తెలంగాణ రాష్ట్రంలో సంతానలేమి సమస్య తీవ్రంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ తాజా అధ్యయనాల ప్రకారం రాష్ట్రంలో 26 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. సంతానం కోసం ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు. మానసిక క్షోభను అనుభవిస్తున్నారు అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 358 ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. ప్రభుత్వ దవాఖాన్లలో ఫర్టిలిటీ సెంటర్లు, ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని 2017లో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.
గాంధీ, పెట్లబుర్జు, వరంగల్ ఎంజీఎంలో ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు జీవో 520 విడుదల చేశారు. కానీ, సెంటర్ల ఏర్పాటు జరగలేదు. 2023 ఫిబ్రవరిలో మరోసారి జీవో విడుదల చేశారు. డాక్టర్లు, రీఏజెంట్స్, డ్రగ్స్, లేకుండానే 2023 అక్టోబర్‌లో గాంధీలో ఓ సెంటర్ ప్రారంభించారు. అవసరమైన డాక్టర్లు, మందులు లేకపోవడం వల్ల ఒక్కరికి కూడా ఐవీఎఫ్ చేయలేదు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ హాస్పిటల్‌లోని ఐవీఎఫ్ సెంటర్‌లో ఎంబ్రయాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఇతర డాక్టర్లను నియమించాం. అవసరమైన అన్ని రీఏజెంట్స్, మెడిసిన్స్ పంపిణీ చేశాం అని మంత్రి తెలిపారు. ఏఆర్టీ యాక్ట్ ప్రకారం అనుమతులు తీసుకొచ్చి, అక్టోబర్ 15వ తేదీన గాంధీలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. పేట్లబుర్జు హాస్పిటల్‌లోనూ ఎంబ్రయాలజిస్ట్‌ను నియమించాం.
అవసరమైన రీఏజెంట్స్ అందజేసి, అక్కడకూడా ఐవీఎఫ్ సేవలను ఈ నెల 9 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినం. ఫాలిక్యులర్ స్టడీ, ఐయూఐ, ఐవీఎఫ్ వంటి అన్ని సేవలు అందిస్తున్నాం. వరంగల్ ఎంజీఎంలోనూ ఐవీఎఫ్ సెంటర్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. సమస్య తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఐవీఎఫ్ సేవలను విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. హైదరాబాద్‌లో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అని మంత్రి చెప్పారు.