చంద్రబాబునాయుడి ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం తలెత్తిందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో నేడు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రూ.40వేల కోట్ల బిల్లులను పెండింగులో పెట్టిందని, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై కొన్ని నెలలుగా దృష్టిపెట్టామని అన్నారు. అందువల్ల అనవసర వ్యయాన్ని తగ్గించడానికి అధికారులు దృష్టిపెట్టాలని సీఎం కోరారు. అలాగే ప్రాధాన్య అంశాలపై దృష్టిపెట్టాలి, ఫోకస్‌గా ముందుకు వెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు. నిధులను అక్కడ కొంత, ఇక్కడ కొంత ఖర్చు చేస్తే వచ్చే ప్రయోజనం ఉండదని,
నవరత్నాల అమలే ఈ ప్రభుత్వానికున్న ఫోకస్‌గా మారాలని అన్నారు. తమ పార్టీ మేనిఫెస్టో అందరి వద్దా ఉండాలని అందులోని ప్రాధాన్యతాంశాలను నెరవేర్చాలని ఆయన అధికారులకు సూచించారు. సామాన్యులపై భారం మోపకుండా ఆదాయాలు ఎలా పెంచుకోగలమో ఆలోచనలు చేయాలని, ఢిల్లీలో ఉన్న మన అధికారులను బాగా వినియోగించు కోవాలని, కేంద్రం నుంచి వీలైనన్ని నిధుల్ని తెచ్చుకోవాలని ఆయన అన్నారు.