మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్న వాడూ.. మచ్చుకైనా లేదు చూడూ.. మానవత్వం అన్నది నేడు.. అన్న అందెశ్రీ మాటలు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి.. మానవత్వానికే మచ్చ తెచ్చే ఈ ఘటనతో సభ్య సమాజమే తలదించుకోవాలేమో.. కులాల కట్టుబాట్లు చేరిగిపోయాయి..మత వివక్ష లేదు.. అందరం ఒక్కటే అని నాయకులు, అధికారులు ప్రసంగాల్లో ఊదరగొడుతున్నా.. అదంతా ఉత్తదే అన్నది వాస్తవమే అన్న సంఘటనలు అనునిత్యం ఎక్కడో ఓ చోట బయటపడుతూనే ఉన్నాయి. అమ్మకడుపులో 9నెలలు హాయిగా ఉన్న ఆ చిన్నారికి బయట ప్రపంచం గూర్చి ఏం తెలుసు..? ఇక్కడ మానవ మృగాలు కులరక్కసి అనే మహమ్మారితో మునిగిపోయారని..?
అమ్మకడుపు వదిలితే అన్నీ కష్టాలు, కడగండ్లు తప్పా ఎక్కడా స్వేచ్ఛ లేదని..? చివరకు చావుకు కూడా కులం ఆపాదిస్తారని..? ఆరోగ్యం బాగాలేక చనిపోయిన రోజుల పసికందుకు సైతం కులం ఆపాదించి.. కాటిలో సైతం తమను అంటరాదని పూడ్చిన మృతదేహాన్ని సైతం వెలికితీయించి, ఊరికి దూరంగా పాతిపెట్టించి తమ “వెలితి” బుద్ధిని చాటుకున్నారు కొందరు అగ్రవర్ణాల వారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అమానవీయ ఘటన మెదక్ జిల్లాలోని చిల్పిచేడ్ మండలం అజ్జమర్రి అనే గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాల్మాన్, సైలాన్ దంపతులకు గత నెలలో ఓ చిన్నారి జన్మించింది. పుట్టుకతోనే కాస్త వీక్ గా ఉండడంతో హైదరాబాద్ లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు.
ఆతర్వాత కొద్దిగా కొలుకోవడంతో గ్రామానికి తీసుకువచ్చి ఫరీదా బేగం అని నామకరణం చేశారు. ఇంతలోనే పాప మరోసారి అనారోగ్యం బారిన పడడంతో సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కానీ ఆ చిన్నారి ఫరీదా పుట్టిన 44 రోజులకే ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. కన్నవారి కలల్ని కాటికి పంపింది. ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. అయితే అంత్యక్రియలు చేసేందుకు అజ్జమర్రి గ్రామంలో మైనార్టీలకు ప్రత్యేకంగా ఖబరస్థాన్ లేదు. దీంతో ఎవరి పొలాల్లో వారినే సమాధి చేస్తున్నారు. చనిపోతే సమాధి కూడా చేసేందుకు స్థలం లేని సాల్మన్ తన కూతురును గ్రామంలోని సర్కారీ స్థలంలో సమాధి చేసేందుకు నిర్ణయించారు.
కానీ అక్కడ సమాధి తవ్వెందుకు ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రాలేదు. స్వయంగా సాల్మన్ బంధువులే సర్కారీ స్థలంలో సమాధి తవ్వి చిన్నారి ఫరీదా అంత్యక్రియలు చేశారు. ఫరీదా అంత్యక్రియలు చేసిన స్థలం మీదనే అగ్రవర్ణాలకు చెందిన వారి మృతదేహాలను ఖననం చేస్తుంటారు. దీంతో అగ్రవర్ణాలకు చెందిన ఓ రాజకీయ నాయకుడు, మరికొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని బాధితులు సాల్మాన్ కుటుంబం కన్నీటి పర్యంతం అయ్యింది. సమాధి చేసిన చిన్నారిని అక్కడి నుంచి వెలికితీసి మరోచోట పూడ్చిపెట్టాలని పట్టుబట్టారు. దీనికి ఫరీదా కుటుంబం ఒప్పుకోకపోవడంతో కొందరు గ్రామస్థులను పురికొల్పిన అగ్రవర్ణ నాయకులు.. ఆతెల్లవారు సమాధి చేసిన చోటు నుంచి బలవంతంగా ఆపాప మృతదేహాన్ని తొలగించారు. సాల్మన్ కుటుంబం ఎంత మొరపెట్టుకున్నా ఆగ్రామ పెద్దల మనుసు కరగలేదు.
కాళ్లవేళ్ల పడ్డా కనికరించలేదు. అక్కడి నుంచి వెలికి తీయించి చివరికి గ్రామంలో హరితహారం మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేసిన స్థలంలో ఆచిన్నారిని మరోసారి సమాధి చేశారు. కాటిలోనూ అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతుంది అనడానికి ఈ ఘటనే ప్రభల నిదర్శనమని దళిత, మైనార్టీ, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ స్థలంలో సమాధి చేసినా.. కేవలం తమ కాటికి కింద ఉందనే కారణంతో పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీయించి, మరోచోట పాతి పెట్టించడం పట్ల సర్వత్రా ఆగ్రహజ్వాలలు వ్యక్తం అవుతున్నాయి.
బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, దళిత, మైనార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని హెచ్ ఆర్ సీ దృష్టికి తీసుకువెళ్తామని వారు స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూడడం ఏంటని.? సంబంధిత వ్యక్తులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి కారకులైన వ్యక్తులపై, మత వివక్ష చూపుతున్న గ్రామ పెద్దలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు తప్పవని అన్ని ప్రజాసంఘాలు ముక్తకంఠంతో హెచ్చరించాయి.