ఈనెల 17వతేదీన మంగళగిరి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)ప్రధమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపధ్యంలో అందుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ దేశ ప్రధమ పౌరురాలైన రాష్ట్రపతి రాష్ట్ర పర్యటన విజయవంతం చేసేందుకు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏ చిన్నపాటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రపతి పర్యటన విజయవంతానికి చర్యలు తీసుకోవాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
తాత్కాలిక కార్యక్రమం ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17వ తేదీన ఉ.11.20గం.లకు భారత వాయుసేన విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.తదుపరి అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12.05 గం.లకు మంగళగిరి ఎయిమ్స్ కు చేరుకుని అక్కడ జరిగే ఎయిమ్స్ ప్రధవ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం గన్నవరం విమానాశ్రనం నుండి తిరిగి ప్రయాణం అవుతారని తెలిపారు.
భారత రాష్ట్రపతి పర్యటనలో రాష్ట్ర గవర్నర్,రాష్ట్ర ముఖ్యమంత్రి,కేంద్ర,రాష్ట్ర మంత్రులు తదితర ప్రముఖులు పాల్గోనున్నందున అందుకనుగుణంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. అనంతరం ఆయా శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై శాఖల వారీగా ఆదేశాలు జారీ చేశారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికే ఏర్పాట్లు సహా మంగళగిరి ఎయిమ్స్ లో స్నాతకోత్సవం పూర్తయి వెళ్ళే వరకూ గల ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేపట్టాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు వైద్య ఆరోగ్యశాఖ పరంగా చేపట్టనున్న ఏర్పాట్లను సిఎస్ కు వివరించారు. ఈ సమావేశానికి వర్చువల్ గా పాల్గొన్న డిజిపి ద్వారకా తిరుమల రావు పోలీస్ బందోబస్తు ఇతర ఏర్పాట్ల గురుంచి వివరించారు. అలాగే కృష్ణా,ఎన్టిఆర్,గుంటూరు జిల్లాల కలక్టర్లు బాలాజీ,లక్ష్మిష,నాగలక్ష్మి రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను సిఎస్ కు వివరించారు.
ప్రోటోకాల్ విభాగం అనదపు సంచాలకులు మోహన్ తొలుత రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి వివిధ శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను వివరించారు. ఈ సమావేశంలో మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్,గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ సహా పలువురు వివిధ శాఖల అధికారులు వర్చువల్ గా పాల్గొని వారి వారి శాఖల చేస్తున్న ఏర్పాట్లను సిఎస్ కు వివరించారు.