27.7 C
Hyderabad
March 29, 2024 03: 09 AM
Slider సంపాదకీయం

‘‘ఢిల్లీ లిక్కర్’’ పుట్టలో నుంచి ఏ పాము బయటికొస్తుందో..?

#enforcementdirectorate

తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎప్పుడైనా ఏ క్షణాన అయినా ‘‘పెద్దల’’ పేర్లు బయట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన వారు తెలంగణ పెద్దలతో ఉన్న ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పట్టుబడ్డవారు ఎన్ ఫోర్సు మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నలకు తికమకపడి పెద్దల పేర్లు చెప్పేస్తే కొంపలు అంటుకోవడం ఖాయం. ఎన్ ఫోర్సుమెంటు డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే రెండు దఫాలుగా హైదరాబాద్ లో తనిఖీలు నిర్వహించింది. బంజారాహిల్స్ లోని రియల్ ఎస్టేట్ వ్యాపార వేత్త వెన్నమనేని శ్రీనివాసరావు నివాసంతో బాటు ఉప్పల్ లోని సాలిగ్రామ్ టెక్నాలజీజ్, మాదాపూర్ లోని వరుణ్ సన్ సంస్థ, బంజారాహిల్స్ లోని జానా ట్రావెల్ ఏజెన్సీలలో ఈడీ తనిఖీలు నిర్వహించింది.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు నివాసం ఆయన కార్యాలయాలపై గత వారం ఈడీ తనిఖీలు నిర్వహించింది. అక్కడ దొరికిన ఆధారాలతో తాజాగా తనిఖీలు నిర్వహించడంతో మరింత సమాచారం వారికి దొరికనట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే 15 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇంకా మరి కొన్ని పేర్లు ఉన్నాయని సీబీఐ ఆ సందర్భంగా చెప్పింది.

ఇందులో ఒకరిద్దరు ఉన్నతాధికారులు ఉండగా వారిలో ఒక ఐఏఎస్ అధికారిని కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే కేసుకు సంబంధించి ఈడీ దూకుడు పెంచడంతో కొందరు టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ లను ఉపయోగించి అవినీతికి పాల్పడ్డ రాజకీయనాయకులందరిని కేసుల్లో బుక్ చేస్తున్నారు.

మరీ ముఖ్యంగా బీజేపీయేతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఈడీ, సీబీఐ లకు ఈజీగా దొరికిపోతున్నారు. ఆయా రాష్ట్రాల బీజేపీ నాయకులు అన్ని ఆధారాలు సేకరించి అవినీతికి పాల్పడుతున్న తమ ప్రత్యర్థులను ఈడీకి సీబీఐకి పట్టిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ నాయకులు ఈడీ, సీబీఐ లతో సమానంగా స్టింగ్ ఆపరేషన్లు చేసి తమ రాజకీయ ప్రత్యర్థులు అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి చర్యలతోనే టీఆర్ఎస్ నాయకులకు కంగారు మొదలైంది.

తెలంగాణ బీజేపీ కూడా స్టింగ్ ఆపరేషన్లు చేసి తమకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఈడీ, సీబీఐలకు పంపిందా అనే అనుమానం టీఆర్ఎస్ నాయకుల మనసులను తొలచివేస్తున్నది. కరీంనగర్ కు చెందిన శ్రీనివాసరావుకు ఈడీ అధికారులు ఆరు గంటల పాటు విచారణ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈడీ చేతిలో చిక్కిన రామచంద్రన్ పిళ్లై, గండ్ర పేమ సాగర్ రావులతో శ్రీనివాసరావుకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

శ్రీనివాసరావు హవాలా మార్గం ద్వారా నిధులు పెద్ద ఎత్తున బదిలీలు చేసినట్లు ఈడికి ఆధారాలు లభించాయని చెబుతున్నారు. ఇదే నిజమైతే బడా నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులకు  శ్రీనివాసరావు కంపెనీ నుంచి పలుమార్లు ఢిల్లీ కి విమాన టిక్కెట్లు బుక్ అయినట్లు కూడా ఈడీ గుర్తించిదని తెలిసింది.

శ్రీనివాసరావు ఎవరెవరికి టిక్కెట్లు బుక్ చేశారనే విషయం వెల్లడి కాలేదు కానీ ఈడీ వద్ద వివరాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ జాబితాలో పేర్లు ఉన్న వారికి కూడా ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఢిల్లీ బీజేపీ నాయకులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. హైదరాబాద్ నుంచి ‘‘కొందరు’’ పలుమార్లు ఢిల్లీకి విమానాల్లో వచ్చారని, వారందరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉందని ఢిల్లీ బీజేపీ నాయకులు అప్పటిలో చెప్పారు.

శ్రీనివాసరావుకు పలువురు టీఆర్ఎస్ అగ్రనాయకులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో రాబోయే రోజుల్లో మరికొందరికి నోటీసులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ సోదాలు జరిపిన మరో కంపెనీ సాలిగ్రామ్ టెక్నాలజీస్. ఈ కంపెనీని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. రామచంద్రన్ పిళ్లైకి చెందిన రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రి బ్యూషన్ కంపెనీ పై ఈడీ నిఘా పెట్టి ఉన్నది,

ఈ కేసులో రామచంద్రన్ పిళ్లై 14వ నిందితుడుగా ఉన్నారు. ఇప్పటికే ఈడీ ప్రశ్నించిన ప్రముఖుల్లో అభిషేక్ రావు కూడా ఉన్నారు. వీరంతా టీఆర్ఎస్ పెద్ద నాయకులకు సన్నిహితులు. వారితో ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ ‘‘పెద్ద’’ నాయకుల పై ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కత్తి వేలాడుతూనే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.

Related posts

హాజరీ హో: అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టుకు నేడు జగన్

Satyam NEWS

నవరత్నాలలో భాగంగా మరో ముందడుగు…!

Satyam NEWS

రైతు పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment