23.2 C
Hyderabad
November 29, 2021 16: 20 PM
Slider సంపాదకీయం

కేసీఆర్ ను కాపాడలేకపోయిన దళిత బంధువులు

#Telangana CM KCR 2

హుజూరాబాద్ లో బిజెపి గెలిచింది… అనడానికి వీల్లేదు… ఈటెల రాజేందర్ గెలిచాడు అంటే సరిపోతుంది. అంతకు ముందు ఎన్నికలలో కనీసం 1500 ఓట్లు కూడా తెచ్చుకోలేని బిజెపి అమాంతం 23 వేల మెజారిటీతో గెలవడం కుదిరేపని కాదు. ఆ పనిని సాధించి పెట్టినవాడు ఈటెల రాజేందర్. బిజెపి అభ్యర్ధి ఎవరు గెలిచినా సీఎం కేసీఆర్ కు అంత బాధ ఉండేది కాదు.

ఈటెల రాజేందర్ గెలుపు కచ్చితంగా కేసీఆర్ ను మానసికంగా కుంగదీస్తుంది. ‘‘ఈ జెండా నాది’’ అన్నందుకు కక్షగట్టి మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసి బయటకు పంపిన కేసీఆర్ ఇప్పుడు బాధను చేజేతులా కొని తెచ్చుకున్నారు. ఒక్క సీటులో ఓడిపోయినంత మాత్రాన కేసీఆర్ కు గానీ, కేసీఆర్ ప్రభుత్వానికి గానీ ఏమీ కాదు. అయితే ఈటెల గెలుపు మయ సభలో దుర్యోధనుడికి జరిగినంత పరాభవాన్ని మాత్రం కేసీఆర్ కు మిగిల్చింది.

అప్పడాల కర్ర వల్ల ఓట్లు చీలిపోయాయని కారుగుర్తును పోలిన గుర్తు ఉండటం వల్ల చేటు జరిగిందని టీఆర్ఎస్ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసినా ఈ పరాభవం తీరేది కాదు. లక్షల కోట్ల రూపాయలతో దళిత బంధు స్కీమ్ ను ప్రవేశ పెట్టినా కూడా ఓటమి ఎదురు కావడం కేసీఆర్ మార్కు రాజకీయానికి పెద్ద దెబ్బ. దళిత బంధు అమలు చేసిన గ్రామంలో కూడా బిజెపికి మెజారిటీ వచ్చిందంటే ఆ స్కీమ్ కేసీఆర్ విజయానికి ఏ మాత్రం దోహదపడదనే విషయం అర్ధం అవుతున్నది.

ఎంత మంది ఎన్ని రకాలుగా ఖండించినా కూడా దళిత బంధు తెచ్చింది కేవలం హుజూరాబాద్ లో గెలిచేందుకు మాత్రమే. ఇప్పుడు తనకు అక్కరకు రాని దళిత బంధును కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. నిజంగా ఓట్ల కోసం కాకపోతే దళిత బంధును ఇప్పుడు అమలు చేయాలి. చేస్తారా? ఏమో చూడాలి. అసెంబ్లీలో ఇప్పటికే రఘునందన్ రావు లాంటి వ్యక్తిని శత్రువుగా కొని తెచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు ఈటెల రాజేందర్ కుంపటిని రగిల్చుకున్నారు.

ఒక్క అసెంబ్లీలోనే కాదు… బయట కూడా ఇక కేసీఆర్ కు తలనొప్పులు ఎదురవుతాయి. చాలా జిల్లాల్లో వర్గ శత్రువుల్లా టీఆర్ఎస్ నాయకులు కొట్టుకుంటున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ముఠా తగాదాలు టీఆర్ఎస్ కు ఇప్పుడు పెను ముప్పును తెచ్చిపెడతాయి. రాజకీయంగా కేసీఆర్ ను సవాల్ చేయలేం అనే అంశం ఇప్పుడు తెరమరుగు అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇక నుంచి కేసీఆర్ ను సవాల్ చేస్తారు….కొందరు మంచి తనంతో మరి కొందరు ఇంకో రకంగా కేసీఆర్ కు ఏకు మేకుల్లా తయారవుతారు.

వీటన్నింటిని కంట్రోల్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదుర్కొవాల్సి రావచ్చు. కేవలం విధేయులనే పక్కన పెట్టుకుంటే ఈ సమస్యలు మరింతగా పెరుగుతాయి. నాయకుల్ని వాడుకుని వదిలేసే విధానానికి కేసీఆర్ ఇప్పటికైనా స్వస్తి పలకాల్సి ఉంటుంది. పదవుల కోసం కాకుండా పార్టీకి విధేయులుగా ఉన్న వారిని ఎంపిక చేసుకుంటేనే టీఆర్ఎస్ కు రాబోయే రోజులు మంచి రోజులుగా మారుతాయి…..  

Related posts

రేవంత్ రెడ్డి విడుదలపై కొల్లాపూర్ లో సంబరాలు

Satyam NEWS

జగన్ గురూజీ ఆధ్వర్యంలో వేసవిలో ఉచిత సేవలు

Satyam NEWS

గరుడ వారధి కారణంగా తొలగించిన విగ్రహాలను భద్రపరచండి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!