18.3 C
Hyderabad
December 6, 2022 05: 36 AM
Slider సంపాదకీయం

రాజకీయాల నేపథ్యంలో దర్యాప్తు సంస్థల పనితీరుపై అనుమానాలు

సీబీఐ, ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లాంటి సంస్థలు కేవలం కేంద్రంలోని నరేంద్రమోడీ, అమిత్ షా ల సూచనల మేరకే పని చేస్తాయా? ఈ ప్రశ్న గత కొద్ది కాలంగా చర్చనీయాంశం గా మారింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా టార్గెట్ గా ఈ రెండు సంస్థలు దాడులు చేయడం, ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి తెలంగాణ లో మూలాలను కదలించడం లో చూపుతున్న శ్రద్ధ అదే కుంభకోణంతో పెద్ద పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ నాయకులు, వారి బంధువులపై చూపడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అడుగు ముందుకు పడకపోవడం నుంచి పలు అంశాలలో కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరుపై పలు అనుమానాలు ఉన్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీపై పోరాడుతున్నది.

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు బీజేపీకి దన్నుగా నిలుస్తున్నారు. ఈ కారణంగానే తెలుగు రాష్ట్రాల విషయంలోనే కేసుల పరిష్కారంలో వివక్ష కనిపిస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దల కనుసన్నల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నందువల్లే ఇలా జరుగుతున్నదని కూడా అనుకుంటున్నారు. ఈ ఆరోపణలను దూరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ గానీ ఈ రెండు రాష్ట్రాలలోని బీజేపీ నాయకులు కానీ ఏ మాత్రం ప్రయత్నించడం లేదు. అందువల్ల ఈ కేంద్ర సంస్థలు పక్షపాతంతోనే వ్యవహరిస్తున్నాయనే వాదనలు అందరూ నమ్మే స్థాయికి వచ్చాయి. తమను కలిసి ఆశీర్వాదం పొందే వారి పట్ల ఒక విధంగానూ, తమపై పోరాటం చేసే వారి పట్ల మరొక విధంగానూ కేంద్ర సంస్థలు పని చేసేలా కేంద్రంలోని బీజేపీ నాయకులు ప్రేరేపిస్తుంటారనే అపవాదు కూడా ఉంది.

జరుగుతున్న పరిణామాలను కరెక్టు చేసే బాధ్యతను ఎవరూ తీసుకోకపోవడం విషాదకరం. ఢిల్లీ కుంభకోణం విషయంలో వైసీపీకి చెందిన నాయకులు, వారి బంధువులపై ఈ సంస్థలు వేగంగా చర్యలు తీసుకోవడం లేదు. టార్గెట్ అంతా టీఆర్ఎస్ నేతలే కావడంతో వైసీపీ నేతలు, వారి బంధువులు ఏ మాత్రం ఆందోళన లేకుండా ఉన్నారని కూడా అంటున్నారు. క్యాసినో ప్రవీణ్ విషయంలో కూడా ఇదే తీరుగా కేంద్ర సంస్థల పనితీరు కనిపిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఆంధ్రాలో క్యాసినో నిర్వహించడం వల్లే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ అనే క్యాసినో నిర్వాహకుడు చేస్తున్న వ్యవహారాలన్నీ బయటకు వచ్చింది కూడా గుడివాడలో క్యాసినో నిర్వహించడం వల్లే. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు గుడివాడ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదు. గుడివాడలో క్యాసినో ఎవరు నిర్వహించారు?

కీలక పాత్ర పోషించింది ఎవరు? అనే విషయాలను కావాలనే మరుగున పెడుతున్నట్లు కనిపిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చికోటి ప్రవీణ్ కు ఆంధ్రా నేతలతో ఉన్న సంబంధాలపై ఎలాంటి ఫోకస్ పెట్టకుండా కేవలం తెలంగాణ కు చెందిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పైనే ఈ దర్యాప్తు సంస్థల దృష్టి ఉన్నట్లు కనిపిస్తున్నదని అంటున్నారు.

క్యాసినో ప్రవీణ్ కేసులో వైసీపీ నేత ఒకరు దొరికినా ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించడం లేదని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీతో పరోక్షంగా కలిసి పని చేస్తున్నట్లు ఇప్పటికే పలు సందర్భాలలో స్పష్టమైంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపించిందని అంటున్నారు. కేవలం వైసీపీ గేమ్ ప్లాన్ వేసుకున్న విధంగానే బీజేపీ ప్రవర్తించడం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో తమకు ఉన్న సంబంధాలను బహిరంగంగా వెల్లడించడానికే వైసీపీ ప్రధాని పర్యటనలో ఉత్సాహం చూపింది. బీజేపీ కూడా అదే విధంగా వ్యవహరించింది. దాంతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, వైసీపీల మధ్య విడదీయరాని అనుబంధం ఉందని అందరికి తెలిసింది. ఇదే సమయంలో దర్యాప్తు సంస్థలు తెలంగాణ లో ఒకలాగా ఆంధ్రాలో మరొకలాగా ప్రవర్తిస్తుండటంతో దర్యాప్తు సంస్థల పనితీరుపై అనుమానం పెరిగిపోతున్నది.

Related posts

యువత సేవా దృక్పథంతో ముందుకు సాగాలి

Sub Editor

ఎంపి ధర్మపురి అరవింద్ పై ఛీటింగ్ కేసు పెట్టాలి

Satyam NEWS

నిర్మల్ పట్టణంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!