27.7 C
Hyderabad
April 19, 2024 23: 13 PM
Slider సంపాదకీయం

మంటలు రేపుతున్న బూతు మాటలు

#kcr

రాజకీయ భాషను మార్చిన మహనీయులుగా ఈ ఇద్దరిని పేర్కొన వచ్చును. దారుణమైన భాషను ఉపయోగించి ప్రత్యర్థులను అత్యంత నీచంగా చిత్రీకరించడంలో ఈ ఇద్దరూ కొత్త తరం నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోడీని రాయలేని భాషలో తిట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రాలో అమ్మాఆలిని తిట్టే వైసీపీ నేతలను మించి పోయారు.

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని ఆ పేరుతో కాకుండా మరొక పేరుతో పిలవడం అక్కడి ప్రజలకు అలవాటైపోయింది. ఆయన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడిని అత్యంత నీచమైన పదజాలంతో తిడుతుంటారు. ఆ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా మంత్రి కొడాలి నాని చంద్రబాబుకే ఆపాదిస్తూ నీచమైన భాషను వాడుతుంటారు.

కొడాలి నానికి తన బూతులతో వస్తున్న ప్రాచుర్యం చూసిన ఇతర వైసీపీ నాయకులు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. తెలంగాణ విషయానికి వస్తే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడే భాషపై అభ్యంతరాలు వస్తుండేవి. అయితే ఆ రికార్డును బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బద్దలు కొట్టారు.

అలాంటిది అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు రెండున్నర గంటల సేపు దేశ ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను, భారతీయ జనతా పార్టీని ఏకధాటిగా అత్యంత నీచమైన భాషలో తిట్టిపోశారు.

రాజకీయంగా తనను విమర్శించే వారిని కుక్కలతో పోల్చిన కేసీఆర్, దేశ ప్రధానిని అసమర్థుడు, తెలివిలేని వాడగా అభివర్ణించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ దేశాలలో అత్యంత శక్తిమంతుడైన నేతగా కీర్తి ప్రతిష్టలు అందుకుంటున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీని ఇంతగా తిట్టడంతో ఒక్క సారిగా కేసీఆర్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యారు.

తనను విమర్శించే వారిని ఆ రెండున్నర గంటలలో దాదాపు 16 సార్లు కుక్కలతో పోల్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను విమర్శించడంలోని ఔచిత్యాన్ని ఎవరూ ప్రశ్నించరు. కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులను తప్పుపట్టడం ఎవరైనా చేయవచ్చు.

బిజెపి భక్తులకు బడ్జెట్ మహా ప్రసాదంలా కనిపిస్తే విపక్షాలకు నిస్సారమైనదిగా కనిపించవచ్చు. అంత మాత్రాన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను, బడ్జెట్ పేరుతో ప్రధానిని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని అంత నీచంగా తిట్టాల్సిన అవసరం ఉన్నదా? రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను రెండో సారి ముఖ్యమంత్రిగా ఎలా ఎన్నుకున్నారో నరేంద్ర మోడీని దేశ ప్రజలు అదే విధంగా రెండో సారి ఎన్నుకున్నారు.

ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాల్సిందే. అంతే కానీ రాజకీయ కారణాలతో, రాజకీయ దురుద్దేశాలతో నీచమైన పదజాలం వాడటం ఎవరికి శోభనివ్వదు. కేవలం బూతులతోనే పదవులు నిలబెట్టుకుంటామనే వారికి చెప్పాల్సిందేమీ లేదు.

ఆంధ్రాలో జగన్ మూఢ భక్తులు, తెలంగాణ లో కేసీఆర్ మూఢ భక్తులు ఉన్నట్లు చాలా రాష్ట్రాలలో మోడీకి కూడా మూఢ భక్తులు ఉన్నారు. తమ నేత వేరేవారిని తిడితే అత్యంత గొప్పగా చెప్పుకోవడం ఈ మూఢ భక్తులకు అలవాటు. అదే విధంగా ప్రత్యర్థి ఏమీ అనకపోయినా దారుణంగా విమర్శించడం కూడా వీరికి అలవాటు.

ఈ మూఢ భక్తి ఆంధ్రప్రదేశ్ లో అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను విమర్శించే స్థాయికి వెళ్లడం కూడా చూశాం… ఇంకా చూస్తూనే ఉన్నాం. ఈ బూతులతో మూఢ భక్తులలో ఆవేశం నింపుదామని అనుకుంటే అంతకు మించిన పొరబాటు ఉండదు. ఒక్క సారి భాష అలవాటు అయిన తర్వాత అందరూ అదే మాట్లాడతారు… ఆంధ్రాలో జరుగుతున్నది అదే.

తెలంగాణ లో అప్పుడో ఇప్పుడో వినిపించే బూతులను రెగ్యులరైజ్ చేసినట్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడరు. పనిలోపనిగా సోషల్ మీడియా పేరుతో జర్నలిస్టులను కూడా కేసీఆర్ తిట్టిపోశారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా ఏం చేస్తుంటుందో బహుశ కేసీఆర్ మర్చిపోయి ఉంటారు.

కేంద్రం ఇచ్చే విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరకు అమ్ముతున్నదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్ది కాలం కిందట ఆరోపించారు. దాంతో నిర్మలా సీతారామన్ వ్యక్తిగత విషయాలను కూడా వెలికి తీసుకువచ్చి వైసీపీ సోషల్ మీడియా అత్యంత నీచంగా ఆమెను విమర్శించింది.

దాంతో ఆమె ఇక నుంచి నేను ఆంధ్రాకు రాను అని చెప్పేశారు. ఆ తర్వాత చాలా కాలానికి విశాఖ పట్నం ప్రాంతంలో ఆమె పర్యటించి వెళ్లారు…. అదే వేరే సందర్భం. ఇప్పటికే రాజకీయాలు కలుషితమయ్యాయి. కాగడా పెట్టి వెతికినా నీతిమంతులు దొరకడం లేదు. అలాంటి భాష కూడా దరిద్రంగా మారిపోతే ఇక ఏ మాత్రం సంస్కారం ఉన్న వారైనా రాజకీయాల గురించి ఇక మాట్లాడరు. దయచేసి రాజకీయ నాయకులు తమ హద్దులు దాటకుండా ఉంటే బాగుంటుంది.

Related posts

సీజనల్ వ్యాధుల నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు

Satyam NEWS

భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి

Satyam NEWS

ఘనంగా మాజీ భారత ప్రధాని పి.వి.నర్సింహారావు జయంతి

Bhavani

Leave a Comment