ఉత్తర అమెరికాలో ఏర్పడ్డ ఒక గ్రూప్ ఇప్పుడు ప్రపంచ ముస్లిం దేశాలకు పీడకలలాగా పరిణమించింది. ఉత్తర అమెరికా మాజీ ముస్లింలు (ఎక్స్ ముస్లిమ్స్ ఆఫ్ నార్త్ అమెరికా- ఇఎక్స్ఎంఎన్ఏ) పేరుతో ఈ గ్రూప్ చేస్తున్న ప్రచారం ముస్లిం మత ఛాందసవాదులకు కంటిలో నలుసులాగా తయారైంది. ముస్లిం మతాన్ని వదిలివేసిన వారితో ఈ గ్రూపు నిండి ఉంటుంది. ఈ గ్రూప్ పై ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ ఒక కన్నేసి ఉంచాయి.
ఎక్స్ ముస్లిమ్స్ గ్రూప్ ‘ఆసమ్ విత్ అవుట్ అల్లా’ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉంది. అల్లా పేరు లేకుండా తాము ఎంతో ఆనందంగా ఉన్నామని అర్ధం వచ్చే విధంగా ఉన్న ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్నది. లక్షలాది మంది ముస్లింలు తాము ముస్లిం మతాన్ని వదిలివేస్తున్నామని ప్రకటిస్తున్నారు. అమెరికా, మెక్సికో, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ తదితర దేశాలలో తాజాగా ఎక్స్ ముస్లిమ్స్ గ్రూప్ చాలా యాక్టీవ్ గా ఉంది. ముస్లింగా ఉండటం వల్ల తాము ప్రపంచ దేశాల దృష్టిలో ఉగ్రవాదులుగా మిలిగిపోతున్నామని, తమను అందరూ అనుమానంతో చూస్తున్నారని ఈ గ్రూప్ లోని వారు చెబుతున్నారు.
ఈ అవమాన భారాన్ని దించుకోవడానికి తాము ఇస్లాం ను వదిలేస్తున్నట్లు వీరు చెబుతున్నారు. ఈ తతంగం నాలుగు గోడల మధ్య కాకుండా పబ్లిక్ లో ఈ గ్రూప్ ద్వారా చేయడం వల్ల మరి కొందరికి స్ఫూర్తిని ఇచ్చినట్లు అవుతుందనే ఉద్దేశ్యంతో తాము ఈ గ్రూప్ ప్రారంభించామని వారు చెబుతున్నారు. ఇక ఈ గ్రూప్ లోకి మహిళల ప్రవేశం ఎక్కువగా ఉంది. ఇస్లాం మతాన్ని అనుసరించడం వల్ల తమ స్వేచ్ఛ పోతున్నదని అందువల్ల తాము ఇస్లాం ను వదిలేస్తున్నామని వారు అంటున్నారు.
కొందరు మహిళలు బుర్ఖాను వదిలేసి బికినీ లాంటి పొట్టి దుస్తులతో ఫొటోలు దిగి ఈ గ్రూప్ లో పంచుకుంటున్నారు. తాము స్వేచ్ఛ పొందామని వారు ట్యాగ్ లైన్ పెడుతున్నారు. ఈ గ్రూప్ పై ముస్లిం దేశాలు మండిపడుతున్నాయి. పాకిస్తాన్ అయితే ఈ గ్రూప్ ను తమ దేశంలో నిషేధించినట్లు తెలిపింది. అంతే కాకుండా ఈ గ్రూప్ పోస్టింగులు తమ దేశం వారు చూడకుండా ఏర్పాట్లు చేస్తున్నది. ఒక మాజీ ముస్లిం యువకుడు ఈ గ్రూప్ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో పోస్టింగ్ పెట్టగానే ఈ వ్యాఖ్యలు తమ దేశ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని అందువల్ల ట్విట్టర్ లోని ఆ వ్యాఖ్యను తొలగిస్తున్నామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఇఎక్స్ఎంఎన్ఏ సంస్థ కెనాడాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. లాభాపేక్ష లేని సంస్థగా ఇది ప్రారంభం అయింది. ఆన్ లైన్ క్యాంపెయిన్ తో బాటు ఆఫ్ లైన్ క్యాంపెయిన్ కూడా తాము చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఇస్లామ్ మతాన్ని వీడుతున్న వారికి రక్షణ కల్పించడం కూడా తమ ముఖ్య ఉద్దేశ్యమని కూడా వారు చెబుతున్నారు. మతానికి నిరసన వ్యక్తం చేయడం అనే హక్కు ఉండాలని ఈ గ్రూప్ భావిస్తున్నది. 2012 లో మహ్మద్ సయీద్ అనే మానవహక్కుల కార్యకర్త ఈ గ్రూప్ ను ప్రారంభించాడు.
ఇది సెక్యులరిజాన్ని పెంచేందుకు ఉపకరిస్తుందని ఆయన భావిస్తున్నారు. ముస్లింలకు సంబంధించిన షరియా (ఇస్లాం చట్టం) ఉత్తర అమెరికాలోని చాలా దేశాలలో అధికారికంగా అమలు చేయకపోయినా కూడా చాలా మంది ముస్లింలు ఈ చట్టం అనుసరించడం తమ ధర్మంగా భావిస్తున్నారు. అయితే కొత్త తరం దీన్ని వ్యతిరేకిస్తున్నది. చట్టం కాని దాన్ని ఎందుకు అనుసరించాలని వారు ప్రశ్నిస్తున్నారు. పర్యవసానంగా ఇలాంటి గ్రూపులు పుట్టుకువస్తున్నాయి. కొసమెరుపు ఏమిటంటే ఈ గ్రూపు ఇంత పెద్ద ఎత్తున యాక్టివిటీ చేస్తున్నా కూడా టైమ్స్ నౌ, రిపబ్లిక్ టివి, ఏబిపి న్యూస్, ఇండియా టివి, ఎన్ డి టివి లకు తెలియదా అంటూ మరొక వ్యక్తి ట్విట్ చేశాడు.