలియదు.

Related posts

ఉద్రిక్తతకు నిలయంగా మారిన రామతీర్దం కొండ

Satyam NEWS

వృద్ధురాలిపై దాడి చేసిన ఎలుగుబంటి

Satyam NEWS

సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Satyam NEWS

Leave a Comment