మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అక్టోబరు 21న రెండు రాష్ట్రాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబరు 4తో నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. అక్టోబరు 5న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 7వరకు గడువు విధించారు. అక్టోబరు 21న ఎన్నికలు నిర్వహించి, అక్టోబరు 24న ఫలితాలు వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునిల్ అరోడా వెల్లడించారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో 288, హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబరు 9న, హరియాణా శాసనసభ పదవీకాలం నవంబరు 2న ముగియనుంది. మహారాష్ట్రలో 8.94 కోట్లు, హరియాణాలో 1.82కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు, భద్రతాపరమైన చర్యలు చేపట్టనున్నట్లు సునిల్ అరోడా వెల్లడించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని సెక్యూరిటీ పోస్టుల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ఎన్నికలు ఎకో ఫ్రెండ్లీగా జరగాలని, రాజకీయ నేతలు తమ ప్రచారంలో ప్లాస్టిక్‌ను నిషేధించాలని కోరారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరగబోతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. దీంతో భాజపా వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం హరియాణా, మహారాష్ట్రల్లో భాజపానే అధికారంలో ఉంది.
previous post
next post