రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఖరీఫ్ సీజను- 2019-20 లో వరి, పత్తి కొనుగోలుపై జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ సంపత్ రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎంపీపీలు, జెడ్పిటిసి సభ్యులు అధికారులు పాల్గొన్నారు. పంటల కొనుగోలులో రైతు సమన్వయ సమితి బాధ్యులు కీలకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, గన్ని బ్యాగుల సరఫరా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. అదే విధంగా పంటల ఉత్పత్తుల కొనుగోలు పూర్తి కాగానే గడువు లోపు రైతులకు డబ్బులు చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. కొనుగోలు సమయంలో వర్షాలు కురిస్తే ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చెయ్యాలని, అవసరమైన టార్పాలిన్లను సమకూర్చుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి నీటివిడుదల, చెక్ డ్యాంలు, మిషన్ కాకతీయతో జల వనరులు పెరిగి జనగామ జిల్లా ఈసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అయ్యిందని ఆయన తెలిపారు. తేమ లేకుండా పత్తిని మార్కెట్ కు తీసుకువచ్చేలా రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.