సురభి వంశస్తులంటే కొల్లాపూర్ ప్రాంతంలో ప్రత్యేక గౌరవం ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి వారు రాజులు. కొల్లాపూర్ విశిష్టతను తెలిపే కోట ఇప్పటికీ గౌరవంగా అక్కడ నిలిచి ఉంది. అయితే ఆ కోట గౌరవాన్ని సురభి వంశస్తులే తీసేస్తుంటే…? అదే ఇక్కడ జరుగుతున్నదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సవివరంగా కొల్లాపూర్ ప్రాంత ప్రజానీకానికి వివరించడంతో ఇక్కడి ప్రజల్లో ఒక్క సారిగా చైతన్యం వచ్చింది. కొల్లాపూర్ రాజకుటుంబం వారసుడు ఇన్ని అక్రమాలు చేస్తున్నాడా అంటూ విస్తుపోతున్నారు.
కొల్లాపూర్ కోట స్థలాన్ని ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్న రాజుగారు దాన్ని అడ్డుకుంటున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. దాంతో జూపల్లి కొల్లాపూర్ ఎన్ టి ఆర్ చౌరాస్తాలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అన్ని వివరాలను బయటపెట్టారు. సురభి ఆదిత్య లక్ష్మణరావు చేస్తున్న ఆగడాల చిట్టా విప్పారు. ఆదిత్య లక్ష్మణరావు తండ్రి జగన్నాధ రావు కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వానికి ఇచ్చిన భూములను వాపసు తీసుకుని దొంగ పత్రాలతో నకిలీ రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకొని అమాయక ప్రజలను మోసం చేశారని జూపల్లి బహిరంగ సభలో ఆరోపించారు.
శ్రీశైలం ముంపుకు గురైన 60 ఎకరాల భూములపై ఆదిత్య లక్ష్మణరావు ప్రభుత్వంతో నష్టపరిహారం తీసుకొని ఇప్పుడు అదే భూములను రైతులకు కౌలుకిచ్చి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా మదన గోపాల స్వామి ఆలయంలో పంచలోహాల విగ్రహాలను తీసుకెళ్ళింది ఆదిత్య లక్ష్మణరావు కాదా? అంటూ జూపల్లి సూటిగా ప్రశ్నించారు. సురభి వంశస్థులు పాలన అంటే నాకు ఎంతో గౌరవం. ఎందుకంటే రాజా జగన్నాధ రావు కొల్లాపూర్ ప్రాంత ప్రజల కోసం రాజకోట సంబంధించిన భూములను దానంగా ఇచ్చేశారు. ఎమ్మార్వో, ఆర్ఐడి కాలేజ్, పాఠశాల తదితర నిర్మాణాల కోసం కలెక్టర్ సమక్షంలో ప్రభుత్వానికి ఇచ్చారని జూపల్లి తెలిపారు.
అందుకే సురభి వంశస్తులకు ఎనలేని గౌరవం ఇస్తానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అయితే ఆ గౌరవాన్ని రాజాగారి వారసుడు నిలబెట్టుకోక పోగా చెడగొట్టుకుంటున్నాడని ఆయన అన్నారు. తండ్రి దానం చేసిన భూములను మళ్లీ ఆక్రమించుకుని అమ్ముకుంటున్నాడని జూపల్లి తెలిపారు. సోమవారం రాత్రి కొల్లాపూర్ పట్టణం ఎన్టీఆర్ చౌరస్తాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక గంట మాట్లాడి ఈ విషయాలన్నీ వెలికి తెచ్చారు. పెంట్ల వెళ్లి గ్రామ ఆలయంలో పంచలోహ విగ్రహాలు తీసుకెళ్లేందుకు ప్రయత్నించి చెప్పు దెబ్బలు తిన్నది ఆదిత్య కాదా ?అని జూపల్లి ప్రశ్నించారు.
సింగోటం గ్రామ ఆలయంలో పంచలోహాలు విగ్రహాలు తీసుకెళ్ళింది మీరు కాదా? అని ప్రశ్నించారు. కొల్లాపూర్ శివాలయంలో పంచలోహ విగ్రహాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. వీటన్నిటికి మీరే కారణం డబ్బులకు కక్కుర్తి పడ్డది మీరు కాదా? అని ప్రశ్నించారు. కొల్లాపూర్ జఫర్ మైదానంలో అప్పటి సురభి వంశస్థులు జగన్నాధ రావు 1954 జాగీరా యాక్ట్ చట్టం ప్రకారం కలెక్టర్ సమక్షంలో పది ఎకరాల భూమిని, రాజ కోట ప్రహరీ స్థలాన్ని ప్రభుత్వానికి చెందుతుందని రాసిచ్చారని తెలిపారు. జగన్నాధ రావు ప్రభుత్వానికి భూములను ఇస్తే పుత్రుడు ఆదిత్య లక్ష్మణరావు అదే భూములను అమ్మి అమాయక ప్రజలను మోసం చేశారని ఆధారాలతో సహా చూపించారు.
అదేవిధంగా చాలామంది ప్రజలు ఆదిత్య లక్ష్మణరావు నమ్మి మోసపోయారని చెప్పారు. వీళ్లంతా ఇప్పుడు కోర్టుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వందేళ్ల క్రితం రాజులు 100 పిట్ల రోడ్డును ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి బస్ డిపో వరకు చేశారని కాలం మారే కొద్ది కొందరు ఆక్రమణకు గురి చేసి ఇల్లు కట్టారని గత ఎన్నికల్ల సమయంలో వాటిని కూల్చి రోడ్ హద్దు పెంచనానని మాజీమంత్రి చెప్పారు. ఇళ్లను కూల్చినందుకు బాధితులు నాకు ఓటు వేయలేదని చెప్పారు.
అయినా నాకు కావాల్సింది అభివృద్ధి అని జూపల్లి చెప్పారు. పట్టణంలో రాజ బావి నుండి ప్రజలకు ప్రమాదం ఉందని అప్పట్లో ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వ డబ్బులు ఇచ్చి ఆ బావిని మూయించానని జూపల్లి చెప్పారు. మూయించిన బావి పై ప్లాట్లు వేసి ఆదిత్య లక్ష్మణరావు అమ్ము కోవడానికి కక్కుర్తి పడ్డారని నిరూపించారు. ఆ స్థలాన్ని కోర్టు ద్వారా కాపాడానని జూపల్లి చెప్పారు. పీజీ,డిగ్రీ కాలేజీల నిర్మాణాల కోసం భూములను రిజిస్ట్రేషన్ చేయించి డిగ్రీ కాలేజీ నిర్మించానని మాజీమంత్రి చెప్పారు.
ఆనాడు ఆదిత్య లక్ష్మణరావు జఫర్ మైదానంలోని పది ఎకరాల భూమిని అమ్ముకోడానికి ప్రయత్నిస్తే కోర్టును ఆశ్రయించి ఆ పది ఎకరాల స్థలాన్ని కాపాడి మినీ స్టేడియం నిర్మించానని జూపల్లి తెలిపారు. ఈరోజు నాకెందుకులే అని నేను అనుకుంటే ఈరోజు మినీ స్టేడియం నిర్మాణం జరిగేదా? ఉండేదా?అని జూపల్లి ప్రజలను ప్రశ్నించారు. ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతానని అంతేగాని ఎవరి పై కక్ష సాధింపులు వ్యక్తిగతంగా విమర్శలు చేయనని చెప్పారు. తల్లిదండ్రుల స్మశానవాటిక భూములను అమ్ముకున్న ఘనత కూడా ఆయన దేనని జూపల్లి చెప్పారు.
రాజ బంగ్లా ప్రహరి స్థలం కోర్టులో ఉందని, దానికి ఇక్కడ ఉన్న అధికారులు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. అందుకే మున్సిపల్ శాఖ అధికారులు వీటిపై విచారణ చేపట్టారని దానికి సంబంధించిన పత్రాలు అన్నీ తనవద్ద ఉన్నాయని చెప్పారు. కోర్టు లో ఉన్న స్థలాలు ఎలా నిర్మాణం చేసుకోవడం ఎలా అనుమతిస్తారని పురపాలక అధికారికి రాష్ట్ర అధికారి విచారణ చేయిస్తున్నారని అందుకే నిర్మాణ పనులు చేశారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేసిన ఆదిత్య లక్ష్మణ్ రావు పై 10 కోట్ల పరువు నష్టం కేసు వేస్తున్నట్లు చెప్పారు.
అంతకుముందు తాలూకా ప్రచార కార్యదర్శి పసుపుల నరసింహ్మ మాట్లాడారు. హైదరాబాద్ లోని ఒక హోటల్లో ప్రజాప్రతినిధులు పురపాలక అధికారితో అధికారిపై ఒత్తిడి తెచ్చి అనుమతులు ఇప్పించారని ఆరోపించారు.
కార్యక్రమంలో మాజీ జేటిపిటిసి హనుమంతు నాయక్ కేతపల్లి రవి కోడూరు మండల ఎంపిపి కొండ రాధ పెద్దకొత్తపల్లి జడ్పిటిసి సూర్య ప్రతాప్ గౌడ్ టిఆర్ఎస్వి నాయకులు నరసింహారావు మాజీ ఎంపీపీ చిన్న నిరంజన్ రావు మాజీ మార్కెట్ చైర్మన్ రామచంద్రారెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు రఘుపతి రావు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎగ్బాల్, కేతూరి ధర్మ తేజ,గుర్రం కొండ రమేష్,మేకల కిషోర్ యాదవ్,బోరెల్లి మహేష్,పసుల వెంకటేష్,జి శేఖర్,ప్రిన్స్ బాబా, తదితరులు పాల్గొన్నారు.