ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా వద్దా అనే అంశం కార్మిక సంఘాలకు సంబంధించినది కాదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె కేశవరావు అన్నారు. ఆర్టీసీ ని ప్రభుత్వం లో కలిపే ప్రతిపాదనేది తమ ఎన్నికల ప్రణాళిక లో చేర్చలేదని, ఆర్టీసీ యే కాదు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేయాలని మేనిఫెస్టో లో పేర్కొన లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం లో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే ప్రభుత్వ విధానాన్ని (పాలసీ )మార్చుకోవాలని కోరడమే అవుతుందని ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయమని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ ని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్ రావు ఇటీవలే తేల్చిచెప్పినందుకు ఆయనను అభినందిస్తున్నానని కేశవరావు తెలిపారు. ప్రభుత్వం లో ఆర్టీసీ విలీనం అనే అంశం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్ల ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గతం లో చక్కగా పరిష్కరించిందని, 44 శాతం ఫిట్ మెంట్ ,16 శాతం ఐ ఆర్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.
previous post