తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రేపు (శనివారం)ఫ్లెమింగో ఫెస్టివల్ – 2025 ప్రారంభం కానున్నది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ ఈ ఫెస్టింల్ ను ప్రారంభించబోతున్నారు. పులికాట్ సరస్సు, నేలపట్టు బర్డ్ శాంక్చుయరీ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా జనవరి 18,19,20 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ – 2025 నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఫ్లెమింగో ఫెస్టివల్ – 2025 లో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
ఫ్లెమింగో ఫెస్టివల్ – 2025ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.. దిస్టేట్ టూరిజం క్యాలెండర్స్ ఆఫ్ ఫెస్టివల్స్ జాబితాలో ఫ్లెమింగో ఫెస్టివల్ ని చేర్చింది. పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యంను అంతర్జాతీయ పర్యావరణ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఇప్పటికే విస్తృత ప్రచారం నిర్వహించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ – 2025 సందర్భంగా నేలపట్టు, ఆటకానితిప్ప, సూళ్లూరుపేట, బి.వి.పాలెం, శ్రీసిటీలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎకో టూరిజంను ప్రోత్సహించడంతో పాటు సాంస్కృతిక, పర్యావరణ వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసేందుకు, పర్యావరణ పరిరక్షణపై అవగాహనను పెంచేందుకు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు.