ప్రముఖ గుండె చికిత్స నిపుణులు, పద్మశ్రీ డా. దాసరి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఈ నెల 19న ఆమ్రాబాద్ మండల కేంద్రంలో ఉచిత గుండె పరీక్షలు, ఆరోగ్య ఆహార సదస్సు కార్యక్రమం నిర్వహించనున్నామని మహబూబ్ నగర్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ధర్మకారి రాంకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో వైద్యులే రోగుల వద్దకు వెళ్ళి వారి ఆరోగ్య స్థితిని తెలుసుకుంటారని ఆయన అన్నారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా ‘ఔట్రీచ్’ కార్యక్రమాన్ని ప్రకృతికి మారుపేరు గా ఉన్న నల్లమల అభయారణ్యం లోని ఆమ్రాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గుండె రోగాల నిర్ధారణ కోసం ఈనెల 19 (ఆదివారం) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆమ్రాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో పరీక్షా శిబిరం, మెరుగైన ఆరోగ్యానికి సిరిధాన్యాల ప్రాముఖ్యతను వివరించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇండో యూఎస్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిపుణులు పాల్గొంటారని ఆయన తెలిపారు. వారు పరీక్షలు నిర్వహించి, సూచనలు ఇస్తారు కాబట్టి ఉమ్మడి ఆమ్రాబాద్ మండల ప్రజలు హాజరై ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.