ప్రతి రాజకీయ పార్టీకి స్పష్టమైన సిద్ధాంతం ఉంటుంది. కొందరు పేదరిక నిర్మూలన, మరి కొందరు సామాజిక న్యాయం, ఇంకొందరు అభివృద్ది మంత్రం…కొందరు సంక్షేమ రాజ్యం అని పని చేస్తారు. ఆయా లక్ష్యాలకు అనుగుణంగా పాలన సాగిస్తారు. దేశంలో ఏ రాజకీయ పార్టీని చూసినా ఏదో ఒక మూల సిద్ధాంతం ఉంటుంది. అలాగే వైసీపీకి ఒక మూల సిద్దాంతం ఉంది. పార్టీ ఆవిర్భావం సందర్భంగా వైఎస్ జగన్ ఒక రాజకీయ సిద్దాంతం పార్టీ రాజ్యాంగంలో రాసి పెట్టారు. అదే ఫేక్ రాజకీయం, తప్పుడు ప్రచారం, ప్రత్యర్ధి పక్షాలపై బురద వేయడం.
అదేంటో…ఎలాగో చూద్దాం. 2019 ఎన్నికల ముందు నాటి తెలుగుదేశం ప్రభుత్వంపై జగన్ పతాక స్థాయిలో విషప్రచారం చేశారు. సొంత మీడియా, సోషల్ మీడియా, మేధావుల ముసుగులో కొందరు పేటిఎంలను పెట్టుకుని లేనిపోని కథలు అల్లాడు. 2014లో అప్పుడప్పుడే ప్రజలు రుచి చూస్తున్న సోషల్ మీడియా ద్వారా అత్యంత విష పూరిత రాజకీయం చేశారు. చంద్రబాబు నాయుడు తాగే వాటర్ బాటిల్ ధర రూ.10 వేలు అని ప్రచారం చేశారు. పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని తప్పుడు ప్రచారం చేశారు.
ముఖ్యంగా నాటి ప్రభుత్వంపై కులముద్ర వేయడానికి డీఎస్పీల అంశాన్ని తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చిన వారిలో 36 మంది కమ్మ సామాజికవర్గం వాళ్లే అని ఆరోపించాడు. డిల్లీ వెళ్లి జగన్ నాడు చేసిన ఈ ప్రచారం తప్పు అని చెప్పే లోపే లోకం అంతా తిరిగేసింది. వాస్తవం అందుకు 100 శాతం భిన్నంగా ఉన్నా…వైసీపీ దీన్ని నిజమనేలా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. నాడు ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత రావడానికి ఇదీ ఒక కారణం అయితే వాస్తవం మాత్రం అందుకు పూర్తి భిన్నం అని ఎప్పటికో గాని తెలియలేదు.
ఇప్పుడు మళ్లీ అదే 36 నెంబర్ ను పట్టుకుని జగన్ మళ్లీ ఢిల్లీ వెళ్లాడు. 40 రోజుల పాలనలో 36 రాజకీయ హత్యలు అంటూ నిరసనకు కూర్చున్నాడు. అయితే జగన్ అండ్ బ్యాచ్ చేస్తున్న ఈ ప్రచారం కూడా విష పూరితం. ఎందుకంటే 40 రోజుల కూటమి పాలనలో రాజకీయ ప్రమేయంతో జరిగిన హత్యలు 4 ఉండగా…ఇందులో 3 ఘటనల్లో బాధితులు టీడీపీ కార్యకర్తలే.
అయితే జగన్ తన మూల సిద్ధాంతమైన ఫేక్ రాజకీయంతో 36 రాజకీయ హత్యలు అంటూ ఆ వివరాలు చెప్పకుండా…..చనిపోయిన వారి పేర్లు చెప్పకుండా, లిస్టు ప్రకటించకుండా చెలరేగిపోతున్నాడు. నిజంగా 36 మంది కార్యకర్తలు చనిపోయి ఉంటే వారు ఎవరు…ఏయే గ్రామాలకు చెందిన వాళ్లు… వైసీపీతో వారికున్న సంబంధాలు ఏంటి….ఎన్ని ఘటనల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు స్పందించారు.
చనిపోయారని చెపుతున్న కార్యకర్తల కుటుంబాల వద్దకు ఎంతమంది వైసీపీ నేతలు విజిట్ చేశారు అనే వివరాలు మాత్రం వైసీపీ ఎక్కడా చెప్పడం లేదు. దమ్ముంటే ఆ 36 మంది కార్యకర్తల లిస్టును వైసీపీ రిలీజ్ చేయాలి అని ప్రభుత్వం అడుగుతోంది….కానీ జగన్ ఆ పనిచేయలేడు. ఎందుకంటే ఆ లిస్ట్ ఇస్తే అవన్నీ ఫేక్ అని తేలిపోతాయి. దీంతో జగన్ తనదైన దిక్కుమాలిన తెలివి తేటలతో తనకు ఎప్పుడో కలిసి వచ్చిన 36 నెంబర్ ను మళ్లీ వాడుతూ డిల్లీ వెళ్లారు. జగన్ అంటే ఏంటో తెలియక 2019లో ఆయనకు ప్రజలు 151 సీట్లు ఇచ్చారు.
5 ఏళ్లలో జగన్ అంటే ఏంటో తెలుసుకుని ప్రజలు ఆయనకు 2024లో 11 సీట్లు ఇచ్చారు. అలాగే చంద్రబాబు ఏంటో అర్ధం చేసుకుని కూటమికి 164 సీట్లు ఇచ్చారు. జగన్ రాద్దాంతం వెనుక ఫేక్ రాజకీయం అనే జగన్ రాజకీయ మూల సిద్దాంతం ఉందని ప్రజలకు కూడా అర్థం అవుతోంది. అందుకే ఇటు గల్లీ నుంచి అటు ఢిల్లీ వరకు ఎంత ఖర్చు పెట్టినా…ఎన్ని పల్టీలు కొట్టినా ఆయన తప్పుడు లక్ష్యం ఫలితాన్ని ఇవ్వడం లేదు.
మొన్న నారా లోకేష్ అన్నట్లు….జగన్ ఇంకా భ్రమల్లో ఉన్నారు. అతని మాటల్లో అధికారం దూరం అయ్యిందనే బాధ కనిపిస్తోంది. అక్రమార్జన ఆగిపోయిందనే ఆవేదన కనిపిస్తోంది. ఫేక్ రాజకీయం పండడం లేదనే ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. ఉనికి చాటుకోలేకపోతున్నామనే నిస్పృహ కనిపిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉక్రోషం జగన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే పాముకు తలలోనే విషం…. జగన్ కు నిలువెల్లా విషం అని గుర్తుపెట్టుకోవాలి.