ఎందుకో తెలియదు కానీ గత నాలుగైదు రోజులుగా ఎంపిక చేసుకున్న మీడియాలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వ్యతిరేక ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పెట్టుబడులు పెట్టినట్లు జనం చెప్పుకునే పత్రికలలో ఈటల రాజేందర్ పై విషం కక్కుతున్నారు. సహజంగానే సున్నతి మనస్కుడైన ఈటల తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో హార్ధికంగా, ఆర్ధికంగా కూడా పని చేసి సహాయం చేసిన వ్యక్తి ఈటల. ఆ విషయం అందరికి తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో మందిని కూడగట్టడం నుంచి ఆర్ధికంగా సాయం చేయడం వరకూ ఆయన వెనకడుగు వేయలేదు.
టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత ఇష్టమైన నాయకుడు గా కూడా ఈటల పేరు పొందారు. అయితే అకస్మాత్తుగా సంతోష్ కుమార్ కు చెందిన పత్రికలలో ఈటల పై దారుణమైన వ్యతిరేక వార్తలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కేసీఆరే స్వయంగా ఈటల కు మంత్రి పదవి నుంచి ఉద్వాసన చెప్పేందుకు ఈ విధంగా వార్తలు రాయించారని చాలా మంది అర్ధం చేసుకున్నారు. అయితే మంత్రి పదవి నుంచి తీసేయాలనుకుంటే కేసీఆర్ ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదనేది అందరికి తెలిసిందే. ఈటలకు మంత్రి పదవి తీసేయాలనుకుంటే కేసీఆర్ ఒక్క క్షణంలో నిర్ణయం తీసుకోగలరు.
ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించేందుకు ఎవరూ కూడా సాహసించరు. పార్టీ పైనా ప్రభుత్వం పైనా పూర్తి స్థాయిలో పట్టు ఉన్న నాయకుడు కేసీఆర్. మరి ఈ పత్రికలలో వార్తలు ఎందుకు వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎవరు రాయించారు? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. కేసీఆర్ కు తెలియకుండా ఈటలకు వ్యతిరేకంగా వార్తలు రాయించాల్సిన అవసరం కూడా సంతోష్ కుమార్ కు లేదు. ఇలాంటి అనుమానాలు రాజకీయపరిశీలకులకే కాదు రాజేందర్ కూడా వస్తున్నాయి. అందుకోసమే ఆయన ఈ ప్రచారానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. అనుమానలతో రాజకీయం చేయలేరు. ఈ విషయంలో ఎంతో ఆచితూచి ఈటల రాజేందర్ వ్యవహరించారు.
అయితే ఆయన సహనానికి పరీక్షపెడుతున్నట్లుగా పదే పదే వార్తలు రావడం ఆరంభమైంది. సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కాలంలో ఈటల వ్యతిరేక వార్తలు పెరిగిపోయాయి. రెండు చిన్న స్థాయి పత్రికలలో సంతోష్ కుమార్ రాయించినట్లు భావిస్తున్న వార్తలు రావడంతో స్వామి భక్తులు మరింత రెచ్చిపోతున్నారు. ఈటల ను మంత్రి పదవి నుంచి తీసేస్తున్నారని అనుకుంటున్న వారు మరింత విజృభించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అన్నింటిని నిశితంగా గమనిస్తున్న ఈటల రాజేందర్ ఇలాంటి వాటికి స్పందించవద్దని ట్విట్టర్ లో టిఆర్ఎస్ కార్యకర్తల్ని కోరారు. తాను తన తరపు నుంచి వచ్చే వార్తలను ఆపగలడుకానీ ప్రత్యర్ధుల నుంచి వచ్చే పోస్టింగులను ఈటెల ఆపలేడు కదా? అదే జరుగుతున్నది.
ఈటల వ్యక్తిగత విషయాలపై కూడా సోషల్ మీడియాలో వస్తుడటంతో అసలే అనుమానంలో ఉన్న ఈటల లో ఆక్రోశం కట్టలు తెంచుకున్నది. తెలంగాణ జెండా మోసిన తనపై ఇలాంటి ప్రచారం జరగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈటల మాట్లాడిన మాటలు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం వాస్తవం. దీన్ని సరిదిద్దుకోవడానికి పార్టీ పెద్దలే నడుం కట్టాల్సి వచ్చింది. ఈటల పై వ్యతిరేక ప్రచారంలో కులం విషయం కూడా ప్రస్తావనకు వస్తున్నది. ఏకతాటిపై నడిచే పార్టీలో ఇలాంటి వివాదాలు చెలరేగడం మంచిది కాదు. ఈటల లాంటి నాయకుడిని కాదనుకోవడం కూడా టిఆర్ఎస్ పార్టీకి మంచిది కాదు.
ఈటల ను మస్థాపానికి గురి చేసిన వార్తలను ఎవరు రాయిస్తున్నారో ముఖ్యమంత్రికి తెలియకుండా పోవడానికి ఆస్కారం లేదు. అందువల్ల ముందుగా ఒక మంత్రిని కించ పరుస్తూ వార్తలు రాయిస్తున్న వ్యక్తులను కట్టడి చేయాలి. అలా తప్పుడు విషయాలు ప్రచారం చేయకుండా ఆపడం చాలా సులభమైన విషయం కూడా.
ఆ చర్యలు తీసుకోకుండా సమస్యను ఇలాగే వదిలేస్తే ఈ వివాదం పెను రాజకీయ మార్పులకు దారి తీసే అవకాశం ఉంది… ఇప్పుడు కాకపోయినా తర్వాతి రోజుల్లో..