మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు. అధికారంలో ఉన్నప్పటి తరహాలోనే వ్యవహరించారు. గుంటూరు జిల్లాలో చంద్రబాబు చలో ఆత్మకూరుకు వెళ్తుంటే శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు వచ్చారు. చంద్రబాబు నివాసం వద్దకు వెళ్తున్న అచ్చెన్నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని.. అక్కడ పరిస్థితులను రెచ్చగొట్టే చర్యలను అంగీకరించబోమని అడ్డుకున్నారు. దాంతో అచ్చెన్నాయుడికి కోపం వచ్చింది. నోటికొచ్చినట్టు పోలీసులను తిట్టారు.
తనను అడ్డుకున్న ఎస్పీని ”యూజ్ లెస్ ఫెలో” అంటూ బూతులు తిట్టారు. నడి రోడ్డుపైనే సాటి పోలీసుల ముందే ఎస్పీని పట్టుకుని అచ్చెన్నాయుడు అనరాని మాటలు అన్నారు. మీరెవర్రా నన్ను అడ్డుకోవడానికి అంటూ పోలీసులను బూతులు తిట్టాడు అచ్చెన్నాయుడు. దాంతో పోలీసులే దిగ్భ్రాంతికి గురయ్యారు. మరోవైపు అక్కడే ఉన్నఇతర తెలుగుదేశం నాయకులు ఈ సంఘటనను చూస్తూ నిలబడ్డారే తప్ప వారించేందుకు కూడా ప్రయత్నించలేదు.విధి నిర్వహణలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులను యూజ్ లెస్ ఫెలోస్ అంటూ తిట్టడంపై పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మండిపడింది. అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బండారు నాని మాట్లాడుతూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.