వైకాపా పాలనలో హత్య చేయబడిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు లెక్కకు మించి జరిగాయని, ఐదేళ్ళ పాటు దళితులపై జరిగిన దమనకాండ పై పిడికెడు ఆత్మగౌరవం కోసం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించామని గుర్తు చేశారు. వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంఘటనను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదుకుంటామని చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చి తుంగలో తొక్కిందని చెప్పారు. సుబ్రహ్మణ్యం సోదరుడు నిరుద్యోగి అని, తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని, తల్లి నాలుగు ఇళ్ళ దగ్గర కూలి పని చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం వచ్చి ఏడాది దగ్గర పడుతున్నా, గత ప్రభుత్వ హయాంలో సమిధలు అయిన దళితులకు న్యాయం జరగకపోవటం బాధిస్తోందని చెప్పారు. రాజ్యాంగ బద్ధమైన ఎస్సీ, ఎస్టీ కమీషన్ నియామకాలు కూడా పూర్తి చేయకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. కమీషన్ నియామకాలు జరిగితే, వారు బాధితులను ఓదార్చి, ధైర్యం చెప్పి, చర్యల గూర్చి ప్రభుత్వానికి విన్నవించే అవకాశం ఉంటుందని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.
previous post
next post