37.2 C
Hyderabad
March 29, 2024 18: 26 PM
Slider సంపాదకీయం

అవినీతిపరుల ‘సత్య ప్రమాణం’ రాజకీయాలు

#God

రాజకీయాలలో ఒక కొత్త దరిద్రపు ట్రెండు మొదలైంది. ‘‘దేవుడిపై ప్రమాణం’’ చెయ్యడం. ఈ అవినీతి రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దేవుడిని మధ్యలోకి లాగడం ఏమిటి?

దేవుడు ఏమీ చెయ్యలేడు అనే ధీమాతోనే ఈ అవినీతిపరులు వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఎవడి పాపాన వాడు పోతాడు అనే కర్మసిద్ధాంతాన్ని నమ్మిన వాళ్లు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో దేవుడిపై ఉన్న పవిత్ర భావాన్ని ఈ అవినీతి రాజకీయ నాయకులు పోగొడుతున్నారు.

మత రాజకీయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ దరిద్రపు ట్రెండ్ ను కట్టడం చేయాల్సిన అవసరం ఉంది. దేవుడి గుడిలోకి, మసీదులోకి, చర్చిలోకి కెమెరామెన్ లేకుండా వెళ్లని ఈ రాజకీయ నాయకులకు దేవుడిపై భక్తి ఉందా?

ఎమ్మెల్యేలు, ఎంపిలు నిజాయితీగా ఉంటున్నారా?

ఎవరు అధికారంలో ఉంటే వారు కోట్లు దోచుకుంటున్నారనేది రుజువులు లేని సత్యం. సంబంధిత నియోజకవర్గంలో పని చేస్తే కాంట్రాక్టర్ నుంచి కమిషన్ తీసుకోని వాడు ఒక్కడైనా ఉన్నాడా? గ్రామాల్లో సర్పంచ్ లు కొంత మేరకు నిజాయితీగా ఉంటారు కానీ ఎమ్మెల్యేలు, ఎంపిలు నిజాయితీగా ఉంటున్నారా?

ఎమ్మెల్యేలు, ఎంపిలు అంటే మాజీ లు కూడా. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రాజకీయాలలోకి వస్తున్న ఈ నకిలీ నాయకులు మళ్లీ సంపాదించుకోవడానికే కదా వస్తున్నది? ఇసుక నుంచి అన్నీ అమ్ముకునే ఈ రాజకీయ నాయకులే దేశానికి పట్టిన దరిద్రం అనుకుంటుంటే ఇప్పుడు దేవుడిపై ప్రమాణాల పేరుతో హిందూ ధర్మాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు.

గుడి మీదో, దేవుడి విగ్రహం మీదో, రధం మీదో దాడి జరిగినప్పుడు కాదు….. హిందూ సంస్థలు ఇప్పుడు జరుగుతున్న ప్రమాణాల ప్రహసనాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవినీతి పరుల మాటలతో, చేష్టలతో క్రమంగా దేవుడిపై నమ్మకం కూడా పోతున్నది.

అలా జరగాలనే ఈ కుట్ర. ఇది మతంపైనా, మత నమ్మకాలపైనా జరుగుతున్న కుట్ర. దేవుడు అనే భావన పై జరుగుతున్న దాడి. (దేవుడు అనే భావన లేకపోతే ఏమిటి నష్టం అనే నాస్తికుల గురించి తర్వాత మాట్లాడుకుందాం) హిందూ సమాజం నమ్మికపై ఆధారపడి ఉంది. ఇతను నీ తండ్రి అని తల్లి చెబితే నమ్మడం నుంచి ఈ నమ్మిక ప్రారంభం అవుతుంది.

దైనందిన జీవితంలో ఎవరైనా తప్పు చేస్తారేమోనని ముందు జాగ్రత్తగా దేవుడు అనే బ్రహ్మ పదార్ధాన్ని మన పెద్దలు సృష్టించారు. దేవుడు అనే భావన ఉన్నంత వరకూ సమాజంలో తప్పుడు పనులపై కొంత మేరకు కట్టడి ఉంటుంది. ఇదంతా నమ్మని రాజకీయ నాయకులు దేవుడిపై ప్రమాణం పేరుతో కొత్త రాజకీయాలకు తెరతీస్తున్నారు.

 అన్యమతస్తులకు ఇది ఒక ప్రహసనంలా కనిపిస్తుంటుంది. ‘‘వాడూ తిన్నాడూ వీడూ తిన్నాడు అయినా దేవుడు ఏమీ చేయలేకపోయాడు’’ అంటూ అన్యమతస్తులు ప్రచారం చేసుకోవడానికి వీలుకల్పిస్తున్న ఈ నకిలీ నాయకులను సమాజం బహిష్కరించాలి.

ఈ ట్రెండ్ ను కట్టడి చేయకపోతే ‘‘హిందువుల దేవుళ్లు’’ రోడ్డుపైకి వచ్చేస్తారు. వారి పరువు గంగలో కలిసిపోతుంది. అదేమిటో పోలీసులకు వేరే పని ఏమీ లేనట్లు ఇలా ప్రమాణాల సవాళ్లు చేసుకునేవారికి భద్రత కల్పించడం ఏమిటి? రాజకీయ కారణాలతో ఎందరినో వేధిస్తున్న పోలీసులు ఇంత ఉదారంగా ఎందుకు మారిపోతున్నారు?

మీడియా ఇలాంటి వాటికి ఎందుకు ప్రచారం కల్పిస్తున్నది? దయచేసి మీడియా తక్షణమే ఇలాంటి చౌకబారు రాజకీయ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లకు ప్రచారం కల్పించడం మానేయాలి. దేవుడిపై నమ్మకం పోగొట్టే ఈ నకిలీ రాజకీయ నాయకులకు ప్రచారం కల్పించవద్దు.

ఈ దరిద్రపు ట్రెండ్ కు మీడియా అయినా ఫుల్ స్టాప్ పెట్టాలి.

(ప్రమాణాలు చేసుకుంటున్న అవినీతి రాజకీయ నాయకుల పేర్లు ఊళ్లు కావాలనే రాయడం లేదు)

Related posts

పిచ్చికుక్కల దాడిలో చావుబతుకుల్లో బాలుడు

Satyam NEWS

తబ్లిగీ చీఫ్ సాద్ ఫామ్ హౌస్ లో పోలీసు సోదాలు

Satyam NEWS

జ‌న‌వ‌రి 19 వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

Satyam NEWS

Leave a Comment