30.7 C
Hyderabad
April 19, 2024 07: 17 AM
Slider ప్రత్యేకం

పేద కుటుంబం నుంచి కాంగ్రెస్ చీఫ్ దాకా

#kharge

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి 24 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబయేతర వ్యక్తికి దక్కింది. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన మల్లికార్జున ఖర్గే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌పై భారీ ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఖర్గేకు 50 ఏళ్ల రాజకీయ అనుభవంతో పాటు గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా మంచి పేరుంది. మోదీ విధానాలపై విరుచుకుపడే ఈ ‘ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌’ ఇకపై కాంగ్రెస్‌ రథాన్ని ముందుకు నడిపించనున్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికైన రెండో దళిత నేత(జగ్జీవన్‌రామ్ తర్వాత), కర్ణాటక నుంచి ఎన్నికైన రెండో నేత కూడా ఖర్గేనే (ఎస్‌.నిజలింగప్ప తర్వాత) కావడం మరో విశేషం

. 1942 జులై 21న కర్ణాటకలోని బీదర్‌ జిల్లాలోని వరవట్టి గ్రామంలో పేద కుటుంబంలో ఖర్గే జన్మించారు. తన పాఠశాల విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు అంతా కలబురిగిలోనే కొనసాగింది. రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. బౌద్ధాన్ని అనుసరించే ఖర్గే కలబురిగిలో సిద్ధార్థ్‌ విహార్‌ ట్రస్ట్‌కు వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఉన్నారు. 1968 మే 13న రాధాబాయిని వివాహం చేసుకున్నారు. ఖర్గేకు ఐదుగురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. ఒక కొడుకు ప్రియాంక్‌ ఖర్గే ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రియాంక్‌ గతంలో కర్ణాటక మంత్రిగానూ పనిచేశారు. 1969లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఖర్గే కలబురిగి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో వెనక్కి తిరిగి చూడలేదు.

9 సార్లు ఎం‌ఎల్‌ఏ

గుర్మిత్‌కల్‌ నియోజకవర్గం నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా తిరుగులేని విజయం సాధించారు. గుల్బర్గా నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తొలిసారి భాజపా నేత ఉమేశ్‌ యాదవ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. ఓటమి ఎరుగని రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్న ఖర్గేను తొలిసారి 2019లో పరాజయం పలకరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఓడిపోయారు. గతంలో మన్మోహన్‌ సింగ్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక, రైల్వే, సామాజిక న్యాయ శాఖ మంత్రిగా సేవలందించారు. అంతకుముందు కర్ణాటకలోనూ మంత్రిగా ఉన్నారు. ప్రముఖ కన్నడ సినీస్టార్‌ రాజ్‌కుమార్‌ని స్మగ్లర్‌ వీరప్పన్‌ కిడ్నాప్‌ చేసినప్పుడు, కావేరు నదీ జలాల వివాదం శాంతిభద్రత సమస్యలతో కర్ణాటకలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ఎస్‌.ఎం.కృష్ణ కేబినెట్‌లో ఖర్గే హోంమంత్రిగా ఉన్నారు.

తృటిలో కోల్పోయిన సి‌ఎం పదవి

1999, 2004, 2013 ఎన్నికల్లో ఖర్గే కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని తృటిలో కోల్పోయారు. కొన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధిష్ఠానం ఆయన్ను పక్కన పెట్టినా ఏనాడూ ఆయన సహనం కోల్పోలేదు. ఓటమిని వీడలేదు. నిబద్ధతతో పార్టీని అంటిపెట్టుకొనే ఉన్నారు. స్వాతంత్య్రం సాధించిన తర్వాత దక్షిణ భారతం నుంచి ఏఐసీసీ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన ఆరో నేతగా మల్లిఖార్జున ఖర్గే రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి, కె.కామరాజ్‌, యస్‌.నిజలింగప్ప, పీవీ నర్సింహారావు పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబయేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి.

1976లో తొలిసారిగా దేవరాజ్‌ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి ఆయన మంత్రిగా పనిచేశారు. 1996-99, 2008-09 మధ్య కాలంలో కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు. 2005-08 మధ్య కర్ణాటక ప్రదేశ్‌ కమిటీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 2009లో తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత రైల్వే మంత్రిత్వశాఖతోపాటు న్యాయశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. కర్ణాటకకు దళిత సీఎం అవుతున్నారనే అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా.. ”దళిత సీఎం అని పదే పదే అంటారెందుకు? అలా అనొద్దు. నేను కాంగ్రెస్‌వ్యక్తిని” అని ఖర్గే అంటుండేవారు.

ఓటమి ఎరుగని రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్న ఖర్గేను 2019లో పరాజయం పలకరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఓడిపోయారు. దీంతో ఆయన పనితీరును, సేవలను మెచ్చిన పార్టీ అధిష్ఠానం 2020లో ఆయన్ను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపింది. గులాం నబీ ఆజాద్‌ తర్వాత రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఇటీవలి కాలం వరకు ఖర్గే కొనసాగారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల వేళ పార్టీ నిబంధనల మేరకు ఆయన ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Related posts

విజ‌యీభ‌వ‌: ఒలింపిక్స్ బృందానికి విజయనగరం క‌లెక్ట‌ర్ శుభాకాంక్ష‌లు

Satyam NEWS

బి రమణరెడ్డి కి క్లౌడ్ కంప్యూటింగ్ లో డాక్టరేట్

Satyam NEWS

పెబ్బేరు మత్స్య కళాశాల దేశానికే ఆదర్శంగా నిలవాలి: మంత్రి తలసాని

Satyam NEWS

Leave a Comment