తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు మధ్య ఒక టెంపోట్రావెలర్ ప్రమాదానికి గురైంది. ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద అదుపుతప్పి లోయలో పడటంతో 8 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వీరు మారేడుమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులంతా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం నుంచి వచ్చారు. భద్రాచలం దర్శనం అనంతరం అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో టెంపోట్రావెలర్ లో 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మారేడుమిల్లి-చింతూరు రహదారి లోయలు, గుట్టలతో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ మార్గం మరింత ప్రమాదకరంగా మారింది. దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న ఈ రహదారిలో చాలా నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే ఎక్కువగా వాహనాలు నడుపుతుంటారని.. కొత్తగా వచ్చేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
previous post