26.1 C
Hyderabad
May 15, 2021 04: 13 AM
Slider ప్రపంచం

రష్యాతో అనుబంధం మళ్లీ చిగురించే అవకాశం ఉందా….?

#narendramodi

భారత, రష్యా అధినేతలు నరేంద్రమోదీ, పుతిన్ తాజాగా ఫోన్ లో సంభాషించుకున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకునే దిశగా మరింత తరచుగా సమాగమం అవ్వాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి.

2+2 మంత్రుల స్థాయిలో సంభాషణలు త్వరలో ప్రారంభం కానున్నాయి. రెండు దేశాల విదేశాంగ, రక్షణ శాఖల మంత్రులు తరచూ మాట్లాడుకోవడమే ఈ ప్రత్యేక ఏర్పాటు లక్ష్యం. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన సందర్భంగా రష్యా అధినేతకు నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు.

మళ్లీ స్నేహం చిగురిస్తుందా?

అదే సమయంలో, రెండు దేశాల బంధాల పటిష్ఠతకు పధక రచన చేయాలని సంకల్పించుకున్నారు. ఇది మంచి పరిణామమే. గత కొంతకాలం నుంచి భారత్ – రష్యా మధ్య సంబంధాలు అంత సజావుగా లేవు. పెద్దగా శతృత్వం లేకపోయినా, మునుపటి వలె స్నేహబంధం మాత్రం లేదు. బంధాలు దెబ్బతినే వాతావరణం మెల్లగా అలుముకుంటోంది.

ఈ దశలో, తాజా సంభాషణలో తీసుకున్న నిర్ణయం వివేకభరితం. ప్రస్తుతం, కరోనా ప్రభావంతో భారతదేశం గడగడ వణికిపోతోంది. ఎన్నో దేశాల నుంచి మద్దతును కూడగట్టుకోవాల్సిన సందర్భంలో ఉన్నాం. అదృష్టవశాత్తు అమెరికా మొదలు అన్ని దేశాలు భారత్ కు అండగా నిలవడానికి సిద్ధమయ్యాయి.

పరస్పర సహకారం అవసరం

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్- వి వ్యాక్సిన్ ఇప్పుడు మనకు ఎంతో అవసరం.139కోట్ల జనాభాకు సరిపడా వ్యాక్సిన్లు అందజేయడం మన ముందున్న పెద్ద సవాల్. ఫైజర్ వంటి విదేశీ వ్యాక్సిన్లు కూడా త్వరలో మన దగ్గరకు రానున్నాయి. దేశ ఆరోగ్యాన్ని, ఉనికిని, ప్రగతిని, రక్షణను మరింతగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన గడ్డు పరిస్థితిలో భారత్ ఉంది.

మొదటి నుంచీ,రక్షణ రంగంలో రష్యాపై మనం ఎక్కువగా ఆధారపడ్డాం. ఇప్పటికీ  కొనుగోళ్లు సాగుతూనే ఉన్నాయి. ఒప్పందాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం, ఆర్ధికపరంగా రష్యా కంటే భారత్ మెరుగ్గా ఉంది. కానీ, కొన్ని రంగాల్లో మనం ఆ దేశం కంటే వెనుకబడే ఉన్నాం.

రోదసి, పునరుత్పాదన ఇంధనం,హైడ్రోజన్ రంగాల్లో రష్యా సహకారం మనకు అవసరం. ఈ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని తాజాగా రెండు దేశాలు నిర్ణయానికి రావడం మంచి పరిణామామే.గగన్ యాన్ లో పాల్గొనే భారత వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇస్తోంది.ఇవన్నీ మంచి విషయాలే ఐనప్పటికీ, భారత్ స్వయంసమృద్ధి సాధించడం అత్యంత అవసరం.

మనం మనంగా ఎదగడం పైనే మన విదేశీ సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే అనేక రంగాలకు సంబంధించి అమెరికా, చైనా, రష్యా మొదలైన దేశాలపై మనం ఆధారపడాల్సి వస్తోంది. దాని వల్ల, ఆ దేశాల ముందు మనం చులకనై పోతున్నాం.

ఇవన్నీ అవసరంతో కూడిన,అవకాశవాద, ఆర్ధిక సంబంధాలే తప్ప, పారదర్శకత, ప్రేమతత్త్వం, ఉదార స్వభావం లేవు. అందుకే, ఏ రెండు దేశాల మధ్య శాశ్వతమైన బంధాలు ఏర్పడడం లేదు. రాజనీతి ఎలా ఉన్నా, దానికి అతీతమైన మానవ సంబంధాలు కలిగి ఉండడం చాలా ముఖ్యం.

జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచి రాజీవ్ గాంధీ సమయం వరకూ, ముఖ్యంగా సోవియట్ యూనియన్ ఉన్నంత వరకూ రెండు దేశాల మధ్య బంధాలు దృఢంగా ఉన్నాయి.1991లో సోవియట్ యూనియన్ విచ్చిన్నమైంది.రష్యా ప్రత్యేక రాజ్యంగా ఏర్పడింది.

అప్పటి నుంచి బంధాల్లో మార్పులు వచ్చాయి.1991లో పీవీ నరసింహారావు అధికారంలోకి వచ్చారు.చైనా ఎదుగుదల కూడా పెరుగుతోంది. చైనా – భారత్ బంధాలు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. రష్యాతో బంధాలను కాపాడుకుంటూనే, అమెరికాతో బంధాలను పెంచుకోవాల్సిన వ్యూహాత్మక పరిస్థితి మనకు వచ్చింది.

అమెరికాకు దగ్గరగా… రష్యాకు దూరంగా…

ఆ దశలో,పీవీ నరసింహారావు తన చాణక్యంతో అమెరికాతో బంధాలను బలోపేతం చేశారు. తాజాగా,నరేంద్రమోదీ సమయంలోనూ ఆ బంధాలు మరింత పెరిగాయి. అమెరికాకు మనం దగ్గరయ్యే కొద్దీ – చైనాకు దూరమవుతూ వచ్చాం. అదే సమయంలో, చైనా – రష్యా మధ్య సంబంధాలు బాగా పెరిగాయి.

ఈ పరిణామంతో, చైనా ప్రభావంతో భారత్ – రష్యా మధ్య స్నేహ సంబంధాలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ఉన్న కాలంలో అటు చైనాతో – ఇటు రష్యాతో అమెరికాకు తగాదాలు పెరిగాయి. అమెరికాకు మిత్ర దేశంగా ఉన్న మనపై కూడా ఇవి ప్రభావాన్ని చూపించాయి.

ఈ నేపథ్యంలో, రష్యా – భారత్ బంధాలు సంకటంలో పడ్డాయి. ముందు ముందు ఎటువైపు సాగుతాయో? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అమెరికా – చైనా దేశాల ఆధిపత్య పోరు మనకు నష్టం తెస్తోంది. చైనా వలె, రష్యాకు కూడా సామ్రాజ్య విస్తరణ కాంక్ష  పెరుగుతోంది.

ఉక్రెయిన్ లో పరిణామాలు దీనికి తాజా ఉదాహరణ.ఈ ధోరణి ప్రపంచ దేశాల మధ్య అనారోగ్య వాతావరణాన్ని సృష్టిస్తోంది. దానికి తోడు, చైనా అధిపతి జిన్ పింగ్,రష్యా అధినేత పుతిన్ ఇద్దరూ దూకుడు స్వభావం కలిగినవారు కావడం దురదృష్టకరం.

ఈ తరుణంలో, విదేశీ సంబంధాలను కాపాడుకోవడం, మెరుగు పరచుకోవడం భారత్ కు కత్తి మీద సాము వంటిది. కత్తికి ఎంత పదును పెట్టినా సరిపోదు. మనకంటూ శక్తివంతమైన సొంత ఆయుధాలు ఉండాలి. అవి సమృద్ధిగా లేకపోవడమే మన వైఫల్యం, మన వెనుకుబాటుతనం. స్వాతంత్య్రం వచ్చి,75సంవత్సరాలు పూర్తవుతోంది.

“స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి” అని శ్రీశ్రీ అన్నట్లు, ఆచరణలో అనంతమైన అభివృద్ధి సాధించడం ఎంతో ముఖ్యం. మనకంటే, చైనా దాదాపు పదేళ్లు ముందు ప్రగతి ప్రయాణం ప్రారంభించింది. అంతటితో ఆగక, మనకంటే ఎన్నో రెట్లు అభివృద్ధిని గడించింది.

ఈ రేసులో మనం వెనుకబడిపోయాం.  అగ్రరాజ్యంగా తన ఆధిపత్యాన్ని కాపాడుకోడానికి అమెరికా తనవంతు కృషి చేస్తూనే వుంది. చైనా అండతో మరింతగా ఎదగాలని రష్యా చూస్తోంది. వీటన్నిటిని చూస్తూ, భారతదేశం ప్రేక్షక పాత్ర పోషించకుండా, తన అడుగులను మరింత వ్యూహాత్మకంగా,బలంగా వేయాల్సిన అవసరం వుంది.

మొత్తం ఈ వ్యవహారంలో, రష్యా స్థానం కీలకమైంది. అటు పాకిస్తాన్ – ఇటు భారత్ – అటు చైనా మూడు దేశాలతో బంధాలు కలిగివున్న దేశం రష్యా. ఈ మూడు దేశాల మధ్య నెలకొనివున్న విభేదాలను, వివాదాలను ఎంతో కొంత మేరకు తగ్గించగల వెసులుబాటు రష్యాకు ఉంది.

రష్యాతో సంబంధాలు ముఖ్యమే

రష్యా మధ్యవర్తిత్వం వహిస్తే కొన్ని సమస్యలు సమసిపోతాయు. ఈ దిశగా భారత్ కదలాల్సి వుంది.అమెరికాతో బంధాలను మెరుగుపరచుకుంటూనే, రష్యాతో సంబంధాలను కాపాడుకోవాల్సిన అవసరం భారత్ కు ఉంది.అన్నింటి కంటే ముఖ్యం, స్వయం సమృద్ధిని సాధించడం.

దీనిపై మన ఏలికలు దృష్టి సారించాలి. అదే సమయంలో, సమాంతరంగా,ఇరుగుపొరుగు దేశాలతో ద్వైపాక్షిక బంధాలను పటిష్ఠం చేసుకోవాలి.2+2 మంత్రుల స్థాయిలో త్వరలో ప్రారంభం కానున్న సమావేశాలు భారత్ – రష్యాల మధ్య గొప్ప వారధులను నిర్మించాలని కోరుకుందాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

మధ్యతరగతిని నాశనం చేసేస్తున్న కరోనా లాక్ డౌన్

Satyam NEWS

పలుకవా శ్రీవాణీ నీకు ట్రస్టు ఎందుకు పెట్టారు?

Satyam NEWS

నాగచైతన్య రష్మికలతో అదే నీవు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!