సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌లోని ఓ పెంపుడు కుక్క వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందింది. కుక్కపిల్ల మృతికి కారణమైన వైద్యుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రగతి భవన్ డాగ్స్ హ్యాండ్లర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిర్లక్ష్యం వహించిన వెటర్నరీ వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బహదూర్‌పురాకు చెందిన ఆసిఫ్ అలీఖాన్ ఐదేళ్లుగా ప్రగతి భవన్ డాగ్ హ్యాండ్లర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడున్న 9 పెంపుడు కుక్కలకు సంరక్షణ చూసుకుంటూ శిక్షణనిస్తున్నాడు. ఈ నెల 10న 11 నెలల హస్కీ అనే కుక్కపిల్ల అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆయన వైద్యమందించారు. కుక్క కొద్దిగా కోలుకుంది. సాయంత్రం 6గంటలకు మళ్లీ కుక్క అనారోగ్యానికి గురై తిండి మానేసింది. ఈ నెల 11న ఉదయం 7గంటలకు పాలు కూడా తాగకుండా తీవ్ర అస్వస్ధతకు గురైంది. వెంటనే ఆయన రెగ్యులర్ వెటర్నరీ డాక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 2గంటలకు అక్కడకు వచ్చిన వైద్యుడు పరీక్షలు నిర్వహించగా కుక్క 101 టెంపరేచర్ జ్వరంతో బాధపడుతుండడంతో లివర్ టానిక్ ఇచ్చాడు. దీంతో కుక్క పరిస్ధితి మరింత విషమించింది. దీంతో రాత్రి 9గంటలకు రోడ్ నంబర్ 4లోని యానిమల్ కేర్ క్లినిక్‌కు తీసుకెళ్లి డాక్టర్ రంజిత్‌కు చూపించాడు. ఆయన ట్రీట్‌మెంట్ ఇస్తుండగానే కుక్క చనిపోయింది. డాక్టర్ రంజిత్ నిర్లక్ష్యంతోనే కుక్క చనిపోయిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అలీఖాన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
previous post