డోనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. “అమెరికా స్వర్ణయుగం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది” అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అమెరికా కాల మానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా కాపిటల్ లో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. డోనాల్డ్ ట్రంప్ తో బాటు వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
ట్రంప్ అధ్యక్షుడిగా తన మొదటి గంటల్లోనే కార్యనిర్వాహక చర్యలకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేయాలనుకుంటున్నారు. 10 మంది సరిహద్దు భద్రత, ఇమ్మిగ్రేషన్ అధికారుల నియామకంపై దృష్టి సారించారు. దక్షిణ సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారని, సాయుధ దళాలను అక్కడికి పంపుతారని అనుకుంటున్నారు. ఆశ్రయం కోరేవారు అమెరికా కోర్టులు ప్రకటించే తేదీల కోసం మెక్సికోలో వేచి ఉండవలసిందిగా ఆదేశిస్తారని అనుకుంటున్నారు. తల్లిదండ్రులకు చట్టపరమైన హోదా లేకుండా అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వం ఇచ్చే పద్ధతికి కూడా ట్రంప్ ఉద్వాసన పలకనున్నారు.
రెండు అభిశంసన విచారణలు, ఒక నేరారోపణ, రెండు హత్యా ప్రయత్నాలు, 2020 ఎన్నికల ఓటమిని అధిగమించి ఆయన రెండో సారి అమెరికా అధ్యక్షుడు అయ్యారు. నవంబర్‌లో ట్రంప్ చేతిలో ఓడిపోయిన బిడెన్, అవుట్‌గోయింగ్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. 2016లో ట్రంప్ చేతిలో ఓడిపోయిన మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తన భర్త బిల్‌తో కలిసి వచ్చారు. అయితే ఒబామా భార్య మిచెల్ మాత్రం హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు.
ఇన్‌కమింగ్ అడ్మినిస్ట్రేషన్‌కు అనుకూలంగా మారాలని ప్రయత్నించిన అనేక మంది టెక్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రపంచంలోని ముగ్గురు ధనవంతులైన టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ CEO ఎలోన్ మస్క్, అమెజాన్ CEO జెఫ్ బెజోస్ మరియు మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్‌లతో సహా వేదికపై క్యాబినెట్ నామినీల పక్కన ప్రముఖ స్థానాలలో కూర్చున్నారు.