అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. మొదటి నుంచి ఆధిక్యతలో ఉన్న ట్రంప్ మేజిక్ ఫిగర్ కు చేరుకున్నారు. అత్యధిక రాష్ట్రాల్లోనూ ట్రంప్ మేజిక్ కొనసాగింది. ట్రంప్ మద్దతుదారులు తమ గెలుపుతో సంబరాలు జరుపుకుంటున్నారు. మరి కాసేపట్లో ట్రంప్, కమలా హ్యారీస్ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ట్రంప్ గెలుపు దిశగా దూసుకెళ్తున్న సమయంలో ఒక్క సారిగా కమలా హారీస్ కు బలం పెరిగింది. 270 కి చేరువగా ట్రంప్ అడుగులు వేస్తున్న సమయంలో కమలా హ్యారీస్ దూసుకొచ్చారు. అధ్యక్ష పదవి దక్కాలంటే ట్రంప్ కు మరో 24 ఓట్లు రావాలి. అదే సమయంలో కమలా హ్యారీస్ కు 60 వరకు అవసరం.
ఇక, అధ్యక్షుడిని డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్స్ లో ఏడు రాష్ట్రాల్లో ఆరు చోట్ల ట్రంప్ ఆధిపత్యం కొనసాగింది. ఇదే ఇప్పుడు ట్రంప్ కు కలిసొచ్చే అంశంగా మారింది. పలు రాష్ట్రాల్లో సర్వే సంస్థల అంచనాలు సైతం తారు మారు అయ్యాయి. కీలక రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య హోరా హోరీగా ఫలితాలు వచ్చాయి. నార్త్ కరోలినాలో ట్రంప్ గెలుపొందగా, న్యూ మెక్సికోలో కమల హారీస్ విజయం సాధించారు. కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, ఇల్లినాయిస్, మసాచుసెట్స్, మేరీల్యాండ్, న్యూజెర్సీ, న్యూయార్క్, రోడ్ ఐలాండ్, వెర్మోంట్ల కమలా హ్యారీస్ గెలుపొందారు.
అదే విధంగా..రిపబ్లికన్ల కంచుకోలుగా ఉన్న రాష్ట్రాలైన అలబామా, అర్కాన్సాస్, ఫ్లోరిడా, ఇండియానా, కెంటకీ, లూసియానా, మిస్సోరీ, మిస్సిస్సిప్పి, మోంటానా, నార్త్ డకోటా, నెబ్రాస్కా, ఒహియో, ఓక్లహోమా, సౌత్ కరోలినా, సౌత్ డకోటా, టేనస్సీ, టెక్సాస్, ఉటా వెస్ట్ వర్జీనియా, వ్యోమింగ్‌లో ట్రంప్ గెలుపొందారు. కమలా హరీస్ అతి పెద్ద రాష్ట్రం కాలిఫోర్నియాలో విజయం సాధించారు. అమెరికా ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కౌంటింగ్ లో ఆధిక్యతలు మారుతుండటంతో తుది ఫలితం పైన ఉత్కంఠ పెరిగింది.