వన్యప్రాణులు ఆహారం కోసం అలమటిస్తున్న దుస్థితి కళ్లకు కట్టే సంఘటన ఇది. ఇంత దయనీయ స్థితిలో కూడా తన బిడ్డను కాపాడుకుంటున్న ఒక కోతి కథ ఇది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామ శివారు అడవి ప్రాంతం లో ఉండే కోతులు, ఇతర ప్రాణులు రోడ్డున పోయే వారు పడవేసే ఆహారం కోసం రోడ్డుపైకి వస్తుంటాయి. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ హైదరాబాద్ హైవే అది. వాహనాలు ఎంతో వేగంగా వెళుతుంటాయి.
ఒక కోతి రోడ్డు దాటుతుండగా నర్సాపూర్ వైపు వెళుతున్న వాహనం ఢీ కొట్టడంతో తలకు తీవ్రంగా గాయమై రక్తస్రావం ఎక్కువగా జరిగింది. రక్తంతో తడిసి ముద్దయింది. అదే సమయంలో తన బిడ్డ ఆకలితో ఉండటం చూసి ఆ రక్తపు మడుగులోనే ఉన్న ఆ తల్లి తన బిడ్డకు పాలిచ్చిన దృశ్యం అటు వైపు వెళ్లే వారిని కంటతడి పెట్టించింది. తల్లి ప్రేమ అక్కడివారిని వారి మనసులను కదిలించే చేసింది. ఈ దృశ్యం వాహనదారుల కెమెరాకు చిక్కింది.