27.7 C
Hyderabad
April 26, 2024 03: 08 AM
Slider కరీంనగర్

ధర్మపురిలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మార్గం సుగమం

#ministerktr

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్‌ మండల పరిధిలో ఏటా 8 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగిన ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. ప్రఖ్యాత క్రిభ్‌కో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సంకల్పించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇథనాల్‌ పరిశ్రమను ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయాలని గత ఏడాది నవంబర్‌ మాసంలో ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గోదావరి నది సమీపంలోని వెల్గటూర్‌ మండల పరిధిలో పరిశ్రమ ఏర్పాటుకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు పరిశీలించిన విషయం తెలిసిందే. కాగా ఇథనాల్‌ పరిశ్రమను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన, వంద ఎకరాల స్థలంలో కొంత మేర ఉన్న గట్టు ప్రాంతాన్ని చదును చేసి, ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలాన్ని సన్నద్దం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్థల సన్నద్దత కోసం రూ. 13 కోట్లను కేటాయించడంతో పాటు, స్థల సన్నద్దత పనులను టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత స్థలంలోని గుట్టబోరు ప్రాంతాన్ని చదును చేసి, స్థలాన్ని ఫ్యాక్టరీ నిర్మాణానికి సన్నద్దం చేయాలని సంకల్పించడంతో వెల్గటూర్‌ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఇథనాల్‌ పరిశ్రమకు మార్గం సుగమం అయ్యింది. 

సేద్య ఖిల్లా జగిత్యాల జిల్లా తలరాతను మార్చివేసి, రైతాంగానికి అండగా నిలువడంతో పాటు వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పనతో పాటు,  సేద్యానికి అడ్డాగా పేరుగాంచిన జగిత్యాల జిల్లాలో ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాలు అత్యధికంగా ధర్మపురి ప్రాంతంలో  పెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రయత్నించిన విషయం తెలిసిందే.

మంత్రి ఈశ్వర్‌ విజ్ఞప్తితో క్రిశాంత్‌ భారతీ కో ఆపరేటివ్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ. 700ల కోట్ల ప్రాథమిక అంచనాలతో, ఇథనాల్‌ ఉత్పత్తి ఫ్యాక్టరీని ధర్మపురి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ నిర్ణయించి విషయం విదితమే. 

రూ. 700 కోట్లతో…ఇథనాల్‌, రైస్ బ్రౌన్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీ ..

వ్యవసాయ రంగంలో గొప్పగా పేరుగాంచిన జగిత్యాల జిల్లాలో పెద్ద ఫ్యాక్టరీలు లేవు. జగిత్యాల ప్రాంతంలో  వ్యవసాయాధారితమైన భారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన  నేపథ్యంలో పుష్కలమైన నీటి వసతి, వరి, మక్క పంట పండే పరిస్థితులు ఉన్న ధర్మపురి ప్రాంతం సరైదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో, ఎరువుల ఉత్పత్తిలో కీలకమైన క్రిభ్‌కో సంస్థ ద్వార ఇథనాల్‌, పరిశ్రమను ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయాలని గత ఏడాది నవంబర్‌ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌క్రిభ్‌కో సంస్థ ముందుకు రావడంతో  పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించారు. ఈ మేరకు పరిశ్రమకు రూ. 700ల కోట్లు సైతం మంజూరు ఇవ్వడానికి నిర్ణయించారు.

వేలాది మందికి ఉపాధి…రోజుకు లక్షల లీటర్ల రైస్బ్రౌన్‌ ఆయిల్‌ ఉత్పత్తి…

ధర్మపురి నియోజకవర్గ పరిధిలో క్రిభ్‌కో సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఇథనాల్‌ ఫ్యాక్టరీ వల్ల జగిత్యాల జిల్లా సాంకేతిక రంగ స్వరూపమే మారిపోనుంది. ఇథనాల్‌,  ఫ్యాక్టరీ ద్వార ప్రత్యక్షంగాను, పరోక్షంగాను జగిత్యాల జిల్లా వాసులైన యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడన్నాయి. రూ. 700 కోట్ల అంచనాలతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వార ప్రతి రోజు ఇథనాల్‌లు ఉత్పత్తి చేయబడుతాయి. రెండు దశల్లో ఏర్పాటు చేయాలని సంకల్పించిన ఈ ఫ్యాక్టరీ ద్వార ఏడాదికి 6 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి, మొక్కజొన్న ఇథనాల్‌ తయారీ కోసం వినియోగించబడనుంది.

వెల్గటూర్‌ మండల పరిధిలో స్థల నిర్ణయం…

ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో గత ఏడాది నవంబర్‌ 18న జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి, ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల పరిధిలో పరిశ్రమ స్థాపనకు అనువైన స్థలాన్ని పరిశీలించి, వెల్గటూర్‌ మండలంలోని స్థంభంపెల్లి గ్రామ శివారులో సర్వేనెంబర్‌1090 లో 413 ఎకరాల ప్రభుత్వం భూమిని గుర్తించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో వంద ఎకరాల స్థలాన్ని ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.  కలెక్టర్‌ రవి నివేదిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రి కొప్పుల ఈశ్వర్‌లు ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి, పూర్తి నివేదికను ప్రభుత్వంకు అందజేశారు.

స్థలాన్ని పరిశీలించిన క్రిభ్‌కో చైర్మన్‌, డైరెక్టర్లు…

వెల్గటూర్‌ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ ప్రతిపాదిత స్థలాన్ని క్రిభ్‌కో చైర్మన్‌ డాక్టర్‌ చంద్రపాల్‌ సింగ్‌, మంత్రి కొప్పుల ఈశ్వర్‌, క్రిభ్‌కో వైస్ చైర్మన్‌, డైరెక్టర్లు ఇటీవలే పరిశీలించారు. డిసెంబర్‌ 28న వెల్గటూర్‌ ప్రాంతంలోని ఫ్యాక్టరీ ప్రతిపాదిత స్థలాన్ని చైర్మన్‌ డాక్టర్‌ చంద్రపాల్‌ సింగ్‌, వైస్ చైర్మన్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌, డైరెక్టర్‌ బ్రిజేందర్‌ సింగ్‌, ఇతర డైరెక్టర్లు, ఫ్యాక్టరీ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాంరెడ్డిలు పరిశీలించారు.  గోదావరినది అందుబాటులో ఉండటం, రహదారి అవకాశాలు మెరుగ్గా ఉండటం, క్రిభ్‌కో ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రామగుండం ఎరువుల కర్మాగారం సమీపంలో ఉండటం, పుష్కలమైన నీటి వసతి అన్నింటిని పరిశీలించిన క్రిభ్‌కో చైర్మన్‌, వైస్ చైర్మన్‌, డైరెక్టర్లు ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రకటించారు. ఈ సందర్భంగా క్రిభ్‌కో చైర్మన్‌ చంద్రపాల్‌ సింగ్‌ ఏటా 8 కోట్ల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

ఫ్యాక్టరీ ప్రతిపాదిత స్థల సన్నద్దత ఏర్పాట్లు టీఎస్ఐఐసీకి…

ఇథనాల్‌ ఫ్యాక్టరీ ప్రతిపాదిత స్థల సన్నద్దత బాధ్యతలను టీఎస్ఐఐసీకి అప్పగిస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, టీఎస్ఐఐసీ చైర్మన్‌ నర్సింహరెడ్డి, క్రిభ్‌కో సంస్థ తెలంగాణ ప్రతినిధి, ఇథనాల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాంరెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేతకానితో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రతిపాదించిన స్థలంలో కొంత భాగంలో గుట్టబోరు ఉండటం కొంత ఇబ్బందికరంగా ఉందని, ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇవి అడ్డంకిగా ఉన్నాయన్న అభిప్రాయాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ప్రతిపాదిత స్థలంలో గుట్టలను చదును చేయాలని నిర్ణయించారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ప్రతిపాదిత స్థలంలోని గుట్టబోరును తొలగించి, ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలాన్ని సన్నద్దం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గుట్టబోరు స్థలాన్ని చదును చేసి, ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థలాన్ని అనువుగా మార్చేందుకు రూ. 13 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ నిర్ణయంతో ధర్మపురి ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్‌ ఫ్యాక్టరీకి ఉన్న చిన్న ఇబ్బంది సైతం తొలిగిపోయి, ఫ్యాక్టరీ నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.

త్వరలోనే ఫ్యాక్టరీ పనులకు శంకు స్థాపన

తెలంగాణకే తలమానికంగా నిలువనున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ సమీక్ష అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ ఏటా 8 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగిన ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ సంకల్పించారన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు క్రిభ్‌కో సైతం పూర్తిస్థాయి అంగీకారం తెలిపిందని, ప్రతిపాదిత స్థలంలో ఉన్న చిన్న అవరోదమైన గుట్టబోరు విషయాన్ని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లగా, స్పందించిన మంత్రి కేటీఆర్‌, గుట్టబోరును చదును చేసి స్థలాన్ని సిద్దం చేసేందుకు అంగీకరించడంతో పాటు బాధ్యతను టీఎస్ఐఐసీకి అప్పగించారన్నారు. ఇందుకోసం రూ. 13 కోట్ల మంజూరు చేశారన్నారు. త్వరలోనే ఇథనాల్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందన్నారు. రూ. 700ల కోట్ల విలువైన ఫ్యాక్టరీని మంజూరు చేయడంతో పాటు, స్థల సన్నద్దతకు సైతం నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు మంత్రి ఈశ్వర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ఢిల్లీలో నేడు కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ

Satyam NEWS

పేద పిల్లలు విద్యకు దూరం కాకూడదు

Bhavani

తెలంగాణ లో ఆక్సిజన్ కొరత లేకుండా చేస్తున్నాం

Satyam NEWS

Leave a Comment