అమ్మఒడి అనేది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పథకం అయినప్పుడు రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం ఎస్.సి., ఎస్.టి.ల అభివృద్ది కోసం కేటాయించిన నిధులను మళ్లిస్తున్నారని ఉత్తరాంధ్రా ఎస్.సి,ఎస్టి.ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెగన షణ్ముఖ రావు అన్నారు.
రెక్కాడితే గానీ డొక్కాడని దళిత,గిరిజన వర్గాలకు చెందిన నిధుల్ని వాడుకోవడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నుండి రూ.12.71, కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ నుండి రూ.395 కోట్లను అమ్మ ఒడి పథకానికి మళ్లించారని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిరుద్యోగులకు వేలాది కార్లు, ట్రక్కులు అందించి స్వయం ఉపాధికి గతంలో బాటలు వేసిన కార్పొరేషన్ నిధుల్ని అమ్మఒడికి తరలించడం ద్వారా వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని షణ్ముఖ రావు అన్నారు.
ఎస్.సి.,ఎస్టి. సబ్ ప్లాన్‌ను పారదర్శకంగా అమలు చేస్తామని ప్రకటించి ఇప్పుడు సబ్ ప్లాన్ నిధుల్ని మళ్లించడం అన్యాయమని అన్నారు. కొత్త పథకం పేరుతో పాత పథకాలకు, సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో కోత విధించడం ఆయా వర్గాలను నమ్మించి గొంతు కోయడమే. అమ్మఒడిని సాకుగా చూపి రూ.1,224 కోట్ల ఫీజ్ రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను పక్కన పెట్టారు. మధ్యాహ్నా భోజన పథకంలో కోతలు విధించారు. కాస్మోటిక్ ఛార్జీలు నిలిపివేశారు. ప్రశ్నిస్తున్న విద్యార్ధులపై లాఠీచార్జ్ చేయించారు. ఇదేనా ప్రభుత్వం పనిచేసే తీరు? అని ఆయన ప్రశ్నించారు.